- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mother's Day : హ్యాపీ మదర్స్ డే : అమ్మకు ఏం కావాలో తెలుసా?
Mother's Day : హ్యాపీ మదర్స్ డే : అమ్మకు ఏం కావాలో తెలుసా?

దిశ, ఫీచర్స్ : అమ్మ అంటే.. అందరికీ ఇష్టమే.. అమ్మ దగ్గరగా ఉంటే.. చెప్పలేనంత గుండె ధైర్యం. ప్రేమానురాగాల అనుబంధానికి, త్యాగానికి ప్రతీక అమ్మ. ఏమీ లేకున్నా అన్నీ ఉన్నంత సంతోషాన్నిచ్చేది కేవలం తల్లి ప్రేమే. తన బిడ్డకు జన్మనిచ్చిన మరు క్షణం నుంచే బంధం కోసం, బాధ్యత కోసం, కుటుంబం కోసం ఏమాత్రం స్వార్థం లేకుండా అహర్నిశలూ కృషి చేసే మహా మనిషి ఎవరైనా ఉన్నారంటే అది అమ్మే. అలాంటి అమ్మను మనం ఎలా గౌరవిస్తున్నాం?. సమాజంలో అమ్మలకు ఎదురవుతున్న అనుభవాలేమిటి? అందులో పిల్లలపాత్ర ఏమిటి? మాతృదినోత్సవం సందర్భంగా మరోసారి గుర్తు చేసుకుందాం.
కనిపించని దేవుడికంటే.. కనీ పెంచే అమ్మ ప్రేమే గొప్పది అంటారు. మరి అలాంటి తల్లికి నేటి సమాజం ఎలాంటి గుర్తింపు నిస్తున్నది. ఒక్కసారైనా ఆలోచించారా? తల్లిని చితకబాదిన కొడుకు, వృద్ధాశ్రమంలో విడిచిపెట్టిన కూతురు అనే వార్తలు కూడా నేడు మనం వింటూనే ఉన్నాం. రోజుకు కొన్ని వందల మంది తల్లులు నిరాశ్రయులు అవుతున్నారని, అనాథాశ్రమాలకు చేరుతున్నారని నివేదికలు సైతం వెల్లడిస్తున్నాయి. అదే నిజమైతే అమ్మకు అన్యాయం జరిగినట్లే.. ఈ సమాజంలో ఆమెకు తగిన గౌరవం దక్కనట్లే. అలాంటి పరిస్థితికి మనం బాధ్యులం కావద్దు అనుకొని ఆచరించినప్పుడే కదా మాతృదినోత్సవానికి సార్థకత.
త్యాగానికి మారుపేరు అమ్మ
ఒక తల్లి బిడ్డకు జన్మనివ్వడం అంటే ఆషా మాషీ కాదు. అందుకోసం గొప్ప త్యాగమే చేయాలి. ఆరోగ్యం ఎలా ఉన్నా తొమ్మిది నెలలు తన కడుపులో బిడ్డను మోయాలి. ఆ సమయంలో తినలేరు, ప్రశాంతంగా పడుకోలేరు. ఇక డెలివరీ సమయంలో అయితే ఆ కష్టాలు వర్ణనాతీతం. కొన్ని పరిస్థితుల్లో అపరేషన్ ఫెయిల్ కావచ్చు. బాడీలో మార్పులు సంభవించి ప్రాణాలు పోవచ్చు. ఇదంతా తెలిసినా మహిళ బిడ్డను కనేందుకు వెనుకడుగు వేయడం లేదంటే.. తన ప్రాణాలు సైతం పణంగా పెడుతోందంటే.. అమ్మ అనే పిలుపు కోసం ఆమె ఎంతలా పరితపిస్తుందో, ఎంత త్యాగం చేస్తుందో కదూ.
భారం కాదు.. వృద్ధాశ్రమంలో వద్దు
తన పిల్లల కడుపు నింపడానికి అమ్మ ఎంతో కష్టపడుతుంది. పస్తులు కూడా వుంటుంది. అలాంటి అమ్మ పెద్దయ్యాక కొందరికి ఎందుకు భారం అవుతున్నది? వృద్ధాశ్రమాల్లో ఎందుకు వేస్తున్నారు? ఇది కదా మారాలి. అంత చేస్తున్నా అమ్మలోని ప్రేమ మాతరం మారడం లేదు. ‘నిన్ను ఎందుకు నీ పిల్లలు ఇక్కడ విడిచిపెట్టారు’ అని ఎవరైనా అడిగితే.. ఆ తల్లి చెప్పే సమాధానం ఏంటో తెలుసా? ‘పాపం ఎంతని కష్టపడతారు. వాళ్ళకి పిల్లలు, బాధ్యతలు ఉంటాయి కదా. వాళ్లు సంతోషంగా ఉంటే చాలు అంటుందే తప్ప. అప్పుడూ కూడా అసహ్యించుకోదు. ఎవరి ముందూ తన పిల్లను తక్కువ చెయ్యదు తల్లి. పిల్లలపై ఇంత ప్రేమ అమ్మకే సాధ్యం కదూ.
చివరి క్షణంలోనూ అంతే ప్రేమ
పురుడు సమయంలో హాస్పిటల్ బెడ్‌పై ఉన్న తల్లి.. మొదటి సారి తన బిడ్డను తీసుకొచ్చి డాక్టర్ చూపించినప్పుడు ఆమె కళ్ళలో నీళ్ళు.. పెదవులపై చిరునవ్వు ఎంత స్వచ్ఛంగా ఉంటుంది కదా. అదే తల్లి తాను చనిపోతున్న చివరి క్షణంలో.. బిడ్డను చూసేందు కూడా అంతే ఆరాట పడుతుంది. తన పేగు బంధం కళ్ల ముందు కనిపించగానే మరల కళ్లలో కన్నీళ్లు.. పెదవులపై అదే చిరునవ్వు. పిల్లలకు జన్మనిచ్చినప్పటి నుంచి తాను చనిపోయే వరకూ రవ్వంత కూడా అమ్మ ప్రేమలో మార్పు రాదు. అలాంటి ప్రేమ మూర్తికి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.






