ఇన్వెస్ట్‌మెంట్ డబుల్ అవుతుందని కస్టమర్లకు టోకరా

by Sujitha Rachapalli |

24 నెలల్లో ఇన్వెస్ట్‌మెంట్ డబుల్ అవుతుందని కస్టమర్లను నిండా ముంచి బోగస్ కంపెనీ.. పోలీస్ స్టేషన్‌కు బాధితులు.. ఈ విషయాన్ని సభలో ప్రస్తావించిన ఎమ్మెల్యే

ఇన్వెస్ట్‌మెంట్ డబుల్ అవుతుందని కస్టమర్లకు టోకరా
X

దిశ, తెలంగాణ బ్యూరో: లక్ష పెట్టండి.. 25 నెలల్లో డబుల్ అవుతుందంటరు. ప్రతి నెలా వడ్డీతో కలిపి మీ డబ్బులు మీకు తిరిగిచ్చేస్తమని కబుర్లు చెప్తరు. అరచేతిలో స్వర్గం చూపించి మోసం చేస్తరు. కొన్ని కంపెనీల తీరు ఇదే. తాము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నామని ప్రచారం చేస్తున్నాయి. నాలుగైదు నెలల వరకు ఓకే.. పీడీసీల ఆశ చూపి కోట్లు కొల్లగొడుతయి. నెలకు రూ.100కు రూ.4 వడ్డీ చెల్లించే స్థాయి వ్యాపారాలు చేస్తున్నారా? అదెలా సాధ్యం? అలాంటప్పుడు వారే బ్యాంకుల నుంచి రూపాయికి మించని వడ్డీతో రుణాలు తీసుకొని వ్యాపారం చేయొచ్చు కదా! అన్న సందేహాలు కలుగుతున్నాయి. ప్రధానంగా పుడమి వంటి రియల్ ఎస్టేట్ కంపెనీలు మార్కెటింగ్ వ్యవహారం ఇది. యాదాద్రి, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో ప్రాజెక్టులను చూపించి పెట్టుబడుల రూపంలో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అనేక రియల్ ఎస్టేట్ కంపెనీలు ప్రీలాంచ్ ఆఫర్ల పేరిట దందాలు చేసి వేల కోట్లకు ముంచేసి బోర్డులు తిప్పేస్తే.. ఇప్పుడీ బై బ్యాక్, అధిక వడ్డీ ఆశ చూపి లాగేస్తున్న వందల కోట్లకు సంబంధించిన బాధితులు కూడా మోసపోయామని లబోదిబో అంటున్నరు. ఇప్పటికే ఈ పుడమి ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ మోసాలకు బలైన అనేక మంది బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. పలువురు బాధితులు సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంను కలవగా.. ఆయన ఆ మోసాలపై మండలిలో ప్రస్తావించడం విశేషం. అందుకే ఈ పుడమి వంటి కంపెనీ మోసాలకు బలి కావద్దని నిపుణులు సూచిస్తున్నారు.

ఇన్వెస్ట్‌మెంట్ కాన్సెప్ట్

పైసా సొంతంగా పెట్టకుండా జనం సొమ్ముతోనే వందల ఎకరాలు కొనుగోలు చేసి బిజినెస్ చేస్తున్నారు. చిట్ ఫండ్స్, ఫైనాన్స్ అనుభవంతో అవే కంపెనీలు కస్టమర్ల నుంచి ఇన్వెస్ట్‌మెంట్ రూపంలో కోట్లు వసూలు చేస్తున్నాయి. ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీ కాన్సెప్ట్ అంటూ కొత్త వ్యాపారానికి తెర తీశారు. తమ ప్రాజెక్టులో పెట్టుబడి పెడితే ముందే కొంత ల్యాండ్‌ను మీ పేరిటే రిజిస్ట్రేషన్ చేస్తాం.. ఏడాది, రెండేండ్లల్లోనే ఆ ప్రాజెక్టు పూర్తవుతుంది.. అప్పుడు మీరు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు ల్యాండ్‌ను ప్లాట్ రూపంలో అందజేస్తామంటూ ఊరిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో రూ.50 లక్షలకు ఎకరం ఉంటే రూ.కోటికి పైగా లెక్కించి కస్టమర్లకు అంటగడుతున్నారు. ఇలాంటి బిజినెస్ చేస్తోన్న రియల్ ఎస్టేట్ కంపెనీలు దివాళా తీస్తున్నాయి.

