- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జింకల కోసం.. 50 ఎకరాల భూమిని అడవిగా మార్చాడు.!
ఈ జింకలు గొర్రెలు, ఆవులతో సామరస్యంగా సహజీవనం సాగిస్తున్నాయి.

దిశ, ఫీచర్స్: తమిళనాడులోని పుదుపాళయం గ్రామంలో 70 ఏళ్ల రైతు ఆర్. గురుసామి తన 60 ఎకరాల వారసత్వ భూమిలో 50 ఎకరాలను జింకల కోసం వదిలిపెట్టాడు. 1998లో మూడు జింకలతో ప్రారంభమైన ఈ ప్రయాణం ఇప్పుడు 1,800 జింకలకు సురక్షిత ఆశ్రయంగా మారింది. ఈ జింకలు గొర్రెలు, ఆవులతో సామరస్యంగా సహజీవనం సాగిస్తున్నాయి.
జింకలపై ప్రేమతో..
1998లో ఒక రోజు గురుసామి తన గొర్రెలతో కలిసి మూడు చుక్కల జింకలు గడ్డి మేయడం గమనించాడు. ఇవి సమీపంలోని మెట్టుపాళయం అడవి నుండి నీరు, ఆహారం కోసం వచ్చాయని గ్రహించాడు. ఖౌసీఖా నది ఒకప్పుడు సంవత్సరం పొడవునా నీటితో ఉండేది.. కానీ ఇప్పుడు ఎండిపోయింది. సాగునీటి కోసం భూగర్భ జలాల అధిక వినియోగం వల్ల నీటి మట్టం కూడా తగ్గింది. అలా నీటి సమస్యతో జింకలు వచ్చి ఉంటాయనేది అతడి అభిప్రాయం. తనకున్న 60 ఎకరాల భూమిలో 15 ఎకరాలలో మాత్రమే మొక్కజొన్న, పత్తి పంటలతో వ్యవసాయం చేసేవాడు.
50 ఎకరాలు జింకల కోసమే..
60 ఎకరాల్లో 15 ఎకరాలు సాగుకుపోగా ఇంకా 45 ఎకరాలు ఉంటుంది కదా. ఆ భూమి జీవాలకు ఉపయోగపడాలని దాంట్లో 100కు పైగా ఆవులు, గొర్రెల కోసం మేత కోసం వదిలేశాడు. అక్కడక్కడా స్థానిక మొక్కలను నాటాడు. ఆవు పేడను సేంద్రియ ఎరువుగా వాడుతూ వ్యవసాయం కొనసాగించాడు. ఈ ఆకుపచ్చ భూమి జింకలకు ఆహారం, ఆశ్రయం అందించే సురక్షిత స్థలంగా మారింది. జింకలు ఈ భూమిని తమ ఇంటిగా చేసుకున్నాయి. చివరికి తన వ్యవసాయ భూమిని 10 ఎకరాలకు తగ్గించి 50 ఎకరాలను జంతువుల కోసం వదిలిపెట్టాడు గురుసామి.
నీళ్లకోసం రెండు చెరువులు..
జింకల సంఖ్య 2005 నాటికి గణనీయంగా పెరిగింది. అయితే ఇది స్థానిక రైతులకు సమస్యగా మారింది. జింకలు సమీప గ్రామాల్లోని పొలాల్లోకి చొరబడి నీరు తాగడం, పంటలను నాశనం చేయడం జరిగేవి. రైతులు జింకలను తరిమికొట్టడానికి కుక్కలను ఉసిగొలిపేవాళ్లు. దీనివల్ల జింకలు భయపడి రోడ్డు ప్రమాదాలకు గురయ్యాయి. జింకల సంఖ్య పెరగడం వల్ల వేటగాళ్లు కూడా వచ్చేవాళ్లు. గురుసామి తన స్నేహితుడు బాలసుందరంతో కలిసి 2008, 2010లో రెండు వేట బృందాలను పట్టుకుని ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌కు అప్పగించారు. జింకలు బయటకు వెళ్లకుండా తన భూమిలో రెండు చెరువులను నిర్మించాడు గురుసామి.
సొంత ఇంటిగా..
జింకలకు వాటిల్లుతున్న ముప్పును దృష్టిలో ఉంచుకుని గురుసామి వాటిని సురక్షిత ప్రాంతానికి తరలించాలని అధికారులను కోరాడు. కానీ స్థానమార్పిడి సవాళ్లతో కూడుకున్నదని అధికారులు చెప్పారు. జింకల భవిష్యత్తు అనిశ్చితంగా ఉన్నప్పటికీ వాటిని రక్షిస్తున్నాడు గురుసామి. అతడి కృషి స్థానిక సమాజంలో చర్చనీయాంశంగా మారింది. 2005లో ఒక స్థానిక వార్తాపత్రిక ఈ జింకల గురించి రాసింది. దీంతో పట్టణవాసులు, ఎన్జీఓల నుంచి గురుసామికి మద్దతు దొరికింది. ఇప్పుడు తన 50 ఎకరాల భూమి చిన్న అడవిలా మారింది. దీనిని జింకలు సొంత ఇంటిగా మార్చుకొని స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి,.






