రెరా సీరియస్.. చట్టవ్యతిరేక ఆన్‌లైన్ యాడ్స్‌పై చర్యలు

by Sujitha Rachapalli |

రియల్ ఎస్టేట్ మోసాలపై ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్న తెలంగాణ రెరా అథారిటీ.. తాజాగా నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్న ఆన్‌లైన్ ప్రకటనలపై గురి పెట్టింది.

రెరా సీరియస్.. చట్టవ్యతిరేక ఆన్‌లైన్ యాడ్స్‌పై చర్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రియల్ ఎస్టేట్ మోసాలపై ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్న తెలంగాణ రెరా అథారిటీ.. తాజాగా నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్న ఆన్‌లైన్ ప్రకటనలపై గురి పెట్టింది. చట్టం ప్రకారం రెరా రిజిస్ట్రేషన్ లేని ఏ ప్రాజెక్టు కూడా ప్రీలాంచ్/ ప్రీసేల్ ఆఫర్లు, ఆసక్తి వ్యక్తీకరణ పేరుతో ముందస్తు ప్రకటనలు ఇవ్వడం, డబ్బులు వసూలు చేయడం నేరం. అలాగే రెరాలో నమోదైన ప్రాజెక్టు ప్రకటన సైతం నిబంధనలకు లోబడే ఉండాలి. కానీ నిబంధనలకు విరుద్ధంగా ఆన్‌లైన్ వేదికగా సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రకటనలు వస్తున్నాయని గుర్తించిన రెరా.. గతేడాది అక్టోబర్‌లో అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ) సంస్థతో కలిసి చ0ర్యలు తీసుకునేందుకు నిర్ణయించింది.

సోషల్ మీడియాపై నిఘా

సోషల్ మీడియాలో వచ్చే రియల్ ఎస్టేట్ ప్రకటనలపై రెరా నిఘా పెట్టింది. రెరా రిజిస్టర్ లేకుండా ప్రీలాంచ్ ప్రకటనలు ఇచ్చే డిజిటల్ మీడియా పోస్టులను, నమోదైన ప్రాజెక్టుల్లో రెరా నెంబర్‌ను స్పష్టంగా పొందుపరచని ప్రకటనలను ఎప్పటికప్పుడు అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ) సేకరించి.. ఆ లింకులను, సంబంధిత ప్రమోటర్/డెవలపర్ నిర్మాణ సంస్థ వివరాలను తెలంగాణ రెరా అథారిటీకి పంపిస్తుంది. ఇప్పటివరకు 537 ఆన్‌లైన్ ప్రకటనలను గుర్తిస్తే.. అందులో నిబంధనలను ఉల్లంఘించిన 451 ప్రకటనల మీద సంబంధిత ప్రమోటర్లకు ఇంటిమేషన్ నోటీసులు పంపించింది. అందులో 175 ప్రమోటర్ల నుంచి ప్రతిస్పందన కూడా వచ్చింది. రెరా చట్టానికి లోబడి ప్రకటనలు ఇస్తామని ఆయా ప్రమోటర్లు, డెవలపర్లు తమ సమ్మతిని తెలిపారు. అయితే ఇందులో ఇప్పటివరకు ప్రతిస్పందించని.. సమ్మతి తెలపని 276 ప్రకటనలకు సంబంధించి ఆయా ప్రమోటర్లు, డెవలపర్ల సంస్థలకు నోటీసులు ఇచ్చేందుకు రెరా అథారిటీ సిద్ధమైంది.

రిజిస్టర్ నెంబర్ తప్పనిసరి

ప్రీలాంచ్/ప్రీసేల్, ఆసక్తి వ్యక్తీకరణ వంటి ముందస్తు చట్టవ్యతిరేక ప్రకటనలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని రెరా స్పష్టం చేసింది. ఇష్టానుసారం ప్రకటనలతో ఇల్లు/ప్లాట్ కొనుగోలుదారులను మోసం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని బిల్డర్లను హెచ్చరించింది. ప్రకటనల్లో కొందరు కేవలం ‘రెరా రిజిస్టర్డ్’ అని మాత్రమే పొందుపరుస్తున్నారు కానీ రిజిస్టర్డ్ నంబర్ కూడా ఉండాలని... ‘రెరా రిజిస్టర్డ్ నంబర్‌ను పొందుపరిచిన ప్రకటనలనే పరిగణలోకి తీసుకోవాలి. ఆ నంబర్ ద్వారా రెరా అధికారిక వెబ్‌సైట్ (https://rera.telangana.gov.in)లో ప్రాజెక్ట్ వివరాలు, భూ హక్కు పత్రాలు, సంబంధిత ధృవపత్రాలు, ప్లాన్ అనుమతులు, లేఅవుట్ ప్రణాళికలు, డబ్బు చెల్లించబోయే సంబంధిత ప్రాజెక్టు బ్యాంకు ఖాతా, ప్రాజెక్ట్ పూర్తి కాబోవు తేదీ, ప్రమోటర్ వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసుకుని, పూర్తి బాధ్యతతో కొనుగోలు నిర్ణయం తీసుకోవాలి.

చట్టపరమైన చర్యలు

ఒకవేళ ప్రకటనల్లో రెరా రిజిస్టర్డ్ నెంబర్ పొందుపరచక పోయినా.. లేదా ఫేక్ నెంబర్ పొందుపరిచినట్టు గుర్తించినా.. కొనుగోలుదారులు వెంటనే ఫోన్: 040-29394972, వాట్సాప్: 9000006301, ఈ-మెయిల్: ([email protected] ) ద్వారా రెరా దృష్టికి తీసుకురావాలని సూచించింది. ఫిర్యాదులను స్వీకరించిన అథారిటీ చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేసింది. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు ఇచ్చే రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, ఛానెల్ పార్ట్‌నర్స్, అడ్వర్టైజింగ్ ఏజెన్సీలపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Next Story