- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Friendship : ఎక్కువకాలం బతకాలంటే.. దోస్తులతో చిల్ అవ్వాల్సిందే బ్రో..
Friendship : ఎక్కువకాలం బతకాలంటే.. దోస్తులతో చిల్ అవ్వాల్సిందే బ్రో..

దిశ, ఫీచర్స్ : నవ్వుతూ బతకాలని, ఉన్నంతలో సంతోషంగా, సంతృప్తిగా గడపాలని పెద్దలు ఊరికే చెప్పలేదు. దాని వెనుక ఓ సందేశముందని, అంతకంటే ముఖ్యం ఆరోగ్య ప్రయోజనం ముడిపడి ఉందని నిపుణులు చెబుతుంటారు. అదేంటో కాదు.. మన ఆయుఃప్రమాణం. జీవితంలో ఎక్కువ భాగం సంతోషంగా గడిపేవారు ఎక్కువ రోజులు జీవిస్తారని నిపుణులు అంటున్నారు. అయితే దానికి స్నేహ బంధం తోడైనప్పుడు మరింత ప్రభావవంతంగా పనిచేస్తుందని, సాధారణం కంటే మీ ఆయుష్షు పెరుగుతుందని తాజా అధ్యయనం పేర్కొన్నది.
మనిషి సాధారణ ఆయుష్షును నిండు నూరేళ్లతో పోలుస్తుంటారు. ఈ జమానాలో అంతకాలం జీవిస్తారనే పక్కా గ్యారెంటీ అయితే లేదు గానీ.. సాధారణంకంటే ఎక్కువ కాలం జీవించాలనుకుంటే మాత్రం ఫ్రెండ్స్‌తో చిల్ అవ్వాల్సిందే. ఎందుకంటే స్నేహ బంధాలు అనారోగ్యాల రిస్క్‌ను తగ్గిస్తాయని, తరచుగా కలిసి మెలిసి సంతోషంగా చిల్ అవ్వడంవల్ల ఆయుష్షును పెరుగుతుందని ‘ఎపిడెమియలాజీ అండ్ సైకియాట్రిక్ సైన్సెస్’ జర్నల్ పబ్లిషైన తాజా అధ్యయనం పేర్కొంటున్నది. 2018-19లో బ్రిఘం యంగ్ యూనివర్సిటీ(Brigham Young University) శాస్త్రవేత్తలు అధ్యయనంలోనూ ఈ విషయం వెల్లడైంది. అయితే ఫ్రెండ్‌షిప్ జీవన ప్రమాణాన్ని పెంచడంలో సహాయపడే అంశాలు కూడా అనేకం ఉన్నాయి.
సామాజిక సంబంధాలు
వ్యక్తులు స్నేహితులను కలిగి ఉండటం, తరచుగా వారితో కలిసి చిల్ అవడం వారి జీవన ప్రమాణాలపై ఎలా ప్రభావం చూపుతుందో తెలుసుకోవడానికి పరిశోధకులు 3,849 మందిని రెండు కేటగిరీలుగా విభజించి, సుదీర్ఘకాలంపాటు అబ్జర్వ్ చేశారు. వారిలో అనారోగ్యాలు, అకాల మరణాలు, సహజ మరణాలు వంటి అంశాలను కూడా విశ్లేషించారు. కాగా వీరిలో తరచుగా స్నేహితులతో కలిసి మాట్లాడటం, సామాజిక పరస్పర చర్యల్లో పాల్గొనడం వంటివి కలిగి ఉన్నవారు ఎక్కువ కాలం సంతోషంగా, ఆరోగ్యంగా జీవించారని పరిశోధకులు గుర్తించారు. అలాగే స్నేహితులతో తక్కువ సంబంధాలు కలిగి ఉన్నవారు ఎక్కువగా ఒంటరితనంతో బాధపడటమే కాకుండా, తక్కువ కాలం జీవించారని కూడా గుర్తించారు. అయితే మంచి స్నేహాల వల్ల మాత్రమే ఇక్కడ మేలు జరుగుతుందని, టాక్సిక్ ఫ్రెండ్‌షిప్ వల్ల కాదని కూడా పరిశోధకులు వెల్లడించారు. మీ మేలు కోరే స్నేహ బంధాలు మాత్రమే ఆనందానికి కారణమై ఆయుష్షు పెరగడంలో సహాయపడతాయని కనుగొన్నారు.
సమస్యల పరిష్కారంలో..
సమస్యలు, సవాళ్లు ఎదురైనప్పుడు మీకు మేమున్నామనే భరోసా ఇచ్చే స్నేహితులు, అన్ని పరిస్థితుల్లో అండగా నిలిచే దోస్తులు, కుటుంబ సభ్యులతో కూడా షేర్ చేసుకోలేని విషయాలను, సమస్యలను పరిష్కరించడంలో అనేక సందర్భాల్లో ముందుంటున్నారని రీసెర్చర్స్ పేర్కొన్నారు. అలాగే అనారోగ్యాలు సంభవించినప్పుడు, ప్రియమైన వారు దూరమైనప్పుడు భావోద్వేగ మద్దతును అదించడంలో, కష్టాల నుంచి బయడపడేందుకు సహాయం చేయడంలో క్లోజ్ ఫ్రెండ్స్ సహాయపడుతున్నట్లు గుర్తించారు. స్త్రీలైనా, పురుషులైనా చక్కటి స్నేహబంధాన్ని కలిగి ఉన్నప్పుడు అది ఆనందానికే కాదు, ఆయుష్షు పెరగడానికీ దోహదపడుతుందని గమనించారు. సో.. మీరూ ఎక్కువకాలం జీవించాలనుకుంటే.. చిన్ననాటి స్నేహితులతో కనెక్ట్ అవ్వడం, కలిసి చిల్ అవ్వడం మర్చిపోకండి మరి.






