Memories : వేపచెట్టు నీడలో.. వేసవి జ్ఞాపకం

by Javid Pasha |

ఎన్ని హృదయాల్లో తీపిగురుతులై నిలిచిపోయిందో. ఎందరి జీవితాల్లో ప్రేమానుబంధాలై అల్లుకుపోయిందో వేపచెట్టు. అందులో మీరూ ఉన్నారా?

Memories : వేపచెట్టు నీడలో.. వేసవి జ్ఞాపకం
X

దిశ, ఫీచర్స్ : వేసవి సెలవులొస్తున్నాయంటే పిల్లలు తెగ సంబరపడిపోతుంటారు. సిటీలో ఉన్నవాళ్లైతే సొంతూళ్లకు లేదా అమ్మమ్మ, తాతయ్య వాళ్ల ఊళ్లకు వెళ్లి సంతోషంగా, సరదాగా గడిపిరావాలని కలలు కంటుంటారు. అది చూసి తల్లిదండ్రులు కూడా మురిసిపోతుంటారు. అయితే పిల్లలకే కాదు.. పెద్దల్లోనూ కొన్ని జ్ఞాపకాలను తట్టిలేపుతుంది వేసవి కాలం. అలాంటి వాటిలో వేపచెట్టు కూడా ఒకటి. ఎండాకాలం మోసుకొచ్చే మధురమైన తీపి జ్ఞాపకాల చల్లని చిరుగాలి వంటిది కూడా ఈ వేప వృక్షం.

తీపి గురుతులై నిలిచిన చోటు..

మీరు 90s కిడ్స్ అయితే గనుక చిన్నప్పుడు ఊర్లల్లో చూసే ఉంటారు బహుశా.. రెండు మూడు దశాబ్దాలక్రితం పల్లెటూరి వాతావరణం, ఆరోగ్యం, ఆనందం అంతా వేపచెట్టుతో ముడిపడి ఉండేది. మిట్ట మధ్యాహ్నపు ముచ్చట్లు, సాయంకాలపు సరదాలు వంటివన్నీ ఇంటి ముందున్న వేపచెట్టుకిందో, పొలంవద్దనున్న వేపచెట్టు కిందో, రచ్చబండకాడి వేపచెట్టు కిందో సేదదీరేవి. ఆ రోజులే చాలామందికి జీవితాంతం సరిపడా అందమైన జ్ఞాపకాలను బహుమతిగా ఇచ్చాయి. ఎన్ని హృదయాల్లో తీపిగురుతులై నిలిచిపోయిందో. ఎందరి జీవితాల్లో ప్రేమానుబంధాలై అల్లుకుపోయిందో.. అందులో మీరూ ఉన్నారా? అయితే అదృష్టవంతులే!

మదిని తడిమే యాది..

ఉపాధి కోసమో, ఉద్యోగం కోసమో పల్లెలు దాటివచ్చి పట్నాల్లో, నగరాల్లో ఉంటున్న చాలామంది మనసుల్లో ఇప్పుడు వేపచెట్టు ఒక మధుర జ్ఞాపకం. ఊర్లల్లో ఉన్నప్పుడు చెట్టుకింద కూర్చొని దోస్తులతో ముచ్చట వెట్టిన యాది మదిని తడుముతుంటే.. ఒక్కసారైనా ఆ రోజులే బాగుండునని అనుకోని వారెవరుంటారు చెప్పండి! ఇక మిట్ట మధ్యాహ్నపు వేళల్లో పిల్లలు, పెద్దలు వేపచెట్టుకిందనే ఉన్న అరుగు మీదనో, అది లేకుంటే అక్కడ వేసుకున్న నవారు మంచంమీదనో కూర్చొని మాట్లాడుకునే వారు. సరదా మాటలతో సంతోషంగా గడిపేవారు. పిల్లలైతే గోటీలాటలు, బొమ్మలాటలు, ‘కుంటి చిచ్చ’, అష్టాచెమ్మా వంటివి ఆడుకునేవారు. పెద్దలు కూడా అష్టా చెమ్మా ఆడేవారు. నలుగురైదుగురు కలిశారంటే.. కష్ట సుఖాలు పంచుకునేవారు. సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకునేవారు. కష్టాలు చెప్పుకొని బోరున ఏడ్చేవారు. కుటుంబ సమస్యలు, సామాజిక పోకడలు, కాలం తెచ్చిన మార్పులు, అప్పులు, ఆమ్దానీలు ఇలా అన్నీ మాట్లాడుకునేవారు. ఒక విధంగా చెప్పాలంటే.. వేపచెట్టు నీడ నాటి గ్రామీణులకు అమ్మ ఒడి వంటిది. ఇప్పుడెంతో మంది దానిని మిస్ అవుతున్నారో కదా!

- మొహమ్మద్ జునైద్

Next Story