- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మందులే అవసరం లేదు..! కొందరు వ్యక్తులు కూడా ‘human medicine’లా పనిచేస్తారు!
మందులే అవసరం లేదు.. కొందరు వ్యక్తులు కూడా ‘human medicine’లా పనిచేస్తారు!

దిశ, ఫీచర్స్ : ‘‘మంచి మాట చాలు మనసులో గాయంబు మాన్పజాలు గొప్ప మందువోలె’’ అన్నారో కవి. దీనిని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు మాటకున్న పవర్ ఎలాంటిదో. కొందరితో మాట్లాడుతుంటే ఇంకాసేపు మాట్లాడితే బాగుండు అనిపిస్తుంది కొన్నిసార్లు. ఎందుకంటే అవతలి వ్యక్తి మాటలు, ప్రవర్తన మనకు ఓదార్పునిస్తాయి. మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి. మనలో సానుకూల దృక్పథాన్ని నింపుతాయి. వారు పక్కనుంటే ఏదైనా సాధిస్తామనే విశ్వాసం కలుగుతుంది. ప్రతీ ఒక్కరి జీవితంలో ఇలాంటి వారు ఒక్కరో, కొందరో ఉండే ఉంటారని నిపుణులు అంటున్నారు. వీరినే ‘human medicine’గా పేర్కొంటున్నారు.
హ్యూమన్ మెడిసిన్ అంటే ఏదో కాదు. అవతలి వ్యక్తులతో సాంగత్యం లేదా అనుబంధం మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. వారితో మాట్లాడటం అనేది మీకు గొప్ప ఓదార్పునిస్తుంది. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధాలతోపాటు విస్తృతమైన సామాజిక సంబంధాలవల్ల కూడా ఏర్పడుతుంది. ఫలానా వ్యక్తులు మీ విషయంలో పాజిటివ్‌గా ఆలోచిస్తారని, అర్థం చేసుకుంటారని, మంచి విషయాల్లోనే మిమ్మల్ని ప్రోత్సహిస్తారనే నమ్మకం మీలో ఆనందాన్ని కలిగిస్తుంది. ఆపదలో, ఇబ్బందుల్లో వారితో మాట్లాడితే మనసు తేలికపడుతుందని, ధైర్యం వస్తుందని, ఓదార్పు లభిస్తుందని.. ఇలా ఎవరి గురించి అయితే మీరు అనుకుంటారో, వారు మీ విషయంలో ‘హ్యూమన్ మెడిసిన్’ అన్నమాట. అంటే.. ఏ వైద్యుల అవసరం లేకుండానే మీలో మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తారు వీరు.
మీరు ఏదో బాధలో ఉంటారు. నిరాశలో కూరుకుపోయి కూర్చుంటారు. ఆ సమయంలో ఎవరూ డిస్టర్బ్ చేయకుంటే బాగుండు అనుకుంటారు. ఎవరు ఫోన్ చేసినా తీయరు. మెసేజ్ చేసినా పట్టించుకోరు. అలా అనుకుంటున్న సందర్భంలోనే.. ఒకరి నుంచి వచ్చే కాల్‌ని మాత్రం ఠక్కుమని రిసీవ్ చేసుకుంటారు. మెసేజ్‌కు వెంటనే రియాక్ట్ అవుతారు. ఎందుకంటే అవతలి వారు మీకు ఇష్టమైన వ్యక్తి కావచ్చు. మీ జీవితంలో ఒక స్పెషల్ పర్సన్ కావచ్చు. ఏ సంబంధం లేకపోయినా మీ బాధలు, భావోద్వేగాలను అర్థం చేసుకునే సాధారణ పరిచయస్తులు కూడా కావచ్చు. ఎవరైతేనేం మీలో ఆనందానికి, మానసిక వికాసానికి కారణం అవుతారని మీకు అనిపిస్తే వారే మీ ‘హ్యూమన్ మెడిసిన్’ అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఆ క్షణం వారితో మాట్లాడితే మీ మనసులోని బాధలన్నీ పటాపంచలై పోతాయనిపిస్తుంది. వారితో మాట్లాడితే మీలో కొండంత ధైర్యం, ఆత్మస్థైర్యం, ఆత్మ విశ్వాసం ఏర్పడుతుంది.
"Some people are human medicine. You spend an hour with them and everything feels better" అంటుంటారు మానసిక నిపుణులు. అంటే ఈ వాక్యం మానవ సంబంధాల శక్తిని, కొంతమంది వ్యక్తుల సాంగత్యం మానసిక, భావోద్వేగ శ్రేయస్సుపై చూపే సానుకూల ప్రభావాన్ని సూచిస్తుంది. ప్రతీ ఒక్కరి జీవితంలో ఇలాంటి అనుభవాలు ఎదురవుతుంటాయి కూడా. కొందరు వ్యక్తులు తమ సానుకూల దృక్పథం, సానుభూతి, హాస్యం లేదా వినే నైపుణ్యంతో ఇతరులకు ఓదార్పును, ఆనందాన్ని లేదా ప్రేరణను అందిస్తారు. ఈ వ్యక్తులు తమ చుట్టూ ఉన్నవారి ఒత్తిడిని తగ్గించడం, ఆత్మవిశ్వాసాన్ని పెంచడం లేదా జీవితంపై కొత్త దృక్పథాన్ని అందించడం ద్వారా ఒక రకమైన ‘మానవ ఔషధం(human medicine)’గా పనిచేస్తారు. వ్యక్తిగత స్థాయిలోనే కాదు, సామాజిక సంబంధాల ద్వారా కూడా ఇది సాధ్యం అవుతుంది.






