- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ విస్తరణతో మారిన ట్రెండ్.. అందరి చూపు అక్కడే..
భాగ్యనగరం శరవేగంగా అభివృద్ది చెందుతోంది. ఇదే క్రమంలో భూముల లభ్యత తగ్గడంతోపాటు ఉన్న భూముల రేట్లకు రెక్కలు వచ్చేశాయి.

దిశ, రంగారెడ్డి బ్యూరో : భాగ్యనగరం శరవేగంగా అభివృద్ది చెందుతోంది. ఇదే క్రమంలో భూముల లభ్యత తగ్గడంతోపాటు ఉన్న భూముల రేట్లకు రెక్కలు వచ్చేశాయి. సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు హైదరాబాద్‌లో గజం స్థలం కూడా కొనలేని పరిస్థితి నెలకొంది. అయితే ఔటర్ వరకు హెచ్‌ఎండీఏ విస్తరణ, శివారు మున్సిపాలిటీలు జీహెచ్‌ఎంసీలో విలీనం కావడం.. ట్రిఫుల్ ఆర్, ఫోర్త్ సిటీ ప్రతిపాదనలతో ఇప్పుడు అందరి చూపు రంగారెడ్డి జిల్లా చుట్టూ ఉన్న శివారు ప్రాంతాల వైపు మళ్లింది.
ఇప్పుడిప్పుడే అన్ని రంగాల్లో.. అన్ని వైపులా శరవేగంగా డెవలప్ అవుతుండటంతో వివిధ వర్గాల ప్రజలు నగర శివారు ప్రాంతాల్లో భూములను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. రణగొణ ధ్వనులకు దూరంగా ప్రశాంత వాతావరణంలో నివాసం ఏర్పర్చుకోవాలన్న ఆలోచనతో సంపన్నులు సైతం ఆకర్షితులవుతున్నారు. శివారు ప్రాంతాల్లో రాజీవ్ స్వగృహ కార్పోరేషన్ నిర్వహించిన ఓపెన్ ప్లాట్ల వేలానికి అనూహ్య స్పందన వస్తుండగా.. రానున్న రోజుల్లో సర్కారీ లే అవుట్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడంపై హెచ్‌ఎండీఏ దృష్టి పెట్టింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో నిర్మాణదారుల చూపు సైతం ఇటు వైపే మళ్లుతోంది. కొనుగోలుదారుల ఆసక్తికి అనుగుణంగా నిర్మాణాలను చేపడుతున్నారు.
భవిష్యత్‌కు బేఫికర్
ఇప్పటికే శ్రీశైలం- హైదరాబాద్, సాగర్- హైదరాబాద్, హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి సమీపంలో ఉన్న ప్రాంతాలు గణనీయమైన అభివృద్దిని సాధించాయి. అయితే ఈ రెండు ప్రధాన రహదారులకు మధ్యలో ఉన్న కొన్ని కుగ్రామాలు కొంతకాలం క్రితం వరకు రియల్ రంగంలో కాస్త వెనకబడే ఉన్నాయి. కానీ గత నాలుగైదు ఏళ్లలో వచ్చిన పెనుమార్పులతో కుగ్రామాలు కాస్తా.. నేడు కాస్ట్‌లీ గ్రామాలుగా మారాయి. ప్రస్తుతం ఆయా ప్రాంతాలు రియల్ రంగంలో ఊహించని రీతిలో దూసుకుపోతున్నాయి. ఓఆర్‌ఆర్‌కు ఆనుకుని ఉన్న ఈ ప్రాంతంలో భారీగా వెంచర్లు ఏర్పాటవుతున్నాయి. ప్రధాన రహదారులకు ఐదారు కిలోమీటర్ల లోపలి వరకు రియల్ ఎస్టేట్ సంస్థలు భారీ లే అవుట్లతోపాటు, గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లు, విల్లా ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాయి.
శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ పార్కులు, లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు కావడంతో ఉపాధి అవకాశాలు సైతం మెరుగుపడ్డాయి. మెట్రో రైలును అటు ఫోర్త్ సిటీ వరకు, ఇటు ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు విస్తరించబోతుండడంతో రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనున్నది. త్వరలోనే రీజనల్ రింగ్ రోడ్డు కూడా రానుండడంతో ఈ ప్రాంతంలో డెవలప్‌మెంట్‌కు తిరుగుండదని భావిస్తున్నారు. శివారు మున్సిపాలిటీలు అన్నీ జీహెచ్‌ఎంసీలో విలీనం కావడంతో మౌలిక వసతులు సైతం పెద్ద ఎత్తున శరవేగంతో సమకూరుతాయి. ఈ ముందు చూపుతోనే ఈ ప్రాంతంలో స్థలాల కొనుగోలుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు.
కావాల్సినట్లుగా సదుపాయాలు
ప్రజల ఆసక్తికి అనుగుణంగా స్తిరాస్థి సంస్థలు సైతం వెంచర్లను సకల సదుపాయాలతో నివాసానికి అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. కొన్నిచోట్ల వీకెండ్ హోమ్స్, రిటైర్మెంట్ హోమ్స్ థీమ్‌లతోనూ ప్రాజెక్టులను అందుబాటులోకి తెస్తున్నారు. కొనుగోలు చేసిన స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టేలా విశాలమైన రోడ్లు.. ఇరువైపులా పచ్చని చెట్లు, రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నారు. ఫోర్త్ సిటీలో కమిషనరేట్ ఏర్పాటుతో భద్రతా పరంగానూ భరోసా ఏర్పడింది.
ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా ప్రయాణం సులభతరంగా మారింది. ట్రాఫిక్ సమస్యలు తప్పాయి. ఐటీ ఉద్యోగులు ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కితే గంటలోపే గచ్చిబౌలీకి చేరుకుంటున్నారు. పెద్ద కాలేజీలు, కార్పోరేట్ స్కూళ్లను సైతం శివారు ప్రాంతాల్లోనే నెలకొల్పుతున్నారు. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు కూడా అందుబాటు ధరలు ఉండడంతో చాలామంది శివారు ప్రాంతాల్లోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వస్తున్నారు.
లే అవుట్ల అభివృద్దిపై హెచ్‌ఎండీఏ దృష్టి
అన్ని వర్గాల ప్రజలకు సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా తొర్రూరు వద్ద 117 ఎకరాల్లో హెచ్‌ఎండీఏ చేసిన భారీ వెంచర్‌లోని ప్లాట్లకు ప్రస్తుతం రాజీవ్ స్వగృహ కార్పోరేషన్ ఆధ్వర్యంలో వేలం నిర్వహిస్తున్నారు. విడతల వారీగా నిర్వహిస్తున్న ఓపెన్ ప్లాట్ల వేలానికి అనూహ్య స్పందన వస్తుండగా.. వేలం పాటలో పెద్ద ఎత్తున కస్టమర్లు పాల్గొని రికార్డు స్థాయిలో ప్లాట్లను కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి భారీగానే ఆదాయం సమకూరుతోంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని హెచ్‌ఎండీఏ అవుటర్ చుట్టూ పెద్ద ఎత్తున లే అవుట్లను ఏర్పాటు చేయాలని సంకల్పిస్తోంది. వ్యవసాయానికి పనికిరాని భూములను రైతుల అనుమతితో సమీకరించి ల్యాండ్ పూలింగ్ విధానంలో వందల ఎకరాల్లో లే అవుట్లను అభివృద్ది చేసేందుకు ప్రణాళికలను రూపొందించింది. దీంతో శివారు ప్రాంతాల్లో స్థిరాస్థి రంగానికి ఊపు తెచ్చినట్లు అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.






