- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అథ్లెట్లకు ఆశాకిరణం.. రేసర్ పూవమ్మ.!
మూడు ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఏకైక కర్ణాటక మహిళా అథ్లెట్ పూవమ్మే కావడం విశేషం

దిశ, ఫీచర్స్: కర్ణాటకలోని పల్లెటూరు నుంచి ఒలింపిక్ స్టేడియం వరకు ఎదిగిన అథ్లెట్ ఎంఆర్ పూవమ్మ తన జర్నీలో ఎన్నో అడ్డంకులు.. అవరోధాలను అధిగమిస్తూ ఇంకా పరుగెత్తుతూనే ఉంది. 30 ఏళ్లు దాటినా 20 ఏళ్ల వయసులో పరుగెత్తినట్లు తన వేగాన్ని గతంలాగే కొనసాగిస్తూ మళ్లీ ట్రాక్‌పై దూసుకెళ్తోంది. మూడు ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఏకైక కర్ణాటక మహిళా అథ్లెట్ పూవమ్మే కావడం విశేషం.
అర్జున అవార్డు..
పూవమ్మ మంగళూరు సమీపంలోని చెల్లూరులో పుట్టింది. ఆ ఊర్లో స్టేడియం లేదు.. కోచ్ లేరు. కానీ తన కల చాలా పెద్దది. వాళ్ల నాన్న ఎయిర్‌పోర్ట్‌లో చిన్న ఉద్యోగం చేసేవాడు. పూవమ్మ సోదరుడు కూడా అథ్లెట్. కానీ గాయం వల్ల ఆగిపోయాడు. "నేను సాధించలేక పోయాను. నువ్వు సాధిస్తావ్" అని ధైర్యం చెప్పాడు. సోదరుడి స్ఫూర్తితో 18 ఏళ్ల వయసులోనే 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో భారత జట్టులో చేరింది. 2016లో రియో.. 2024 పారిస్ ఒలింపిక్స్‌లోనూ ప్రాతినిధ్యం వహించింది. ఆసియా గేమ్స్.. కామన్వెల్త్ గేమ్స్‌లో ఎన్నో పతకాలు సాధించింది. 2015లో పూవమ్మ అర్జున అవార్డు అందుకుంది.
2024 పారిస్ ఒలింపిక్స్‌లో..
2021లో డోపింగ్ ఆరోపణలతో పూవమ్మపై రెండేళ్ల నిషేధం పడింది. దీంతో తన ఒలింపిక్స్ కల కలగానే మిగిలిపోతుందా అని కంగారు పడింది. కానీ.. అక్కడితోనే ఆగిపోలేదు. పరిస్థితులతో పోరాటం చేసింది. న్యాయం తనవైపు ఉంటుందని నమ్మి ఉరిమే ఉత్సాహంతో అడుగు ముందుకు వేసింది. అంతర్జాతీయ అథ్లెట్ అయిన భర్త.. కోచ్ గలీనా.. పేరెంట్స్ సహకారంతో మళ్లీ ట్రాక్ మీదికి వచ్చింది. 34 ఏళ్ల వయసులో 24 ఏళ్లప్పుడు రికార్డు చేసిన టైమింగ్‌నే మళ్లీ సాధిస్తూ తన స్టామినా నిరూపిస్తోంది. అలా 2024 పారిస్ ఒలింపిక్స్‌లో రిలే జట్టులో సీనియర్ సభ్యురాలిగా చోటు సంపాదించుకుంది.
కష్టపడితేనే విజయం..
పక్కన ఎవరు పరుగెత్తుతున్నా పట్టించుకోవద్దని అంటోంది పూవమ్మ. గాయాలు.. ఓటములు.. ఒత్తిడి వంటివేవీ లేకుండా విజయం అంత ఈజీగా వరించదని చెప్తోంది. ఆమె వీటన్నింటితో పోరాడింది కాబట్టే అవేవీ తనను ఆపలేకపోయాయి. మానసిక దృఢత్వమే తన బలం. విజయం-పరాజయం జీవితంలో సహజం అంటోంది. ఓడిపోయినప్పుడు తప్పు ఎక్కడ జరిగిందో చూసుకుని.. మళ్లీ మొదలుపెడితే సక్సెస్ మన జేబులో ఉన్నట్లతే అని యువతకు సూచిస్తోంది. ప్రభుత్వం.. స్పాన్సర్లు.. ఖేలో ఇండియా వంటి కార్యక్రమాలు ఎంతో మద్దతునిస్తున్నాయనీ.. గతంతో పోలిస్తే ఇప్పుడు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తోంది.
లక్ష్యం.. అకాడమీ..
స్పోర్ట్స్‌లోకి వెళ్తే చదువుకు ఆటంకం కలుగుతుందని చాలామంది పేరెంట్స్ భావిస్తుంటారు. కానీ పూవమ్మ అలా ఏముండదని చెప్తోంది. చదువుతూనే ఆటల్లో రాణించొచ్చని అంటోంది. ఆమె గ్రాడ్యుయేట్ చదువుతూనే అథ్లెటిక్స్ ప్రాక్టీస్ చేసింది. ఇప్పుడు కూడా ఓఎన్‌జీసీలో హెచ్‌ఆర్ మేనేజర్‌గా పనిచేస్తూనే క్రీడలను కొనసాగిస్తోంది. వయసు 34 ఏళ్లు దాటింది కాబట్టీ పూవమ్మ రిటైర్మెంట్ గురించి ప్రస్తావిస్తుంటారు కొందరు. కానీ పూవమ్మ ఇప్పట్లో రిటైర్మెంట్ విషయం గురించి ఆలోచించడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన అథ్లెట్ల కోసం స్పోర్ట్స్ అకాడమీ పెట్టాలనేది తన లక్ష్యం అని చెప్తోంది.






