పడిలేచిన కెరటం.. పారా ఛాంపియన్ సుమిత్.!

by Daayi Srishailam |

కాలు లేకున్నా పారా అథ్లెటిక్స్‌లో ప్రపంచ రికార్డు సాధించి బంగారు పతకాన్ని సాధించాడు

పడిలేచిన కెరటం.. పారా ఛాంపియన్ సుమిత్.!
X

దిశ, ఫీచర్స్: అన్నీ సక్రమంగా ఉండి పుష్కలమైన అవకాశాలు ఉన్నవాళ్లు కూడా సుఖానికి అలవాటుపడి ఇంట్లో కూర్చుంటున్నారు. నారాయణా అని తలుచుకొని నడింట్లో కూర్చుంటే ప్రయోజనం ఏముంటది.? ప్రయత్నం చేయనిది.. సాధనలేనిది ఏదీ సాధించలేం. కాలు లేకున్నా పారా అథ్లెటిక్స్‌లో ప్రపంచ రికార్డు సాధించి బంగారు పతకాన్ని సాధించాడు సుమిత్ అంటిల్.

వరుసగా మూడోసారీ..

సెప్టెంబర్ 30, 2025న న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లలో వరుసగా మూడోసారి బంగారు పతకాన్ని సాధించాడు పారా-అథ్లెట్ సుమిత్ అంటిల్. పురుషుల ఎఫ్64 జావెలిన్ త్రో విభాగంలో 71.37 మీటర్ల దూరం విసిరి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. భుజం నొప్పితో బాధపడుతున్నప్పటికీ కఠోర సాధన చేసి సాధించాడు సుమిత్. ఈ విజయం పారా అథ్లెటిక్స్ చరిత్రలో అతడ్ని మరో మెట్టు పైకి తీసుకెళ్లింది. సుమిత్ సంకల్పాన్ని, అతడి ప్రేరణాత్మక ప్రయాణాన్ని కొనియాడుతూ సోషల్ మీడియా మార్మోగుతోంది.

జీవితాన్ని మార్చేసిన యాక్సిడెంట్

సుమిత్.. 2015లో రోడ్ యాక్సిడెంట్‌లో కాలు కోల్పోయాడు. ఈ సంఘటన తన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అప్పటివరకు రెజ్లర్‌గా కొనసాగుతున్న సుమిత్ కెరీర్‌కు ఆ యాక్సిడెంట్‌తో కోలుకోలేని దెబ్బ పడింది. కానీ ఇక్కడే ఆగిపోవద్దనుకున్నాడు ఆయన. రెజ్లింగ్ కాకపోతే ఇంకొకటి.. అంతేగానీ తన క్రీడా ప్రయాణాన్ని ఆపేయొద్దనే సంకల్పంతో ముందుకు కదిలాడు. రెజ్లింగ్ నుంచి పారా జావెలిన్ త్రోకు మారాడు. పట్టుదలతో ఒకొక్క మెట్టు ఎక్కుతూ జాతీయ.. అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. తల్లి నిర్మలా దేవి మద్దతు ఆయనకెంతో బలాన్నిచ్చింది.

తల్లి ప్రోత్సాహంతోనే..

హర్యానాలోని కెవాల్ గ్రామానికి చెంది సుమిత్‌ది సాధారణ మధ్యతరగతి కుటుంబం. వాళ్ల నాన్న రామ్ కుమార్ అంటిల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో జూనియర్ వారంట్ ఆఫీసర్‌‌గా పనిచేసేవాడు.. సుమిత్‌కు ఏడేళ్ల వయసున్నప్పుడు రామ్ కుమార్ చనిపోయాడు. దీంతో కుటుంబం సమస్యల వలయంలో చిక్కుకుంది. తల్లి నిర్మలా దేవి కుటుంబాన్ని పోషించడానికి చాలా కష్టపడ్డది. ముగ్గురు కూతుళ్ల పెళ్లిళ్లు చేసింది. సుమిత్ మంచి క్రీడాకారుడు కావాలని ఆమె కలగనేది. ఆ దిశగా ఎంతగానో ప్రోత్సహించింది. క్రీడలతో సమానంగా చదువుకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలనేది.

బంగారు పతకం..

సుమిత్ చిన్నప్పుడే రెజ్లింగ్ పట్ల ఆసక్తి చూపించాడు. మంచి రెజ్లర్ కావాలని కలగని నిత్యం ప్రాక్టీస్ చేసేవాడు. అయితే 2015లో రెజ్లింగ్ ఆడేందుకు వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో తన ఎడమ కాలును కోల్పోయాడు సుమిత్. దీంతో రెజ్లింగ్‌ను వదిలేసి పారా-అథ్లెటిక్స్ వైపు వెళ్లాడు. 2018లో పారా జావెలిన్ త్రోలో శిక్షణ ప్రారంభించాడు. రోజూ గంటల తరబడి ప్రాక్టీస్ చేసేవాడు. అలా టోక్యోలో జరిగిన పారాలింపిక్స్ 2020లో బంగారు పతకంతో పాటు ప్రపంచ రికార్డు సాధించాడు. ఆ తర్వాత అర్జున అవార్డు.. తాజాగా బంగారు పతకం సాధించాడు.

Next Story