- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుడిసెలో పాఠాలు చెప్పి యూనివర్సిటీ వరకు తీసుకెళ్లిన పహచాన్.!
94% సక్సెస్‌తో సరికొత్త మార్పు తీసుకొచ్చింది

దిశ, ఫీచర్స్: గుడిసెలోని ఒక బ్లాక్‌బోర్డ్ 1500 మందికి పైగా పిల్లలకు కాలేజీ ద్వారం తెరిచింది. దీనిని సాధ్యం చేసింది "పహచాన్- ది స్ట్రీట్ స్కూల్". 1200 మంది స్వచ్ఛంద సేవకులతో ఒక్క తరగతి గది లేకుండా పదేళ్లలో 5000 మంది పిల్లలకు విద్యనందించిన ఈ సంస్థ 94% సక్సెస్‌తో సరికొత్త మార్పు తీసుకొచ్చింది.
గుడిసె టు యూనివర్సిటీ
ఢిల్లీలోని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కార్యాలయానికి 50 మీటర్ల దూరంలో దాదాపు 10000 మంది నివసించే గుడిసె ఉంది. ఇక్కడ నీరు, ఆరోగ్య సౌకర్యాలు కరువు. కొన్నేళ్ల క్రితం వరకు విద్య అనేది ఇక్కడ ఒక ఆలోచన మాత్రమే. అయితే ఇక్కడో అద్భుతమైన మార్పు జరిగింది. దీనికి కారణం సమాజం విస్మరించిన పిల్లలే. ఈ కథలో హీరో దీపక్ కుమార్. అతను తన గుడిసెలో 12వ తరగతి బోర్డు పరీక్షలు పాసై ఢిల్లీ యూనివర్సిటీలో చేరిన తొలి విద్యార్థి. దీపక్‌కు ఈ విజయం సాధ్యం చేసింది "పహచాన్- ది స్ట్రీట్ స్కూల్".
బ్రాండ్ కాదు మోడల్
పహచాన్ 2015లో కేవలం ఐదుగురు పిల్లలతో ప్రారంభమైంది. దీని వ్యవస్థాపకుడు ఆకాశ్ టండన్. ఒక రోజు గుడిసెలోని పిల్లలు ఐటీఓ సమీపంలోని ఒక మురుగు కాలువలో ఈత కొడుతూ దాన్ని స్విమ్మింగ్ పూల్‌గా భావించడం చూసినప్పుడు ఆకాశ్‌కు ఒక ఆలోచన తట్టింది. వారికి అది ప్రమాదకరమని చెప్పాల్సిన అవసరం ఉంది. అంతకంటే ముఖ్యంగా ప్రపంచాన్ని భిన్నంగా అర్థం చేసుకునే అవకాశం ఇవ్వాలి అని తన స్నేహితులతో కలిసి పహచాన్‌ను స్థాపించారు. దీనినొక బ్రాండ్ గా కాకుండా.. మోడల్ గా తీర్చిదిద్దుతూ దీపక్ విషయంలో చేసి చూపించారు.
ఎన్జీఓల సహకారం
పహచాన్ లక్ష్యానికి సమాజం సహాయం తోడైంది. స్వచ్ఛందంగా పనిచేయడానికి వాలంటీర్లు వచ్చారు. గుడిసెలో ఉండే పిల్లలను బాగుచేస్తామంటే అన్ని వైపుల నుంచి సహకారం అందింది. వ్యక్తిగత విరాళాలతో పాటు క్రౌడ్‌ఫండింగ్, కార్పొరేట్ సీఎస్సార్ గ్రాంట్ల ద్వారా నిధులను సమీకరణ జరుగుతోంది. డిజిటల్ పరికరాలు, స్టేషనరీ ఇతర సహాయాల రూపంలో వచ్చే సపోర్ట్ ఈ సంస్థకు బలాన్నిస్తుంది. ప్రభుత్వ గ్రాంట్లు లేకపోయినా ఎన్జీఓలు, విద్యా సంస్థలతో కలిసి ప్రాజెక్టులు, శిక్షణల కోసం సహకరిస్తుంది.
వాలంటీర్లే హృదయం
"పహచాన్- ది స్ట్రీట్ స్కూల్"కు వాలంటీర్లు గుండెకాయ లాంటివారు. "పహచాన్"లో విద్య కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాదు. వాలంటీర్లు పిల్లలకు విలువలు, సంభాషణ నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం వంటివి నేర్పుతారు. "పహచాన్" ప్రత్యేకత విద్యార్థుల సంఖ్య కాదు. వారి మనస్తత్వంలో తెచ్చిన మార్పు. ఈ సంస్థ ఒక సాధారణ విద్యాసంస్థలా పనిచేస్తుంది. ప్రతి విద్యార్థికి రిజిస్ట్రేషన్, గుర్తింపు కార్డు, హాజరు, పనితీరు ట్రాకింగ్ ఉంటాయి. ఒక్కో వాలంటీర్ 4-5 మంది పిల్లలకు మార్గదర్శనం చేస్తాడు. సంస్థ సొంత కరికులమ్‌ను రూపొందించింది. ఇది విద్యను సంబంధితంగా, నైపుణ్యం ఆధారితంగా చేస్తుంది.






