కైండ్‌నెస్ పీపుల్.. ప్రతీ 2 నిమిషాలకు ఒకసారి హెల్పింగ్

by Sathputhe Rajesh |   (  Updated:2023-04-28 14:18:22  IST  )

కైండ్‌నెస్ మనుషులను ఆపదల నుంచి కాపాడుతుంది.

కైండ్‌నెస్ పీపుల్.. ప్రతీ 2 నిమిషాలకు ఒకసారి హెల్పింగ్
X

దిశ, ఫీచర్స్ : కైండ్‌నెస్ మనుషులను ఆపదల నుంచి కాపాడుతుంది. మంచి గుర్తింపునిస్తుంది. ఆనందాన్ని కలిగిస్తుంది. మెరుగైన సమాజానికి బాటలు వేస్తుంది. అందుకేనేమో దయగలవారు దైవంతో సమానం అంటుంటారు పెద్దలు. ప్రపంచం ఒక్కోసారి చల్లటి ప్రదేశంలా ఎవరికైనా అనిపిస్తూ ఉంటుందంటే.. అందుకు దయాగుణం కూడా ఒక కారణం. నిపుణుల అధ్యయనం ప్రకారం ప్రపంచంలోని ప్రజలు ప్రతీ రెండు నిమిషాలకు ఒకసారి పరస్పరం సహకరించుకుంటున్నారు. ఇందుకు మెయిన్ రీజన్ దయాగుణమే.

ప్రపంచంలోని ప్రజల్లో దయాగుణం, హెల్పింగ్ నేచర్ ఎలా ఉంది? పరస్పరం సహకరించుకుంటున్నారా? స్వార్థంతో ఉంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోవడానికి ఉక్లా(UCLA)లోని పరిశోధకులు, ఇంటర్నేషనల్ సైంటిస్టుల టీమ్‌తో కలిసి విస్తృత అధ్యయనం నిర్వహించారు. దీని ఫలితాల ప్రకారం.. ప్రజలు రోజులో ప్రతీ రెండు నిమిషాలకు ఒకసారి ఇతరులకు హెల్ప్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సహాయం కోసం వచ్చే అభ్యర్థనల పట్ల సానుకూలంగా స్పందిస్తున్నారు.

సోషియాలజిస్ట్ గియోవన్నీ రోస్సీ ఆధ్వర్యంలోని సైంటిస్టుల బృందం జర్మనీ, ఈక్వెడార్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, యునైటెడ్ కింగ్‌డమ్‌లలో కైండ్‌నెస్ సంబంధిత అనేక అంశాలను లోతుగా పరిశీలించింది. వాస్తవానికి సహకారం(cooperation) విషయంలో మానవ సామర్థ్యాన్ని అన్వేషించే ఉద్దేశంతో ఈ అధ్యయనం కొనసాగింది. వ్యక్తులు పరస్పర సహకారం కోరుతారని, అలాగే సాయం చేసేందుకు చాలామంది సిద్ధంగా ఉంటారని ఇందులోని నిపుణులు కనుగొన్నారు.

వీరి ప్రకారం.. తమకు హెల్ప్ చేయాలని అడగడం, లేదా సహాయం చేయడానికి ఎవరినైనా పంపాలని కోరడం, ఎదుటి వ్యక్తులు సానుకూలంగా స్పందించడం ప్రపంచ వ్యాప్తంగా దయగల వారి ఉనికిని చాటుతోంది. కొన్ని అరుదైన సందర్భాల్లో హెల్ప్ చేయడానికి తిరస్కరిస్తున్న వారు చాలా అరుదుగా ఉంటున్నప్పటికీ వాటికి ప్రత్యేకించి కారణాలు ఉంటున్నాయని నిపుణులు పేర్కొన్నారు.

డిఫరెంట్ కల్చర్

ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో హెల్పింగ్ నేచర్ ఆయా వ్యక్తుల డిఫరెంట్ కల్చర్, ప్రత్యేక మార్గదర్శకాల ప్రకారం కూడా ఉంటుందని పరిశీలనలో తేలింది. ఎక్కువమంది సహాయం చేయడానికి, అలాగే కొందరు చేయలేకపోవడానికి గల కారణాలను నిపుణుల విశ్లేషించారు. ఇందులో సాంస్కృతిక, ఆర్థిక, పేదరికం వంటి అంశాలు కూడా ముడివడి ఉన్నాయి. ఉదాహరణకు, ఇండోనేషియాలోని లామలేరాకు చెందిన తిమింగలం వేటగాళ్లు(whale hunters) ‘లార్జ్ క్యాచ్‌’ను ఎలా పంచుకోవాలనే దానిపై ఏర్పాటు చేసుకున్న నియమాలను అనుసరిస్తారు.

అయితే టాంజానియాలోని హడ్జా ఫోరేజర్స్ నెగెటివ్ గాసిప్స్‌ను జనరేట్ చేస్తారనే భయంతో తమ ఆహారాన్ని ఎక్కువగా పంచుకుంటారు. అదే సమయంలో కెన్యాలో ధనవంతులైన ఓర్మా గ్రామస్థులు సాధారణంగా రోడ్డు ప్రాజెక్టుల వంటి ప్రజా పనుల కోసం ఎంతో కొంత చెల్లించాలని భావిస్తారు. మరోవైపు పాపువా న్యూ గినియాలోని (Papua New Guinea) గ్నౌలోని సంపన్న నివాసితులు ఇలా చెల్లించేందుకు అస్సలు అంగీకరించరు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితిని వారు బాధ్యతా రాహిత్యంగా భావిస్తారట.

