- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కారెక్కాలన్నా.. బైక్ ఎక్కాలన్నా భయం వెంటాడుతోందా..? మీలో ఆ ప్రాబ్లం ఉన్నట్లే..!
కారెక్కాలన్నా.. బైక్ ఎక్కాలన్నా భయం వెంటాడుతోందా..? మీలో ఆ ప్రాబ్లం ఉన్నట్లే..!

దిశ, ఫీచర్స్ : ఓ వైపు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. మరో వైపు ఆఫీసుకు టైమ్ అవుతోంది. వర్షం ఆగదు. వెళ్లకపోతే కుదరదు. అయినా సరయూకు ఏమాత్రం వెళ్లాలనిపించడం లేదు. బస్సు జర్నీ గుర్తుకు రాగానే భయం వేస్తోంది. పోనీ.. రాపిడో బుక్ చేసుకుందామనుకుంది కానీ.. బైక్ ఎక్కాలన్నా భయమే వెంటాడుతోంది. ‘వెళ్తూ వెళ్తూఏదైనా జరిగితే.. ఒకవేళ రోడ్డుపై జారి కింద పడితే.. అనుకోకుండా యాక్సిడెంట్ అయితే..’’ ఇలాంటివేవో ఊహించుకుంటూ లోలోన భయపడుతూనే ఉంది. ఇది కేవలం సరయూ సమస్య మాత్రమే కాదు. ప్రపంచ వ్యాప్తంగా చాలామంది ఇటువంటి భయాలను ఎదుర్కొంటున్నారు. ఎందుకలా జరుగుతుంది?.. నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.
కదులుతున్న వాహనం చూస్తేనే ఆందోళన
బస్సు, కారు, బైకు.. ఇలా వాహనం ఏదైనా సరే.. వాటిపై జర్నీ చేయాలంటే భయపడే వ్యక్తులు కూడా కొందరు తారసపడుతుంటారు. కదులుతున్న వాహనాలు చూసి ఆందోళన చెందుతుంటారు. ఒకవేళ జర్నీ చేసినా వెహికల్ కాస్త స్పీడ్ అందుకోగానే కంగారు పడిపోతుంటారు. కాబట్టి వీరు ప్రయాణాలు చేయడానికి ఇష్టపడరు. అలాగనీ ఈ వ్యక్తులను తప్పు పట్టలేం. ఎందుకంటే ‘స్పీడ్ ఫోబియా లేదా అమాక్సోఫోబియా’ అనే ఒక విధమైన మానసిక రుగ్మత కారణంగా ఈ భయం ఏర్పడుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు.
ఎందుకలా జరుగుతుంది?
ఒక వ్యక్తి ఆందోళన చెందడం వెనుక దానికి సంబంధించిన తీవ్రమైన పరిస్థితులు, భయంకరమైన అనుభవాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తీవ్రమైన మానసిక ఒత్తిడి, అతి భావోద్వేగాలు టాకోఫోబియా డెవలప్ కావడానికి దారితీస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి బైకు మీదో, కారులోనో వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మరణించడం, ప్రియమైన వ్యక్తులు తమ కళ్లముందే రోడ్డు ప్రమాదానికి గురికావడం, యాక్సిడెంట్‌లో మృతి చెందడం వంటివి చూసిన వ్యక్తుల్లో ఈ అమాక్సో ఫోబియా (Amaxophobia) సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని మానసిక నిపుణులు అంటున్నారు.
ఆ సందర్భంలో కూడా..
స్పీడ్ ఫోబియా (Speed phobia) బాధితులు ఎంతలా కంగారు పడతారంటే.. వారు యాక్షన్ సినిమాలు, గేమ్స్ వంటివి చూస్తున్నప్పుడు కూడా వాటిలో దూసుకుకొచ్చే వాహనాల సన్నివేశాలు కనిపించినా కంగారు పడతారు. కొన్నిసార్లు తీవ్రంగా భయపడతారు. ఇక కార్లు, బస్సులు, బైకులు వంటివి ఎక్కి ప్రయాణాలు చేయడానికైతే అస్సలు ఆసక్తి చూపరు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణం చేయాల్సి వచ్చినా వీరు ఛాతీ నొప్పి, భయం, ఆందోళన, హార్ట్ రేట్ పెరగడం, వికారం, వాంతింగ్, అధిక చెమటలు పట్టడం వంటి లక్షణాలను ఎదుర్కొంటారు.
పరిష్కారం ఏమిటి?
అమాక్సో ఫోబియా లేదా స్పీడ్ ఫోబియా ఉన్నట్లు గుర్తిస్తే మానసిక వైద్య నిపుణులను సంప్రదించాలి. వారు అందుకు గల మూల కారణాలు తెలుసుకొని సరైన పద్ధతిలో చికిత్స అందిస్తారు. కాగ్నెటివ్ బిహేవియరల్ థెరపీ, టాక్ థెరపీ వంటి చికిత్సలతో టాకో ఫోబియాను శాశ్వతంగా తగ్గించవచ్చునని సైకాలజిస్టులు అంటున్నారు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






