వన్యప్రాంతంలో.. మన్యం రాణి.!

by Daayi Srishailam |

పూర్వీకుల ఆహారాన్ని ఆధునిక పద్ధతిలో అందిస్తూ మూలాలను టచ్ చేస్తోంది

వన్యప్రాంతంలో.. మన్యం రాణి.!
X

దిశ, ఫీచర్స్: మన పూర్వీకులు ఏం తినేవాళ్లు.? ఎంత ఆరోగ్యంగా ఉండేవాళ్లు.? ఇప్పుడు మనం ఏం తింటున్నాం.? ఎలాంటి ఆరోగ్యాన్ని కలిగి ఉంటున్నాం.? 30 ఏళ్లు నిండకముందే అనారోగ్యాల పాలై.. నలభయ్యేళ్లకే నానా తంటాలు పడుతున్నాం. అలా కాకుండా పూర్వీకుల ఆహారాన్ని ఆధునిక పద్ధతిలో అందిస్తే బావుంటుందని అధ్యయనం చేసి మూలాలను టచ్ చేస్తోంది షెఫ్ రాధికా ఖండేల్వాల్.

ఆధునిక జీవనశైలికి తగ్గట్టు..

రాధికా ఖండేల్వాల్ ఢిల్లీలోని ఓ ప్రముఖ రెస్టారెంట్ ఓనర్ కం ఛీఫ్ షెఫ్. వన్యప్రాంతాల్లో దొరికే ప్రకృతి పదార్థాలను ఆధునిక జీవనశైలికి తగ్గట్టు వివిధ రూపాల్లో అందిస్తూ ఆరోగ్యసూత్రాలు బోధిస్తోంది. మన మూలాలను తిరిగి పరిచయం చేస్తూ శారీరక దృఢత్వానికి దోహదపడే పదార్థాలను అందిస్తోంది. వంటగది మాత్రమే కాదు.. ప్రకృతి పదార్థాలు సేకరించడం ఆమె దినచర్య. దేశంలోని వివిధ వన్యప్రాంతాల నుంచి సేకరించి వాటిని ఆధునిక రుచులుగా మారుస్తోంది. ఆమె మెనూలో మష్రూమ్ షప్టా విత్ సీ బక్‌థార్న్ ఆయిల్, ఆప్రికాట్ చికెన్ విత్ వైల్డ్ ఆప్రికాట్స్ వంటివి బెస్ట్ సెల్లర్స్.

సాహసమే చేస్తుంది..

ఖండేల్వాల్.. ప్రకృతి పదార్థాల సేకరణ సాహసోపేతం. సీ బక్‌థార్న్ బెర్రీల కోసం ఆమె లడఖ్‌లోని నుబ్రా వ్యాలీకి వెళ్తుంది. ఈ బెర్రీలు ఎత్తయిన ప్రాంతాలు.. పొడి వాతావరణంలో పెరుగుతాయి. అక్కడికి చేరుకోవడం.. బెర్రీల సేకరణ కష్టంతో కూడుకున్న పని. ముగ్గురు నలుగురు చెట్టును కదిలిస్తే.. దాని కింద దుప్పట్లు పట్టుకుని బెర్రీలు సేకరిస్తారు. ఉత్తరాఖండ్‌లో కఫాల్, హిమాచల్ ప్రదేశ్‌లో చాన్టరెల్ మష్రూమ్స్, మహారాష్ట్రలోని సవంత్వాడి నుంచి తక్లా, గోవాలో అంబా హల్దీ వంటివి ఆమె సేకరిస్తుంది. ఈ పదార్థాలను స్థానిక సముదాయాల నుంచి సేకరిస్తుంది. వాటిని రాధిక ప్రత్యేక రుచులుగా మారుస్తుందన్నమాట.

జీరో వేస్ట్ విధానం..

ఆమె రెస్టారెంట్‌లో ఫార్మ్-టు-ఫోర్క్, జీరో-వేస్ట్ విధానం అమలవుతుంది. తను సైకాలజీ డిగ్రీ చదువుతున్నప్పుడు ఆస్ట్రేలియాలో కిచెన్‌లలో అప్రెంటిస్‌గా పనిచేసింది. మొదట సర్వర్‌గా, తర్వాత షెఫ్‌గా మారింది. అక్కడే ఆమెకు ఫుడ్ వేస్ట్ గురించి అవగాహన వచ్చింది. ఆస్ట్రేలియాలో 'అగ్లీ' పండ్లు, కూరగాయలను తక్కువ ధరకు అమ్మడం చూసి ఆమె జీరో-వేస్ట్ టెక్నిక్‌లను అలవర్చుకుంది. ఇప్పుడు ఆమె యునైటెడ్ నేషన్స్ ఎస్‌డీజీ2 జీరో హంగర్లో భాగమైన చెఫ్స్ మానిఫెస్టోలో ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తోంది. లోకల్ పదార్థాలనే ఆమె ప్రోత్సహిస్తుంది.

బయోడైవర్సిటీని కాపాడేలా..

రాధికా వంటలలో స్థానిక పదార్థాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఉదాహరణకు స్కిన్నీ చిప్పిన్. దీన్ని కూరగాయల తొక్కలు.. కాలీఫ్లవర్ కాండాలను కలిపి చేస్తారు. వర్షాకాలంలో తక్లా ఆకులుతోనే కొత్త వంటలు చేస్తారు. కానే ధనియా.. హమ్మింగ్‌బర్డ్ ట్రీ ఫ్లవర్‌.. సాబు దానా.. పుదీన వంటి లోకల్ పదార్థాలనే వంటల్లో అదనపు ఫ్లేవర్‌గా జోడిస్తుంది. ఇలా రాధికా ఖండేల్వాల్ వంటలు అడవుల్లో దొరికే పండ్లు.. కాయలు.. ఆకులతో ఉండి పర్యావరణహితంగా ఉంటాయి. పాత పదార్థాలే అయినా ఆధునిక పద్ధతుల్లో అందిస్తూ ఇంకోవైపు బయోడైవర్సిటీని కాపాడేలా ఉంటాయి.

Next Story