- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అభిరుచులే ఆదాయ మార్గం..! యువ దంపతుల ఫుడ్ ట్రక్ బిజినెస్
నిషా భూషణ్ జాదవ్ ఫుడ్ ట్రక్ బిజినెస్ తక్కువ కాలంలోనే ఎక్కువమందిని ఆకర్షించింది. రూ. 8.4 లక్షల టర్నోవర్ సాధిస్తున్నారు.

దిశ, ఫీచర్స్ : చదువుకున్నంత మాత్రాన ఉద్యోగాలే చేయాలనేమీ లేదు. అయినా అందరికీ వస్తాయన్న గ్యారెంటీ కూడా ఏమిటి? వస్తే మంచిదే. మరి రాకుంటే? ఏదో ఒక పనో, వ్యాపారమో చేసుకొని సంతోషంగా బతకాల్సిందే కదా.. కానీ కొందరు ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తుంటారు. జాబ్ రాకుంటే నిరాశ చెందుతుంటారు. ఇంత చదువు చదివి ఇడ్లీలు అమ్ముకోవాలా? చిన్న చిన్న వ్యాపారాలు చేయాలా? అని తెగ నామోషీగా ఫీలవుతుంటారు. నిషా, భూషణ్ జాదవ్ దంపతులు మాత్రం అందుకు భిన్నం. ఉన్నత చదువులు చదివి కూడా రోడ్‌సైడ్ ఫుడ్ వ్యాపారం చేస్తూ నెలకు రూ.70 వేలు సంపాదిస్తున్నారు. సంవత్సరానికి ₹8. 4 లక్షల టర్నోవర్ సాధిస్తున్నారు.
ఫుడ్‌ఫాంటసీ.. స్టార్ట్ చేసి..
నాసిక్‌కు చెందిన నిషా, భూషణ్ జాదవ్‌లకు కొన్నేండ్ల క్రితం పెళ్లయింది. నిషా ఎంబీఏ పట్టభద్రురాలు కాగా, అదే ప్రాంతానికి చెందిన భూషణ్ హోటల్ మేనేజ్‌మెంట్‌లో పట్టభద్రుడు. పట్టాలున్నాయి కానీ.. అందుకు తగిన ఉద్యోగాలు లభించలేదు. ప్రయత్నించి విఫలమయ్యారు. కొంతకాలం ఉద్యోగాలు చేసినా నెలకు రూ. 20 నుంచి 30 వేలలోపు మాత్రమే వచ్చేది. దీంతో ఇద్దరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఏదో ఒక బిజినెస్ ప్రారంభిస్తే తక్కువ జీతానికి ఎవరికిందా పనిచేయాల్సిన అవసరం ఉండదు. పైగా ఎక్కువ కూడా సంపాదించవచ్చు అనుకున్నారు. అభిరుచులు, ఆలోచనలు కలిశాయి. ఇంకేముంది ‘ది ఫుడ్ ఫాంటసీ’ అనే ఫుడ్‌ట్రక్ వ్యాపారాన్ని ప్రారంభించారు.
రోజుకో ఏరియాలో..
గత సంవత్సరం జూన్‌లో ఈ ఫుడ్‌ట్రక్ వ్యాపారం ప్రారంభించారు నిషా భూషన్ జాదవ్ దంపతులు. ఫుడ్ ట్రక్ బిజినెస్ అంటే.. ఒక వాహనంలోనే అన్ని వంటకాలు చేసే ఫెసిలిటీస్ ఏర్పాటు చేయించి, అవసరమైన సామాగ్రి అందులో పెట్టుకొని, ప్రజలు ఎక్కువగా ఉండే వివిధ ప్రాంతాల్లో రోజుకో ఏరియాలోనో, రోజుకో వీధిలోనో, రెండు మూడు రోజులకో ఏరియాలోనో వాహనం నిలిపి ఆహార పదార్థాలు విక్రయించడం. అంటే ఇడ్లీ, దోశ, వడా, పూరీ వంటి టిఫిన్లు సహా, బిజ్జాలు, బర్గర్లు, సమోసాలు, మోమోలు, బజ్జీలు, పకోడీ వంటి స్నాక్స్ కూడా వాహనంలోనే అప్పటికప్పుడు చేసి కస్టమర్లకు విక్రయిస్తుంటారు.
రూ. 8.4 లక్షల టర్నోవర్
నిషా భూషణ్ జాదవ్ వ్యాపారం తక్కువ కాలంలోనే ఎక్కువమందిని ఆకర్షించింది. ప్రారంభించిన అనతి కాలమే అయినా, కస్టమర్లతో వ్యవహరించే విధానం, నాణ్యత, వంటకాల్లో రుచి వంటివి ఈ దంపతుల వ్యారానికి మంచి ఆదరణ తెచ్చి పెట్టాయి. ప్రస్తుతం నెలకు రూ. ₹70,000 ఆదాయం వస్తోంది. అంటే ఏడాదికి రూ. 8.4 లక్షలు సంపాదిస్తున్నారు. సాయంత్రం వేళల్లో అయితే.. తమ వాహనంవద్ద స్నాక్స్ తినడానికి జనం పెద్ద సంఖ్యలో వస్తుంటారని నిషా పేర్కొన్నారు. ఇంకో వాహనం కొని, కొందరికి ఉపాధి కల్పించి, తమ వ్యాపారాన్ని విస్తరించాలని కూడా భావిస్తున్నట్లు తెలిపారు. సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలని కలలు గనే యువ వ్యాపారవేత్తలకు నిషా భూషణ్ జాదవ్‌ల సక్సెస్ జర్నీ ఒక స్ఫూర్తిదాయక ఉదాహరణగా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు అంటున్నారు వ్యాపార విశ్లేషకులు సైతం.






