- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎడారిలో అవకాడో సాగుచేసి లక్షలు సంపాదిస్తున్నాడు.!
1.75 ఎకరాల ఫామ్‌ను లాభదాయక వ్యాపారంగా మలిచాడు.

దిశ, ఫీచర్స్: మహారాష్ట్రలోని బీడ్‌కు చెందిన పరమేశ్వర్ థోరట్ ఎడారి పరిస్థితులు, నీటి కొరత సవాళ్లను అవకాశంగా మార్చుకొని అవకాడో సాగులో మార్గదర్శకుడిగా నిలిచాడు. కఠినమైన వాతావరణం ఉన్నప్పటికీ సృజనాత్మక విధానం ద్వారా 1.75 ఎకరాల ఫామ్‌ను లాభదాయక వ్యాపారంగా మలిచాడు.
అర్కా సుప్రీమ్..
బీడ్‌లో వర్షాభావ పరిస్థితుల వల్ల వ్యవసాయం సవాలుగా మారింది. 2018లో పరమేశ్వర్ థోరట్ బెంగళూరుకు వెళ్లినప్పుడు అవకాడో సాగు ఆలోచన వచ్చింది. "అర్కా సుప్రీమ్" అనే ప్రత్యేక అవకాడో రకం గురించి తెలుసుకున్నాడు. ఇది 40-45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలలో కూడా వృద్ధి చెందుతుంది. "ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ రీసెర్చ్"ను సందర్శించి అవకాడో సాగు గురించి విలువైన సమాచారం తెలుసుకున్నాడు. ఈ జ్ఞానంతో కర్ణాటక నుంచి 50 అవకాడో మొక్కలను ఆర్డర్ చేసి సాగుచేశాడు. 2021లో ఆ 50 మొక్కలు అద్భుతమైన ఫలాలనిచ్చాయి.
మంచి టెక్నిక్స్..
అవకాడో సాగు సులభం కాదు. తీవ్ర ఉష్ణోగ్రతలు, నీటి కొరత సవాళ్లను అధిగమించడానికి పరమేశ్వర్ 0.75 ఎకరాలలో 2 అడుగుల గుండాలను తవ్వి వాటిని ఆవు పేడ ఎరువుతో నింపాడు. నీటి వృథాను తగ్గించడానికి "డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్"ను ఏర్పాటు చేశాడు. ఇది నీటిని, పోషకాలను నేరుగా మొక్కల రూట్‌లకు చేరవేస్తుంది. అదనంగా, వర్షాకాలంలో నీటిని సేకరించడానికి ఫామ్‌లో ఒక చెరువును ఉపయోగించాడు. దీనిని డ్రై సీజన్‌లో అంటే మార్చి, ఏప్రిల్ నెలల్లో వాడుకున్నాడు. 2022లో ఒక్కో ఫలాన్ని రూ.200కు విక్రయించి, రూ.3 లక్షల లాభం ఆర్జించాడు.
వ్యవసాయాన్ని వ్యాపారంగా..
పరమేశ్వర్ విజయానికి ప్రధాన కారణం సేంద్రీయ సాగు. ఆవు పేడ ఎరువు, సహజ పద్ధతులే అతడికి వరంగా మారాయి. గ్రాఫ్టింగ్ టెక్నిక్‌లను అవలంబించడం ద్వారా లాభాలను గణనీయంగా పెంచాడు. గ్రాఫ్టింగ్ అనేది ఒక మొక్క రూట్‌స్టాక్‌ను మరొక మొక్క షూట్‌తో కలపడం. తమిళనాడు నుంచి రూట్‌స్టాక్‌ను తెచ్చి ఫామ్‌లోని సియాన్‌లను ఉపయోగించాడు. 2022లో మరో 250 కొత్త మొక్కలను గ్రాఫ్ట్ చేశాడు. పరమేశ్వర్ 1.75 ఎకరాల ఫామ్‌లో 300 అవకాడో చెట్లు ఉన్నాయి. 2023లో 1200 కిలోల అవకాడోలను కోసి ఒక్కో ఫలాన్ని రూ.200కు విక్రయించి రూ.5-6 లక్షల లాభం ఆర్జించాడు.
సాగు పాఠాలు..
ఫామ్ నిర్వహణకు సంవత్సరానికి రూ.50000 ఖర్చు అవుతుంది. 2300 మొక్కలను ఒక్కో దానిని రూ.300కు విక్రయించాడు. ఒక్కో మొక్కకు రూ.100 ఖర్చు తీసివేసినా రూ.4.6 లక్షల నికర లాభం పొందాడు. మొత్తంగా ఈ యేడు అతడు ఎకరానికి సుమారు రూ.10 లక్షల నికర లాభం సాధించాడు. తన వ్యాపార మెళకువలను ఇతర రైతులకు నేర్పుతున్నాడు డ్రిప్ ఇరిగేషన్, సేంద్రీయ పద్ధతులతో కరువు ప్రాంతాల్లో అవకాడో సాగు గురించి అవగాహన కల్పిస్తున్నాడు. వ్యవసాయం సులభం కాదు. సవాళ్లు చాలా ఉంటాయి. వాటి నుంచి నేర్చుకుంటూ ముందుకెళితే మంచి ఫలితాలు ఉంటాయంటున్నాడు పరమేశ్వర్.






