- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, ఫీచర్స్ : చిన్న పిల్లల్ని మీరు గమనించే ఉంటారు. శిశువు దశలో లేదా బాల్యంలో తల్లి సమక్షంలో ఉన్నప్పుడు చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఉంటారు. అమ్మ స్పర్శ వారిలో ఆనందానికి కారణం అవుతుంది. అర్థం కాకపోయినా, ఇంకా మాటలు రాకపోయినా అమ్మ మాట్లాడే మాటలు, అమ్మ స్వరం వింటూ ఆనందంతో కేరింతలు కొడతారు. పెదవులతో, కళ్లతో, కదలికలతో హావభావాలు పలికిస్తారు. అమ్మ జోలపాడితే హాయిగా నిద్రపోతారు. అమ్మ కాసేపు దూరంగా వెళ్తే ఏడుస్తారు. గుక్కపెట్టి ఏడస్తున్నా సరే.. అమ్మ దగ్గరకు రాగానే.. అమ్మ పిలవగానే చెప్పలేనంత ఆనందంతో కేరింతలు కొడతారు. ఎందుకిలా? మిగతా వ్యక్తులతో పోలిస్తే అమ్మ మాట వినగానే, అమ్మ స్వరం వినగానే పిల్లలు ఎందుకంతే హ్యాపీగా ఫీలవుతారు. అంటే అందుకు ప్రత్యేక కారణం ఉందంటున్నారు నిపుణులు. అదే న్యూరో సింక్రోని (Neural Synchrony). పేరెంట్స్ - పిల్లల మధ్య మెదడు సమకాలీకరణకు సంబంధించిన ఈ అద్భుతమైన స్థితి పిల్లల్లో భాషా నైపుణ్యాలు, జీవన నైపుణ్యాలను పెంపొందిస్తుంది.
మెదడు తరంగాలు ఒకే రిథమ్‌లో..
చాలామంది తల్లిదండ్రులు గమనించరు కానీ.. కానీ న్యూరో సైంటిస్టులు తమ పరిశోధనలో భాగంగాబ్రెయిన్ స్కాన్‌లను పరిశీలించినప్పుడు పేరెంట్స్ - పిల్లల మధ్య మెదడు సమాకాలీకరణ Neural Synchrony జరుగుతుందని కనుగొన్నారు. అమ్మ లేదా నాన్న తన చిన్నారులకు కథ చెబుతున్నప్పుడు, పిల్లలు తల్లి ఒడిలో వాలినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, స్పర్శకు గురైనప్పుడు ఆ క్షణంలో ఇద్దరి మెదళ్లలోని తరంగాలు (Brain waves)ఒకే రిథమ్‌లో కదలడం మొదలవుతాయి. అంటే ఉదాహరణకు ఇద్దరి మెదళ్లు ఒకే మ్యూజిక్, ఒకే బీట్‌కు డాన్స్ చేయడం లాంటిది. శాస్త్రవేత్తలు “న్యూరల్ సింక్రొని” లేదా బ్రెయిన్ సింక్రనైజేషన్ అని పిలుస్తారు. ఇది ఇప్పటి వరకు కనుగొన్న అతి శక్తివంతమైన బాల్య దశ శక్తుల్లో ఒకటి. కానీ దీని గురించి దాదాపు ఎవరూ మాట్లాడరు. చాలా మందికి తెలియదు కూడా.
భావోద్వేగాల నియంత్రణ
తల్లిదండ్రులు పిల్లల మధ్య భావోద్వేగ నియంత్రణకు, ప్రేమ, అనుబంధాల ప్రేరణకు న్యూరో సింక్రోని కీ రోల్ పోషిస్తుంది. అలాగే అమ్మ మాట, పాట వంటివి పిల్లలల్లో నాణ్యమైన నిద్రకు కారణం అవుతాయి. తల్లి చెప్పిన దానికి అనుగుణంగా పిల్లల ప్రవర్తనలో మార్పులకు, స్థిరంగా ఆరోగ్యంగా ఉండటానికి, భాష నేర్చుకోవడానికి ఈ మెదడు తరంగాలు లేదా న్యూ సింక్రోని సహాయపడుతాయి. భయాలు, అభద్రతా భావాన్ని దూరం చేసి ఆత్మ విశ్వాసాన్ని పెంచుతాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి. తన తల్లి లేదా తండ్రి కారణంగా తాను సంతోషంగా ఉన్నాను, భయం లేకుండా ఉన్నాను, సురక్షితంగా ఉన్నాను అనే భావనను, జీవ శాస్త్రీయ స్థితిని న్యూరో సింక్రోని పెంపొందిస్తుంది. తల్లి దండ్రుల మాటలు, పాటలు, చేతలు, హావ భావాలు, సంభాషణ, స్పర్శ వంటివి పిల్లల్ని ప్రభావితం చేసినంతగా స్మార్ట్ ఫోన్లు, ఇతర కమ్యూనికేషన్లు కూడా ప్రభావితం చేయలేవని శాస్ర్తవేత్తలు అంటున్నారు.
సురక్షిత భావనకు కారణం
పిల్లలు కథ చదివేటప్పుడు లేదా పాట పాడేటప్పుడు సింక్రోని ఎక్కువ ఉంటే పదజాలం, వాక్య నిర్మాణం చాలా తొందరగా వస్తాయి భావోద్వేగ నియంత్రణ (Emotional Regulation) బలపడుతుంది. పిల్లలు కోపంగా ఉన్నా, భయపడుతున్నా తల్లి స్వరంతో సింక్ అయితే త్వరగా శాంతిస్తారు. నిద్రపోయే ముందు తల్లి తన బిడ్డలకు కథ చెప్పడం లేదా కౌగిలించుకోవడం వల్ల సింక్రొనీ పెరిగి నిద్ర మెరుగవుతుంది. సురక్షిత బంధం (Secure Attachment) ఏర్పడుతుంది. పిల్లలు తామున్న పరిస్థితి, ప్రదేశం సురక్షితమైనదని ఫీల్ అవుతారు. ఏడీహెచ్‌డీ, ఆటిజం ఉన్న పిల్లల్లో కూడా సింక్రొనీ పెంచితే ప్రవర్తనలో చాలా మెరుగుదల కనిపిస్తుంది. కొన్నిసార్లు ఇది పెద్దల్లో కూడా పనిచేస్తుంది. భార్యాభర్తలు, ప్రేమికులు, సహచరులు కలిసి వెళ్తు్న్నప్పుడు, మాట్లాడుకుంటున్నప్పుడు, సంగీతం వింటున్నప్పుడు కూడా వాళ్ల మెదళ్లు సింక్ అవుతాయి. పరస్పర నమ్మకం పెరుగుతుంది.