ష్యూరిటీకి అంత విలువేది?

కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు వారి దగ్గర పెట్టుబడి పెడితే దానికి సమానమైన ల్యాండ్‌ని ముందే రిజిస్ట్రేషన్ చేస్తామంటున్నాయి. రూ.14 లక్షలు కడితే 2 గుంటల భూమి. రూ.24 లక్షలు కడితే 4 గుంటలు రిజిస్ట్రేషన్. మరి నిజానికి వారు ష్యూరిటీగా చూపించే ల్యాండ్‌కి అక్కడ బహిరంగ మార్కెట్లోనైనా వీరికి లాభం చేకూరేటట్లుగా ఉందా? అంటే సగం కూడా రాదని తెలుస్తున్నది. ఎవరైనా ఇన్వెస్ట్ చేసేవారు పెట్టుబడికి కనీసం సమానమైన ల్యాండ్‌నైనా ష్యూరిటీగా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే అసలుకే మోసం అవుతుందని గ్రహించాలని ఆర్ధిక నిపుణులు సూచిస్తున్నారు. పుడమి రియల్ ఎస్టేట్ కంపెనీ నల్లగొండ జిల్లా చిట్యాల మండలం శివనేనిగూడెం, యాదగిరిగుట్ట తదితర ప్రాంతాల్లో భూములను కస్టమర్లకు చూపించింది. అమాయక జనాల నుంచి వందల కోట్లు దండుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటుంది. బై బ్యాక్ ఆఫర్ పేరిట దోచుకున్నారు. లక్షకు రెండు లక్షలు ఇస్తామని టోకరా వేశారు. 24 నెలల్లోనే పెట్టిన పెట్టుబడికి డబుల్ వస్తుందంటూ మోసాలకు పాల్పడ్డారు. పెట్టుబడి పెట్టిన మొదటి నాలుగైదు నెలల వరకు మాత్రం సక్రమంగా ఇచ్చి ఆకట్టుకోవడం ఈ కంపెనీ వ్యూహం. జనగామకు చెందిన నలుగురు రూ.4 లక్షలు, రూ.3 లక్షలు, రూ.లక్ష, రూ.6 లక్షలు, బేగంపేటకు చెందిన ఒకరు రూ.6 లక్షలు, నల్లగొండకు చెందిన ఒకరు రూ.14 లక్షలు, వాయిళ్లపల్లికి చెందిన ఒకరు రూ.21 లక్షలు, మరొకరు రూ.15 లక్షలు, అప్పాజిపేటకు చెందిన ఒకరు రూ.6 లక్షలు, ఇద్దరు రూ.లక్ష వంతున, హయత్ నగర్ కు చెందిన ఒకరు రూ.15 లక్షలు, నాచారంకు చెందిన ఒకరు రూ.లక్ష, లచ్చమ్మగూడెంకు చెందిన ఒకరు రూ.లక్ష, సికింద్రాబాద్‌కు చెందిన ఒకరు రూ.6 లక్షల వంతున పెట్టారు. ఇలా పెద్ద సంఖ్యలో జనాలు పెట్టుబడులు పెట్టారు.

