- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేవలం పసుపులోనే కాదు.. రంగు రంగుల మామిడి పండ్లు ఎప్పుడైనా చూశారా?
వేసవిలో మాత్రమే లభించే మామిడి పండ్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.

దిశ, వెబ్ డెస్క్: వేసవిలో (Summer) మాత్రమే లభించే మామిడి పండ్లు (Mangoes) అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందుకే మామిడి సీజన్ వచ్చిందంటే చాలు.. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఈ మధుర ఫలం రుచి చూసేందుకు ఆసక్తి చూపుతుంటారు. పచ్చి మామిడి కాయ నుంచి పండు మామిడి వరకు రుచిలో దానికదే సాటి. అయితే, సాధారణంగా మామిడిలో.. రసాలు, బంగినపల్లి, ఆల్ఫాన్సో, కోత మామడి వంటి పలు రకాలు ఉంటాయని తెలుసు. కానీ, ఇందులో మనకు తెలియని చాలా రకాల పండ్లు ఉంటాయి. అంతేకాదు, మనకు తెలిసిన మామిడి పండ్ల రకాలు ఎక్కువగా పసుపు రంగులోనే కనిపిస్తాయి. కానీ, నలుపు, నీలం, తెలుపు... తదితర రంగుల మామిడి రకాలూ ఉన్నాయి. మరీ ఆ రకాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
థాయ్‌లాండ్, ఇండోనేషియా, వియత్నాం, ఫిలిప్పీన్స్ దేశాల్లో అధికంగా బ్లాక్ స్టోన్ మ్యాంగో, కస్తూరి బ్లాక్ మ్యాంగోను పండిస్తుంటారు. ఇది పండిన తర్వాత నల్లగా మారుతుంది. లోపల ఆరెంజ్ రంగు కండ ఉంటుంది. అరుదైన ఈ మ్యాంగో ఒక్కో పండు ధర రూ.300 నుంచి 500 వరకూ ఉంటుంది. థాయ్‌లాండ్ పండించే మరో రకం మామిడి వైట్ మ్యాంగో. పుల్లపుల్లగా-తియ్యతియ్యగా ఉండే దీన్ని- వంటల్లో ఎక్కువగా వాడతారు. ప్రపంచంలోనే ఖరీదైన మామిడి వెరైటీ జపాన్‌కు చెందిన మియాజాకీ. విదేశీ మార్కెట్లో కిలోకి రెండున్నర లక్షల రూపాయలకు పైగానే ఉంటుంది. ఈ రకం ఆకుపచ్చ రంగు నుంచి ఊదా రంగులోకి మారుతుంది. ఆ తర్వాత ఆకట్టుకునే రూబీ-రెడ్ రంగుకు వచ్చేస్తుంది.
మామిడి రకాలలో అతి పెద్దది మధ్యప్రదేశ్‌లో సాగు చేసే నూర్జహాన్ మామిడి పేరొందింది. ఇది ఏకంగా రెండు నుంచి ఐదు కిలోల వరకు పెరుగుతుందట. ఒక్కో కాయ ధర రూ.వెయ్యి వరకూ ఉంటుంది. ఈ మామిడి రకానికి పూత దశలోనే కొనేవాళ్ల నుంచి ప్రీబుకింగ్స్ వస్తుంటాయి. అలాగే, రటౌల్, అంగూర్ దానా మామిడి పండ్లు అత్యంత చిన్న మామిడి పండ్ల రకాలు. యూపీలో పండించే ఈ రకం మామిడి పండ్లు ద్రాక్ష పండ్ల కన్నా కాస్తా పెద్దగా ఉంటాయి. కఠిమన్, పునాస వంటి పలు రకాలు ఏడాది పొడవునా కాస్తాయి. ప్రపంచవ్యాప్తంగా వెయ్యి రకాల మామిడి ఉంటే.. ఇలా దేని ప్రత్యేకత దానికే ఉంది.






