దేశంలోనే బిగ్ ల్యాండ్ డీల్.. అక్కడ ఎకరాకు రూ. 752.71 కోట్లు!

by Javid Pasha |

సౌత్ ముంబైలోని నారీమన్ ప్రాంతంలో మెట్రో రైల్ కార్పొరేషన్‌కు చెందిన 4.61 ఎకరాల భూమిని ఆర్‌బీఐ రూ. 3,472 కోట్ల రికార్డు ధరకు కొన్నది. అంటే ఒక్కో ఎకరాకు రూ. 752.71 కోట్లు ఖర్చు చేసింది.

దేశంలోనే బిగ్ ల్యాండ్ డీల్.. అక్కడ ఎకరాకు రూ. 752.71 కోట్లు!
X

దిశ, బిజినెస్ బ్యూరో : భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) భారీ మొత్తం వెచ్చించి భూమి కొనుగోలు చేయడం ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో చర్చనీయాంశమైంది. సౌత్ ముంబైలోని నారీమన్ ప్రాంతంలో మెట్రో రైల్ కార్పొరేషన్‌కు చెందిన 4.61 ఎకరాల భూమిని ఆర్‌బీఐ రూ. 3,472 కోట్ల రికార్డు ధరకు కొన్నది. అంటే ఆర్‌బీఐ ఒక్కో ఎకరాకు రూ. 752.71 కోట్లు ఖర్చు చేసింది. ఇది దేశంలోనే అతిపెద్ద భూ ఒప్పందాలలో ఒకటిగా నిలిచిందని రియల్ ఎస్టేట్ వర్గాలు తెలిపాయి. 1970ల ప్రారంభంలో ప్రధాన ప్రణాళికాబద్ధమైన వాణిజ్య జోన్‌గా ఆవిర్భవించిన తర్వాత నారిమన్ పాయింట్‌లోని ఒక భూమిని వేలం వేయడం ఇదే మొదటిసారి.

స్టాంప్ డ్యూటీ రూ.208.3 కోట్లు

రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ సీఆర్ఈ మ్యాట్రిక్స్ యాక్సెస్ చేసిన డాక్యుమెంట్ల ప్రకారం.. సెప్టెంబర్ 5న ఈ లావాదేవీ కోసం ఆర్‌బీఐ రూ.208.3 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించింది. ఈ స్థలాన్ని సొంత కార్యాలయ వినియోగంతో పాటు వాణిజ్య ప్రయోజనాల కోసం కొనుగోలు చేసినట్టు ఆర్‌బీఐ పేర్కొన్నది. బాంబే హైకోర్టు, ఇతర కార్పొరేట్ హెడ్‌క్వార్టర్లకు దగ్గరలో ఉన్న ఈ స్థలాన్ని మొదట వేలం వేయాలని మెట్రో రైల్ భావించింది. కానీ ఆర్‌బీఐ తన హెడ్‌క్వార్టర్స్‌ను విస్తరించాలని భావించడం, ఈ స్థలంపై ఆసక్తి చూపడంతో ఆర్‌బీఐ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకున్న ముంబై మెట్రో వేలానికి సంబంధించిన టెండర్ రద్దయింది. ప్రస్తుతం ఆర్‌బీఐ ప్రధాన కార్యాలయం దక్షిణ ముంబైలోని ఫోర్ట్‌లో ఉంది. తాజా భూమి కొనుగోలు ద్వారా ముంబై రియల్ ఎస్టేట్ రంగంలో ఆర్‌బీఐ తన ఆస్తులను మరింత విస్తరించింది. ఇప్పటికే మింట్ రోడ్, మరికొన్ని చోట్ల సెంట్రల్ బ్యాంకుకు స్థిరాస్తులు ఉన్నాయి.

గతంలోనూ భూ కొనుగోలు..

ఆర్‌బీఐ తాజా కొనుగోలు ఇప్పటివరకు అత్యధికం కాగా, గతంలోనూ దాదాపు ఇంతే మొత్తం భూమి కొనుగోలు జరిగింది. 2019, జూన్‌లో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ నిర్వహించిన వేలంలో సుమిటొమో కార్పొరేషన్ బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో(బీకేసీ)లో 3 ఎకరాల కోసం రూ. 2,238 కోట్లకు బిడ్ వేసింది. దీనర్థం సుమిటొమో కంపెనీ ఒక్కో ఎకరాకు రూ. 746 కోట్లను కేటాయించింది. అంతకుముందు కూడా ముంబైలో రికార్డు స్థాయిలో స్థలాల విక్రయ ఒప్పందాలు జరిగాయి. 2007లో వాద్వా గ్రూప్ బీకేసీలో 2 ఎకరాల కోసం రూ. 831 కోట్లకు కొనడానికి బిడ్ వేసింది. ఆ తర్వాత అదే ఏడాది బీకేసీలోనే 2 ఎకరాల కోసం టీసీజీ అర్బన్ ఇన్‌ఫ్రా, హీరానందాని గ్రూప్ కలిసి రూ. 1,041 కోట్లను అంటే ఎకరాకు రూ. 500 కోట్లపైనే చెల్లించాయి. 2010లో లోధా గ్రూప్ సెంట్రల్ ముంబైలో ఉన్న వడాలా ప్రాంతంలో 6.2 ఎకరాల కోసం రూ. 4,050 కోట్లకు బిడ్ వేసింది. అంటే ఎకరాకు రూ. 653 కోట్లు వెచ్చించింది.

Next Story