- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Republic Day Special.. బైగా ఘనతంత్రం.!
గణతంత్రం బైగా తెగ కుటుంబాలకు ఘనతంత్రమై రెడ్ కార్పెట్ పరిచింది.!

రిపబ్లిక్ డే అంటే..
మువ్వన్నెల జెండా రెపరెపలాడే టైమ్.
మనకిది ప్రతీయేడు ఉండేదే.
కానీ.. ఒక ఊరికి స్పెషల్.
ఆ ఊరి ప్రజలెన్నడూ చూడని సంబరం.
ప్రపంచంతో సంబంధం లేకుండా..
అడివమ్మ నీడనే బతుకుతున్న ఆ గిరిజనులే..
ఈ గణతంత్ర దినోత్సవ విశిష్ట ఆహ్వానితులు.!
ఛత్తీస్‌గఢ్‌లోని కబీర్‌ధామ్ జిల్లా పత్పారి గ్రామం. ప్రపంచానికి దూరంగా జీవిస్తున్న బైగా తెగ ప్రజలుండే ఊరు అది. ఎప్పుడూ చూడని వారి కళ్లు వెలిగిపోతున్నాయి. దీనంగా.. దిగులుగా ఉండే వారి ముఖాలు మురిపెంతో మెరిసిపోతున్నాయి. విచారంగా కనిపించే వారి మనసులో ప్రశాంతత ప్రతిబింబిస్తోంది. గణతంత్రం వారికి ఘనతంత్రమై రెడ్ కార్పెట్ పరిచింది.!
తొలిసారి ఊరుదాటి..
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పత్పారి గ్రామస్తులకు ఒక కబురు పంపారు. ఢిల్లీలో జరిగే దేశ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానించారు. బైగా ప్రజలు ఆశ్చర్యపోయి అంతులేని ఆనందంతో ఎగిరి గంతేశారు. ఊరుదాటి బయటకు వెళ్లడం.. అదికూడా ఢిల్లీకి వెళ్లడం వీళ్లకిదే తొలిసారి. రాష్ట్రపతి ఆహ్వానం.. కలిసి భోజనం చేయడం, బస చేయడం చాలా అరుదైన అవకాశాలు. ఆ అవకాశం తమకు రావడం నమ్మలేక పోతున్నామని సంతోషిస్తున్నారు బైగా జాతి ప్రజలు. ఢిల్లీ వెళ్లిన జట్టుకు జగతిన్ బాయి.. పూల్ సింగ్ సారథులు. మొత్తం మూడు కుటుంబాలకు రాష్ట్రపతి ఆహ్వానం అందింది. ఇది కేవలం మూడు కుటుంబాలకు దక్కిన గౌరవం కాదు.. టోటల్ తమ గ్రామానికి దక్కిన గౌరవంగా భావించి సంబరాలు చేసుకుంటున్నారు.
ఆహ్వానం ఎందుకు.?
ఏంటీ సడెన్ సర్‌ప్రైజ్.. అంటారా.? బైగా ప్రజలది యేండ్ల తరబడి వెనుకబాటు తనమే. ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా బతుకుతున్నారు. ఇండ్లు ఉండవు.. వాకిలి ఉండదు. కరెంటు ఉండదు. తాగడానికి నీళ్లుండవు. చదువయితే అస్సలుండదు. ఇక ఇవన్నీ లేనప్పుడు వైద్యం మటుకు ఏముంటుంది.? పురాతన ఆచారాలు, సంప్రదాయాలకు గౌరవమిచ్చి గీత దాటకుండా అభివృద్ధికి ఆమడదూరంలో బతుకుతున్నారు. దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పుకునేవారికి ఇది పంటికింది రాయిలా మారింది. అంత దుర్భర పరిస్థితి నుంచి బైగా ప్రజలు బయటికొచ్చారు. ఇప్పుడు వెలుగుల్ని చూస్తు్న్నారు. అభివృద్ధి చెందుతున్నారు. ఈ పరవర్తనను స్వాగతించిన రాష్ట్రపతి గణతంత్ర అతిథులుగా ఆహ్వానించారు.
ఊరంతా అంధకారం
కనీస సౌకర్యాల్లేక, విద్య, ఉపాధి లేక పత్పారి గ్రామం చీకటిలో నలిగిపోయింది. సాయంత్రమైందంటే పిల్లలు భయపడేవారు. వన్య జంతువులొచ్చి ఎక్కడ దాడిచేస్తాయో అనే భయం. పిల్లలు బయటకు రాలేని పరిస్థితి. ఒకరికొకరికి సంబంధాలే కట్ అయ్యేవి. ఇండ్లు కూడా కిలోమీటర్‌కు ఒకటి ఉండేవి. మంచినీళ్లు కావాలంటే రోజంతా నడవాల్సిందే. నీళ్లకు పోయిన్నాడు పిల్లల దగ్గర, ఇంటి కావలి ఒకరుండాల్సిందే. ఏదో కష్టపడి నీళ్లు తీసుకొచ్చారే అనుకోండీ.. మరి తినడానికి.? సహజంగా పెరిగే కొన్ని రకాల చిరుధాన్యాలే వారి ప్రధాన ఆహారం. కానీ దానికీ ఓ సీజన్ ఉంటుంది కదా.? మిగతా టైమ్‌లో ఏ పుట్టగొడుగులో.. ఘాస్ కా రోటీనో తిని కాలమెల్లదీసేవారు. అటవీ ఉత్పత్తులతో పూట గడిచేది.