భలే ప్రమోషన్ క్యాడర్స్

క్యాడర్ కమీషన్ 60 రోజుల్లో టార్గెట్ ప్రమోషన్ టార్గెట్

బీడీఈ 3 శాతం రూ.25 లక్షలు రూ.50 లక్షలు

బీడీవో 4 శాతం రూ.50 లక్షలు రూ.2.50 కోట్లు

ఎంఎం 5 శాతం రూ.50 లక్షలు రూ.10 కోట్లు

సీఎంఎ 5.5 శాతం రూ.50 లక్షలు రూ.50 కోట్లు

ఇలా ఏజీఎంకు 6 శాతం, డీజీఎంకు 6.5 శాతం, జీఎంకు 7 శాతం, డిప్యూటీ డైరెక్టర్ కు 7.5 శాతం, ఫ్రాంచైజీస్ కి 8 శాతం, డైరెక్టర్ కి 8.5 శాతం కమీషన్ ఉంటుంది. వాళ్లకూ టార్గెట్ ఉంటుంది. అలాగే ప్రమోషన్ టార్గెట్లు ఉంటాయి. ఇది పుడమి కంపెనీ వాళ్లు ఏజెంట్లను రంగంలోకి దింపేందుకు రూపొందించిన ప్లాన్. హోటళ్లల్లో సమావేశాలు పెట్టి ఇలాంటి వ్యూహాలను వారి చేత అమలు చేయించారు. అలాగే కంపెనీ లక్ష్యాలను చేరుకుంటే భలే ఆఫర్లు పెట్టారు. ప్రధానంగా గోవా, థాయిలాండ్ ట్రిప్పులకు తీసుకెళ్తామని స్పీచ్‌లు ఇచ్చారు. ఐదు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయిస్తే గోవాకు, 10 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయిస్తే థాయిలాండ్‌కి ఉచితంగా కంపెనీ తీసుకెళ్తుంది. ఇలాంటి ఆఫర్లు పెట్టడంతో ఏజెంట్లు ఊర్లల్లో పడి కస్టమర్లను వెంటాడి ప్రీమియం డబ్బులు కట్టించారు.

ఆశ చూపి.. దగా చేసి..

వనస్థలిపురంకు చెందిన శ్రీనాథ్ ​రెడ్డి అనే ప్రైవేటు ఉద్యోగి దగ్గరకు కొందరు ఏజెంట్లు వచ్చారు. పుడమి రియల్ ఎస్టేట్‌‌లో పెట్టుబడులు పెడితే 25 నెలల్లోనే డబుల్ అవుతాయని నమ్మించారు. వాళ్లు కూడా పరిచయం ఉన్న వ్యక్తులు కావడంతో నమ్మేశాడు. మొదట రూ.2 లక్షలు మాత్రమే కట్టారు. దానికి నెలకు రూ.8 వేల వంతున ఐదారు నెలల పాటు ఖాతాలో జమ చేశారు. ఇక నమ్మకంగానే డబ్బులు ప్రతి నెలా వస్తున్నాయని నమ్మాడు. వెంటనే రూ.32 లక్షలు పెట్టుబడి పెట్టించారు. దానికి గాను చిట్యాల దగ్గర మారుమూల ప్రాంతంలో 240 గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేశారు. నిజానికి అక్కడ గజం రూ.2 వేలు కూడా పలకదు. కానీ ఏకంగా గజం ధర రూ.12 వేలకు పైగా కట్టారు. దాన్ని ష్యూరిటీగా నమ్మించారు. అప్పుడు కూడా ఐదారు నెలల పాటు డబ్బులు ఇచ్చారు. దాంతో మరో రూ.14 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఇక అప్పటి నుంచి ల్యాండ్ లేదు. డబ్బులు లేవు. వాళ్ల చుట్టూ తిరిగి అలసిపోయారు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో కంపెనీపై కేసు కూడా పెట్టారు.

రిజిస్ట్రేషన్ చేస్తామంటూ వసూళ్లు

పుడమి రియల్ ఎస్టేట్ కంపెనీ మోసాలకు పాల్పడిందంటూ పలు కేసులు నమోదయ్యాయి. పోలీసుల విచారణ నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే పెట్టుబడులు పెట్టిన వారికి ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తామంటూ భూదాన్ పోచంపల్లికి చెందిన ఒకరు బాధితుల నుంచి ప్లాట్‌కి రూ.10 వేల చొప్పున వసూలు చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్లాట్ చూపించకుండానే ముందే డబ్బులు వసూలు చేశారు. కొందరేమో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇస్తామంటూ తప్పించుకున్నారు. అయితే కొందరు ప్లాట్లు అలాట్మెంట్ అంటూ ప్లాట్ నంబర్లు వేసి పత్రాలు ఇచ్చారు. మళ్లీ కేసుల పాలు కావడంతో ఆ ప్రక్రియ కూడా అటకెక్కింది. ఇప్పటికైనా ఇలాంటి డబుల్ ప్రాఫిట్ కంపెనీలను బహిష్కరించాలని రియల్ ఎస్టేట్ నిపుణులు సూచిస్తున్నారు.

Next Story