Health : ప్లాసెంటా నుంచి తీసిన ప్రోటీన్‌.. స్పైనల్ ఆరోగ్యాన్ని మెరుగు పర్చడంలో కీ రోల్ !

by Javid Pasha |

గాయపడిన వెన్నుపూస స్థానంలో పాలిలామినిన్ మందును నేరుగా ఇంజెక్ట్ చేస్తారు. ఇది కొత్త నరాలను పునరుత్పత్తి చేయడంలో, అలాగే విరిగిన నరాల మధ్య బయోలాజికల్ బ్రిడ్జ్ ఏర్పడటానికి సహాయపడుతుంది.

Health : ప్లాసెంటా నుంచి తీసిన ప్రోటీన్‌.. స్పైనల్ ఆరోగ్యాన్ని మెరుగు పర్చడంలో కీ రోల్ !
X

దిశ, ఫీచర్స్ : తల్లి గర్భంలో ఉన్నప్పుడు శిశువుకు సంబంధించిన వివిధ అవయవాలు, మొత్తం శరీరం పెరుగుదలలో ప్లాసెంటా(మావి) కీ రోల్ పోషిస్తుందన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇందులోని ప్రోటీన్ అందుకు సహాయపడుతుందని వైద్య నిపుణులు చెబుతుంటారు. అయితే తాజాగా బ్రెజిల్‌లోని ఫెడరల్ యూనివర్సిటీ ఆఫ్ రియో డి జనీరో (UFRJ) పరిశోధకులు మరో అద్భుతాన్ని కనుగొన్నారు. ఏంటంటే.. నవజాత శిశువు ప్లాసెంటా నుంచి తీసిన లామినిన్ అనే ప్రోటీన్‌ను మెడిసిన్ రూపంలోకి మార్చడం ద్వారా అది మానవుల స్పెనల్ (వెన్నుపూస) ఆరోగ్యాన్ని అత్యంత సమర్థవంతంగా మెరుగు పర్చడంలో, గాయాలను రీ‌ప్లేస్ చేయడంలో సహాయపడుతుందని గుర్తించారు. ఆ వివరాలేమిటో ఇప్పుడు చూద్దాం.

25 ఏండ్లకు పైగా అధ్యయనం

పరిశోధకులు 25 సంవత్సరాలకు పైగా అధ్యయనం చేసి, ఆరోగ్యకరమైన శిశువు ప్లాసెంటా నుంచి తీసిన లామినిన్ ప్రోటీన్ ఆధారంగా ల్యాబ్‌లో అనేక ప్రయోగాలు చేశారు. దీని నుంచి తయారు చేసిన పాలిమర్ రూపమే(polymeric laminin) పాలిలామినిన్ మెడిసిన్. నవజాత శిశువు ప్లాసెంటా నుంచి గ్రహించిన ఈ మందు వెన్నుపాము లేదా వెన్నెము (స్పైనల్ కార్డ్ ఇన్జురీ) గాయాల వల్ల వచ్చే పారాప్లీజియా, క్వాడ్రిప్లీజియా వంటి పక్షవాతాలను తిరిగి సరిచేసే సామర్థ్యం కలిగి ఉందని పరిశోధకులు గుర్తించారు. ఇప్పటి వరకున్న సాధారణ చికిత్సలు గాయాన్ని స్థిరీకరించడం మాత్రమే చేస్తుండగా.. ఈ పాలిలామినిన్ అనే మందు కొత్త ఆక్సాన్లు (నరాల పొడవైన భాగాలు) పెరగడానికి, నరాల మార్గాలను పునర్నిర్మించడానికి సహాయపడి, విచ్ఛిన్నమైన నరాల మధ్య జీవసంబంధిత వంతెన(biological bridge.)ను ఏర్పరుస్తున్నట్లు తేలింది.

ఎలా పనిచేస్తుంది?

వెన్నుపూస గాయం (స్పైనల్ కార్డ్ ఇన్జురీ) స్థానంలో పాలిలామినిన్(polylaminin) మందును నేరుగా ఇంజెక్ట్ చేస్తారు. దీంతో అది శరీరంలోకి ప్రవేశించి కొత్త ఆక్సాన్లు (నరాల పొడవైన భాగాలు) పెరగడానికి, విరిగిన నరాల మధ్య బయోలాజికల్ బ్రిడ్జ్ ఏర్పడటానికి, నరాలను, వెన్నుపూస బోన్స్‌ను పునర్నిర్మించడానికి సహాయపడుతుంది. ఇక ఇది ఎలా ఇస్తారనే విషయానికి వస్తే.. ప్లాసెంటా నుంచి తీసిన లామినిన్‌ను ల్యాబ్‌లో పాలిమర్ రూపంలో మార్చి, పాలిలామినిన్ లిక్విడ్ మెడిసిన్‌గా మారుస్తారు. దీనిని ఇంజెక్ట్ చేస్తారు కాబట్టి స్పైనల్ కార్డ్‌లోని నరాల పునరుత్పత్తిని ప్రోత్సహిస్తుంది. అంటే ఇది ఎమ్బ్రియో అభివృద్ధి(Embryo development) సమయంలో నరాలు అనుసంధానం కావడానికి సహాయపడే సహజ ప్రోటీన్‌ను పునఃసృష్టిస్తుంది.

క్లినికల్ ట్రయల్స్‌లో సత్ఫలితాలు

2026 ప్రారంభంలో బ్రెజిల్ ఆరోగ్య నియంత్రణ సంస్థ అన్వీసా(Anvisa) ఈ పాలిలామినిన్(polylaminin) మెడిసిన్‌కు సంబంధించిన మొదటి దశ (Phase-1) మానవ క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతి ఇచ్చింది. ఇది పూర్తి స్సైనల్ కార్డ్ ఇన్జురీ అంటే వెన్నుపూస గాయం కలిగి ఉన్న రోగుల్లో పరిస్థితిని, భద్రతను పరీక్షించడానికి మాత్రమే ఇవ్వబడింది. కాగా ప్రైమరీ అబ్జర్వేషన్లలో కొంతమంది పారాప్లీజియా, క్వాడ్రిప్లీజియా రోగులు మోటార్ ఫంక్షన్ (కదలిక), సెన్సరీ పర్సెప్షన్ (ఇంద్రియాలు)ను తిరిగి పొందారని సానుకూల నివేదికలు(Prospective reports) వచ్చాయి. దీంతో ఇది భవిష్యత్తులో స్పైనల్ ఆరోగ్యాన్ని మెరుగు పర్చే విప్లవాత్మక మెడిసిన్‌గా మారనుందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఇది ప్రయోగాత్మక దశలోనే ఉంది. లార్జ్ స్కేల్ క్లినికల్ ట్రయల్స్, పీర్-రివ్యూ అధ్యయనాల్లో కూడా పూర్తిస్థాయిలో సత్ఫలితాలు వస్తే ప్రపంచమంతా పాలిలామినిన్ మెడిసిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు. అయితే దీనికి ఇంకా సమయం పడుతుందని కూడా చెబుతున్నారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ నుంచి పలు హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Next Story