సోలార్ వెలుగుల్లో..
స్వాతంత్ర్యమొచ్చి ఇన్నేండ్లయినా గ్రామాల్లో అంధకారముంటే అవమానమే కదా.? అందుకే ప్రభుత్వాలు కాస్త చొరవచూపాయి. బైగా ప్రజల జీవన విధానాన్ని మార్చాలనుకొని మొదటగా CREDA విభాగం కింద సౌరశక్తి లైట్లను ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటికి 300 వాట్ల సోలార్ లైటింగ్ అందిస్తు్న్నారు. ఆ ఊరిప్పుడు 24 గంటలు సోలార్ వెలుగులను ఆస్వాదిస్తోంది. ఇండ్లు ప్రకాశవంతం అయ్యాయి. ఇది కేవలం వెలుగును అందిచడమే కాదు వారికి భద్రతను.. గౌరవాన్ని ప్రసాదించడం కూడా. ఇక మనం కూడా అప్‌డేట్ అవ్వాలనుకున్నారు ప్రజలు. నవ భారత నిర్మాణానికి చేయి కలుపుతూ సౌకర్యాలు కల్పించుకుంటున్నారు. సమస్యలుంటే అడిగి పరిష్కరింపజేసుకుంటున్నారు. ఇదే రాష్ట్రపతిని ఆకట్టుకొని ఢిల్లీకి రప్పించేలా చేసింది.
ఎవరీ బైగాలు.?
మధ్యప్రదేశ్.. ఛత్తీస్‌గఢ్.. ఉత్తరప్రదేశ్.. జార్ఖండ్ రాష్ట్రాలలో ఈ జాతులు ఉన్నాయి. వాస్తవానికి వీళ్లు చోటా నాగ్‌పూర్లోని భూమియా తెగ ఉపశాఖగా ఉద్భవించారని అంటుంటారు. సమాజంలో పూర్తిగా కలిసిపోని కొద్దిమందిలో వీళ్లొకరు. దుర్బల గిరిజన సమూహం (పీవీటీజీ)గా పిలుస్తారు. గోండుల కంటే కూడా ప్రాచీనమైన వారట. 1867 నాటి బ్రిటీష్ సైనిక నివేదికలో మొదటిసారి బైగాలను ప్రస్తావించారు. కెప్టెన్ డబ్ల్యూబీ థామ్సన్ రూపొందించి ఆ నివేదికలో బైగా తెగను అత్యంత ప్రాచీనదిగా, కొండలలో నివసించేవారిగా పేర్కొన్నారు. వీళ్లు అప్పట్లో బాణాలు.. విల్లులు తయారు చేసేవారట. అడవితో సహవాసం.. అటవీ సంపదను తల్లిలా కొలవడం.. వన్య ప్రాణులను గౌరవించడం బాధ్యతగా భావిస్తారు.
కొండవాలు సాగు
బైగా తెగ ప్రజలకు తెలిసిందల్లా వ్యవసాయం ఒక్కటే. కొండవాలు ప్రాంతాల్లో చిన్న చిన్న కమతాల్లో పంటలు సాగుచేస్తూ జీవనం సాగిస్తున్నారు. నేలను తల్లిలా భావిస్తారు. సారం తగ్గొద్దని దున్నిన భూమిని మళ్లీ దున్నరు. బేవార్ మార్పిడి సాగులో చిరుధాన్యాలు.. ఘాస్ కీ రోటీ, సికియాను బియ్యం, పుట్టగొడుగులు.. ఆకుకూరలు.. పండ్లు సాగుచేస్తారు.
టాటూ ప్రత్యేకం
పచ్చబొట్లు వీళ్లకు ప్రత్యేకం. ఆడవాళ్లయితే తల నుంచి కాలి వరకు టాటూస్ వేయిస్తారు. అర్ధచంద్రాకార.. తేలు ఆకారం టాటూస్ ఎక్కువగా ఉంటాయి. అందం కోసమే కాదు.. ఆరోగ్య సూత్రమూ పచ్చబొట్లలో ఉందట. మనిషి పుట్టేటప్పుడు నగ్నంగా వస్తాడు.. పోయేటప్పుడు నగ్నంగా పోతాడు. కాబట్టీ పచ్చబొట్టుతో లేకుండా చనిపోతే దేవుడు శిక్షిస్తాడని వారి నమ్మకం.
అప్‌డేట్ అవుతూ..
బైగా తెగవారు ఇప్పుడిప్పుడే కాస్త మారుతున్నారు. సౌకర్యాలను సమకూర్చుకుంటున్నా ఇప్పటికీ సంప్రదాయ దుస్తుల్లోనే ఉంటున్నారు. కాలమెన్నో కొత్త దేవుళ్లను సృష్టించినా.. బైగా ప్రజలు మాత్రం వారి సంప్రదాయ దేవతలనే పూజిస్తున్నారు. కొన్ని విషయాల్లో అప్‌డేట్ అవుతూనే అభివృద్ధి సృష్టించిన అలంకరణలకు దూరంగా ఉంటున్నారు.






