అమ్మా.. నీ త్యాగం ఎప్పటికీ మరువలేం..

by Dishanational2 |
అమ్మా.. నీ త్యాగం ఎప్పటికీ మరువలేం..
X

దిశ, వెబ్‌డెస్క్: పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ.. కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మా.. అంటూ అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. లోకంలో స్వార్థం లేని వారంటూ ఎవరైనా ఉన్నారా అంటే అది అమ్మ మాత్రమే. కన్న పిల్లలు, కట్టుకున్న భర్త కోసం తన ఆనందాలను, కోరికలు అన్నింటినీ త్యాగం చేస్తుంది. తన కన్నవారి నుంచి అమ్మా అనే పిలుపు విని ఎంతో పొంగిపోతుంది మాతృమూర్తి. తన కడుపులో ప్రతిరూపం పడ్డ క్షణం నుంచి ఆ బిడ్డ బటకు వచ్చేవరకు ఆ తల్లి ఎన్నో కలలు కంటుంది.. తన కన్నబిడ్డ కోసం పురిటినొప్పులు కూడా సంతోషంగా భరించి బిడ్డను చూసుకొని అన్నింటిని మర్చిపోతుంది. అందుకేనేమో ఎంతో మంది కవులు అమ్మ గురించి ఎంతో గొప్పగా వర్ణించారు. ఇక ''సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ.. నీ గర్భ గుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా.. అమ్మా ..అమ్మా ..'' ఈ పాట వింటే అమ్మగొప్పతనం ఏంటో తెలుస్తుంది. కానీ ఇలా ఒక్కరోజులో చెప్పేది కాదు అమ్మ ప్రేమ, జీవితాంత ఎంత చెప్పినా అమ్మ గొప్పతనం అనేది తరగదు.. ఎందుకంటే మనం ఎన్ని చిలిపి పనులు చేసినా.. అమ్మకు మన మీద ప్రేమ ఆవగింజ అంతనన్న తరగదు అంటారు. అలా అమ్మ గొప్పతనం కూడా చెప్పితే తగ్గేది కాదు.





పిల్లలకు అమ్మ అంటే ఎనలేని ప్రేమ ఉంటుంది. ఇక ఆ ప్రేమను వ్యక్తపరచడానికి మే రెండో ఆదివారం మదర్స్ డే మొదలైంది. స్వార్థం అంటూ లేకుండా నిస్వార్థంగా నిరంతరం మనకు ప్రేమను పంచే అమ్మ కోసం ప్రత్యేకంగా ఒకరోజును కేటాయించాలని నిర్ణయించారు. ఒక కూతురు తన తల్లి కోరిక నెరవేర్చడానికి తొమ్మిదేళ్లు నిరీక్షించి 'మదర్స్ డే' ఆలోచనను అమల్లో పెట్టింది. ఆ కూతురి పేరే 'అన్నా జార్విస్' తన తల్లి మరణిచడంతో జార్విస్ మాతృదినోత్సవం కోసం విస్తృతంగా ప్రచారం చేసింది. ఇలా 1911 నాటికి అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో మాతృదినోత్సవం జరుపడం మొదలైంది. ఫలితంగా 1914నుంచి దీన్ని అధికారికంగా నిర్వహించాలని అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్‌ నిర్ణయించారు. కాలక్రమేణా ప్రపంచమంతా వ్యాపించింది. అప్పటినుంచి ఏటా మే రెండో ఆదివారం మాతృదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.





అమ్మ ప్రేమకోసం.. చిన్ని కవిత

జననం నీవే.. గమనం నీవే..

సృష్టివి నీవే.. కర్తవు నీవే..

కర్మవు నీవే.. ఈ జగమంతా నీవే..

అందుకే భగవంతుడు అన్ని చోట్లా ఉండలేక..

'అమ్మ'ను సృష్టించాడు.

అమ్మా.. నీకిదే మా వందనం.

- మాతృ దినోత్సవ శుభాకాంక్షలు



Next Story