ఆ వయసులో విటమిన్ డి స్థాయిలు తగ్గితే.. ఈ రిస్క్ పెరగొచ్చు!

by Javid Pasha |

30-40 ఏళ్ల వయసులో విటమిన్ డి స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు. ఆ తర్వాతి వయసులో డిమెన్షియా రిస్క్‌ను ఎదుర్కొనే అవకాశం తక్కువగా ఉంటుంది.

ఆ వయసులో విటమిన్ డి స్థాయిలు తగ్గితే.. ఈ రిస్క్ పెరగొచ్చు!
X

దిశ, ఫీచర్స్ : మనం ఆరోగ్యంగా ఉండటంలో విటమిన్లు, ప్రోటీన్లు కీ రోల్ పోషిస్తాయనే విషయం తెలిసిందే. అలాంటి వాటిలో డి విటమిన్ కూడా ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 60% మందిలో ఇది లోపిస్తోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీంతో బాధితులు కండరాల బలహీనత, అలసట, డిప్రెషన్, ఎముకల నొప్పి, రోగ నిరోధక శక్తి తగ్గడం వంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తోంది. అయితే ఒక కొత్త అధ్యయనం మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. ఏంటంటే.. 30-40 ఏళ్ల వయసులో విటమిన్ డి స్థాయిలు ఎక్కువగా కలిగి ఉన్నవారు. ఆ తర్వాతి వయసులో డిమెన్షియా(మరచిపోవడం) రిస్క్‌ను ఎదుర్కొనే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ‘Neurology’ జర్నల్‌లో పబ్లిష్ అయ్యాయి.

ఎలా ప్రభావం చూపుతుంది?

అధ్యయనంలో భాగంగా నిపుణులు 793 మందిని 16 సంవత్సరాల పాటు పర్యవేక్షించారు. ప్రారంభంలో విటమిన్ D స్థాయి 30 ng/mL కంటే తక్కువ ఉన్నవారిని లో-విటమిన్ D గ్రూప్‌గా, ఎక్కువ ఉన్నవారిని హై-విటమిన్ D గ్రూప్‌గా వర్గీకరించారు. 15-16 సంవత్సరాల తర్వాత PET స్కాన్‌ల ద్వారా టావ్ ప్రోటీన్ (tau protein) స్థాయిని పరిశీలించగా, హై విటమిన్ D గ్రూప్‌లో ఇది తక్కువగా ఉన్నట్లు తేలింది. నిజానికి టావ్ ప్రోటీన్ అల్జీమర్స్‌ వ్యాధికి ముఖ్యమైన సంకేతం. అయితే ఇది అమీలాయిడ్ ప్రోటీన్‌పై మాత్రం ప్రభావం చూపలేదని నిపుణులు గుర్తించారు. అయితే ఈ అధ్యయనం ఒక ముఖ్యమైన పరిమితిని కలిగి ఉంది. ఏంటంటే.. విటమిన్ D స్థాయిని అధ్యయనం ప్రారంభంలో ఒక్కసారి మాత్రమే కొలిచారు. మధ్యలో ఎవరైనా సప్లిమెంట్లు వాడారా లేదా జీవనశైలి మార్చారా అనేది తెలియదు. కాబట్టి ఇది నేరుగా ‘విటమిన్ D తీసుకోవడం వల్ల డిమెన్షియా రాదు’ అని నిరూపించదు అంటున్నారు నిపుణులు. అయినప్పటికీ, 30-40 ఏళ్లలోనే విటమిన్ D స్థాయిని ఆరోగ్యకరంగా ఉంచుకోవడం మెదడు ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు.

ఏం చేయాలి?

విటమిన్ డి సూర్యరశ్మి ద్వారా సహజంగానే లభిస్తుంది. మారిన బిజీ జీవితంలో ఉదయపు ఎండలో ఉండటం, బయటి పరిస్థితుల్లో గడపడం అందరికీ సాధ్యపడకపోవచ్చు. అలాంటప్పుడు విటమిన్ డి ఆహారాల ద్వారా అందేలా చూసుకోవడం మరో మార్గం అంటున్నారు నిపుణులు. అలాంలి ఆహారాల్లో సాల్మన్, ట్యూనా, సార్డీన్స్ వంటి ఫ్యాటీ ఫిష్‌లు, పాలు, గుడ్లు ఉన్నాయి. వీటిని తినడం ద్వారా విటమిన్ D పొందవచ్చు. అవసరమైతే డాక్టర్ సలహాతో సప్లిమెంట్ తీసుకోవాలి. మెదడు ఆరోగ్యం కోసం ముదురాకు పచ్చిని ఆకు కూరలు (Dark leafy greens), బెర్రీలు, ఒలీవ్ ఆయిల్, వ్యాయామం, మానసిక వ్యాయామం, సామాజిక సంబంధాలు కూడా చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story