పుష్ప.. పుష్పా ప్రకాశ్ నీ యవ్వ 68 ఏళ్లొచ్చినా తగ్గేదే లే.. రప్ప రప్ప ఎక్కుడే.!

by Daayi Srishailam |

68 ఏళ్ల వయసులో అవలీలగా పర్వతాలు ఎక్కుతున్న బెంగళూరుకు చెందిన పుష్ప ప్రకాశ్

పుష్ప.. పుష్పా ప్రకాశ్ నీ యవ్వ 68 ఏళ్లొచ్చినా తగ్గేదే లే.. రప్ప రప్ప ఎక్కుడే.!
X

వామ్మో..

ఈ మధ్య బామ్మలు బగ్గ ఉషారైతుండ్రు.

60 ఏండ్లు.. 70 ఏండ్లలో కూడా ఇరగదీస్తుండ్రు.

ఇగో ఇక్కడొక బామ్మ వయసు 68 సంవత్సరాలు.

ఈ వయసులో లేస్తే కూసోరాదు.. కూసుంటే లేవరాదు.

కానీ..

ఈ బామ్మ సూడున్రీ ఏకంగా పర్వతాలే ఎక్కుతోంది.

- దిశ, ఫీచర్స్

ఈ బామ్మ పేరు పుష్పా ప్రకాశ్. "పుష్పా అంటే ఫ్లవరనుకుంటివా.. ఫైరూ" అని యూత్ అవాక్కయ్యేలా చేస్తోంది. లేచి నాలుగు అడుగులు వేయడానికే "అమ్మో అయ్యో" అని ఆపసోపాలు పడే జనాలున్న ఈ రోజుల్లో ఈ బామ్మ వరుసబెట్టి పర్వతాలెక్కుతోంది.

మూడేళ్లలో 49 ట్రెక్కింగ్స్

పుష్పా ప్రకాశ్‌‌ది బెంగళూరు. ఆమెకు చిన్నప్పటి నుంచి సాహసాలు చేయడమంటే ఇష్టం. కానీ పెళ్లయిన తర్వాత అవన్నీ వీలవుతాయా.? ఏదో సరదాగా ఒకసారి ట్రెక్కింగ్ ప్లాన్ చేసింది. అదే ఆమె ఫస్ట్ ట్రెక్. ఒకరకంగా అదో పెద్ద ట్రెక్ కానే కాదు. తన కూతురుతో కలిసి చేసిన చిన్న యాత్రంతే. కానీ.. ఆ రోజు తన జీవితంలో ఏదో మార్పొచ్చింది. స్వచ్ఛమైన గాలి.. స్థిరమైన నడక.. కొన్నేండ్ల తర్వాత మొదటిసారి స్వేచ్ఛను ఆస్వాదిస్తున్న అనుభూతి కలిగింది. అదే స్ఫూర్తితో ఆమె కేవలం మూడేళ్లలోనే 49 ట్రెక్కింగ్స్ కంప్లీట్ చేసింది.

వయసు ఆటంకం కాదు..

68 ఏళ్ల వయసున్న పుష్పా బామ్మ న్యూజీలాండ్లో స్కైడైవింగ్.. గ్రేట్ బారియర్ రీఫ్‌లో స్కూబ డైవింగ్.. సౌతాఫ్రికాలో అత్యంత ఎత్తయిన బంజీ జంప్.. జింబాబ్వే.. జాంబియా లోయల మీద స్వింగ్ ఇలా ఒక్కో సాహసాన్ని ఒక్కో దేశంలో పూర్తిచేసింది. 50 ఏళ్ల వయసులో ఈ రకమైన జీవనశైలిని ఎంచుకుంది ఈ బామ్మ. చాలామంది ఈ వయసులో సౌకర్యవంతమైన జీవితాన్ని ఎంచుకుంటారు. కానీ పుష్ప బామ్మ మాత్రం సాహసాలను ఎంచుకొని.. సాహసాలకు వయసు ఆటంకం కాని నిరూపిస్తోంది.

కూతురే స్ఫూర్తి

పుష్పా ట్రెక్కింగ్ యాత్రకు ప్రధాన కారణం తన కూతురు సుమా సరస ప్రకాశ్. మొదట్లో ఇద్దరు కలిసి బెంగళూరు సమీపంలోని అడవీ మార్గాల్లో మార్నింగ్ వాక్‌కు వెళ్లేవారు. తర్వత్తర్వాత అవే సాహసయాత్రకు దారితీశాయి. ట్రెక్కింగ్ గురించి చెప్పి.. చిన్న చిన్న ఫీట్లు చేసి ఆ తర్వాత పెద్ద ట్రెక్కింగ్స్ అలవాటు చేసింది తన కూతురు. ఆమె సలహాతోనే 18,000 అడుగుల ఎత్తులో ఉన్న ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌తో సహా దీమనకింద.. కనకపుర.. వనంతమరి వంటి ట్రెక్కింగ్స్ పూర్తి చేసింది. మాగ్జిమమ్ పుష్ప ట్రెక్కింగ్స్‌లో తన కూతురు ఉంటుంది.

సాహసాలకు గుర్తింపుగా

పుష్ప జిమ్‌కు వెళ్లదు. ఆధునిక ఫిట్నెస్ ఎక్స్‌పరిమెంట్స్ చేయదు. కానీ ఆమె లైఫ్ స్టయిల్ పూర్తి క్రమశిక్షణతో నిండి ఉంటుంది. ఆమెకు బీపీ.. షేగర్ వంటి సమస్యలేవీ లేవు. పొద్దున్నే 3:15కు నిద్రలేస్తుంది. 5:30 లోపు ఫ్రెషప్ అయ్యి ముద్రా ధ్యానం.. యోగాసనాలు కంప్లీట్ చేస్తుంది. గార్డెనింగ్ వర్క్.. పక్షులకు ఆహారం పెట్టడం వంటివన్నీ పదింటివరకు పూర్తిచేస్తుంది. పుష్ప సాహసయాత్రలకు గుర్తింపుగా 2024లో వైశ్య లైఫ్ టైమ్ అవార్డ్స్ ఫర్ ఉమెన్ నుంచి ట్రెక్కర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకుంది.

Next Story