విభిన్న ప్రదేశాలు, 40 గంటల రికార్డింగ్

ఇలాంటి కొన్ని సాంస్కృతిక వ్యత్యాసాలు మానవుల మధ్య సహకారాన్ని అర్థం చేసుకోవడానికి, సహాయం చేయడానికి ఒక పజిల్‌ను సృష్టించాయని పరిశోధకుల్లో ఒకరు ప్రొఫెసర్ రోస్సీ తెలిపారు. “షేరింగ్ అండ్ హెల్పింగ్ వంటి మానవ నిర్ణయాలు వారు పెరిగిన సంస్కృతికి అనుగుణంగా రూపొందించబడ్డాయా? లేదా మానవులు ఉదారంగానే, స్వభావరీత్యానే దయా గుణం కలవారా? అనే ప్రశ్నలకు సమాధానం రాబట్టడానికి అధ్యయన కర్తలు భౌగోళికంగా, సాంస్కృతికంగా, భాషాపరంగా విభిన్న ప్రదేశాలలో 350 కంటే ఎక్కువ మంది వ్యక్తులతో కూడిన రోజువారీ జీవితంలోని 40 గంటల కంటే ఎక్కువ వీడియో రికార్డింగ్‌లను విశ్లేషించారు. ఇందులో పోలాండ్, ఇటలీ, ఇంగ్లండ్, రష్యాలోని పట్టణాలు, అలాగే ఈక్వెడార్, ఘనా, లావోస్, అబోరిజినల్ ఆస్ట్రేలియాలోని గ్రామీణ గ్రామాలు ఉన్నాయి.

నియామాలకు అతీతంగా

పరస్పర హెల్పింగ్ నేచర్‌ను ఆయా విభిన్న ప్రదేశాల్లో సైంటిస్టులు పరిశీలించినప్పుడు ప్రతీ 10 మందిలో 8 మంది సంస్కృతి, సంప్రదాయం వంటి నియమాలకు భిన్నంగా స్పందించారు. వాటి గురించి ఏమాత్రం ఆలోచించకుండా సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఒక వ్యక్తి సహాయం కోసం సంకేతాన్ని పంపినప్పుడు, అలాగే నేరుగా కలిసి సహాయం కోరినప్పుడు అందించగలిగే ప్రతీ వ్యక్తి ఎలా స్పందించాడన్నది తెలుసుకోవడం కోసం నిపుణులు వెయ్యి మందిని పరిశీలించడం ద్వారా ఈ విషయం తెలిసింది. సగటున ప్రతీ 2 నిమిషాలకు ఒకసారి సాయం చేసేవారే అధికంగా ఉన్నారని తేలింది.

అరుదైన సందర్భాల్లో తిరస్కరణ

కొందరు వ్యక్తులు తమ సాంస్కృతిక కారణాల రీత్యా అప్పుడప్పుడు చిన్న అభ్యర్థనలను తిరస్కరిస్తున్నారు. అరుదైన సందర్భాల్లో కొన్ని ప్రత్యేక నియమాలను అనుసరించి హెల్ప్ చేయడానికి నిరాకరిస్తున్నారు. అయితే వారు తర్వాత అంతకంటే 7 రెట్లు ఎక్కువగా సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. అడిగినా సహాయం చేయకుండా ఆయా సందర్భాల్లో ఇతరులను విస్మరిస్తున్నవారు కూడా తర్వాత మరో సందర్భంలో హెల్ప్ చేస్తున్నారు. గణాంకపరంగా సహాయం కోరినప్పుడు సగటు తిరస్కరణ 10% ఉండగా, విస్మరించడం 11% ఉంది.

అంటే ఎక్కువశాతం మంది హెల్పింగ్ నేచర్ కలిగి ఉన్నారు. సహాయం చేయడానికి తిరస్కరిస్తున్నవారిలో 74 శాతం మంది అందుకు గల కారణాన్ని కూడా వివరిస్తున్నారని అధ్యయనం పేర్కొన్నది. కొన్ని సాంస్కృతి కారణాలు అరుదుగా ఆయా సందర్భాల్లో దయా గుణానికి ఆటంకంగా మారుతున్నప్పటికీ భవిష్యత్తులో ఆ పరిస్థితి మారాలని కోరుకుంటున్నవారే ప్రపంచ వ్యాప్తంగా అధ్యదిక మంది ఉన్నారు. ఏది ఏమైనా మెజార్టీ ప్రజలు దయామయులని, హెల్పింగ్ నేచర్ కలిగిన వారని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుందని, మనది కైండ్ నెస్ వరల్డ్ అని నిపుణులు పేర్కొంటున్నారు.

Also Read..

ఈ లక్షణాలు మీలో ఉంటే మీరు డిప్రెషన్లో ఉన్నట్టే.. అవేంటో ఇక్కడ చూద్దాం!

కొందరు ఎడమ చేతితో ఎందుకు రాస్తారు?

Next Story