- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంధుల కోసం.. అద్భుతమైన కిట్.!
అంధ పాఠశాలలు లేకపోతే పరిస్థితేంటి.? అని ఆలోచించి దానికొక పరిష్కారం చూపించాడు ఒక ప్రొఫెసర్

దిశ, ఫీచర్స్: దృష్టిలోపం ఉన్న పిల్లలకు చదువంటే అక్షరాలను టచ్‌చేయడమే. అదే బ్రెయిలీ. కానీ ఒక్కో అక్షరం నేర్చుకోవాలంటే టీచర్ పక్కనే కూర్చొని గంటల తరబడి నేర్పించాల్సి ఉంటుంది. మరీ.. ఒక తరగతిలో 30–40 మంది పిల్లలుంటే ఒక్క టీచరే ఎలా చూసుకుంటారు? అసలీ అంధ పాఠశాలలు లేకపోతే పరిస్థితేంటి.? అని ఆలోచించి దానికొక పరిష్కారం చూపించాడు ఒక ప్రొఫెసర్.
బ్రెయిలీ లెర్నింగ్ అసిస్టెంట్..
విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ మహమ్మద్ ఖాజా మొయినుద్దీన్ సామాజిక దృష్టి కోణం ఎక్కువ. ఏది ఆలోచించినా సామాజికంగా హెల్ప్ అయితే బాగుండు అనుకునే వ్యక్తి. బ్రెయిలీ లిపి ద్వారా పిల్లలకు చదువు నేర్పించడం వరకు ఓకేగానీ.. ఏకకాలంలో ఎక్కువ మందికి చెప్పడం కష్టం అని ప్రాక్టికల్‌గా ఆలోచించాడు. దానికొక పరిష్కార మార్గం చూపించాలనుకున్నాడు. సొల్యూషన్ దొరికితే ఇటు విద్యార్థులకూ మంచిది. అటు టీచర్లకూ ఒక్కో విద్యార్థికి గంటల సమయం కేటాయించాల్సిన అవసరం ఉండదని భావించి "బ్రెయిలీ లెర్నింగ్ అసిస్టెంట్ ఎంబెడెడ్ కిట్" (లీక్)ను రూపొందించాడు.
సెన్సార్ ద్వారా..
"లీక్" పరికరం చూస్తందుకు ఒక చిన్న 3×2 బ్రెయిలీ సెల్‌లా ఉంటుంది. దానికి ఆరు గుండ్రని గుంతలు ఉంటాయి. విద్యార్థి ఏ గుంతలో బాల్ పెట్టినా సెన్సార్లు గుర్తిస్తాయి. వెంటనే స్పీకర్‌లో ఆ అక్షరం.. సంఖ్య లేదా గుర్తు ఏంటనేది గట్టిగా చెప్తుంది. ఒకవేళ "మళ్లీ ప్రయత్నించు" అని సూచిస్తుంది. సరిగ్గా పెట్టినప్పుడు "చాలా బాగుంది" అని ప్రోత్సాహిస్తుంది కూడా. అంతేకాకుండా ఇంకో అద్భుతమైన బటన్ ఉంది. అదే "హెల్ప్ మీ" బటన్. విద్యార్థికి అర్థం కాకపోతే ఈ బటన్ నొక్కినట్లయితే టీచర్ మొబైల్‌కు అలర్ట్ వెళ్తుందన్నమాట. టీచర్ ఎవరికి సాయం కావాలో తెలుసుకునే అవకాశం ఉంది.
ఇంట్లోనే నేర్చుకునేలా..
అంధుల పాఠశాల దూరంగా ఉన్నా లేదా అక్కడికి వెళ్లడానికి సరైన రవాణా సౌకర్యం లేకపోయినా ఇక భయపడాల్సిన పనే లేదంటున్నాడు ఖాజా సార్. ఈ కిట్‌ను ఇంటికి తీసుకెళ్లి విద్యార్థులు ఎవరి సాయం లేకుండానే సొంతంగా ప్రాక్టీస్ చేయొచ్చు. తల్లిదండ్రులు పక్కన కూర్చొని స్కూల్లో చెప్పిన పద్ధతి ప్రకారం బంతులు పెట్టి చూపిస్తే సరిపోతుంది. ఈ కిట్ ద్వారా చాలా తొందరగా అంటే కొన్ని వారాల్లోనే బ్రెయిలీ బేసిక్స్ నేర్చుకోవచ్చు. లీక్ పరికరాన్ని రీఛార్జ్ చేసుకోవచ్చు. తరుచూ బ్యాటరీ మార్చాల్సిన సమస్యేం లేదు. బంతులు పడిపోయినా దూరంగా వెళ్లకుండా ఉండేలా దీనిని డిజైన్ చేశారు.
గతంలో వాకింగ్ అసిస్టెంట్..
ఖాజా సార్ గతంలో దృష్టిలోపం ఉన్నవాళ్ల కోసం "వాకింగ్ అసిస్టెంట్" అనే పరికరం తయారు చేశాడు. నడుస్తున్నప్పుడు ఎవరైనా అడ్డమొస్తే వైబ్రేషన్.. సౌండ్‌తో హెచ్చరిస్తుంది. ఆ పరికరాలను అంధ పాఠశాలలో ఇవ్వడానికి వెళ్లినప్పుడు బ్రెయిలీని నేర్పించేందుకు టీచర్లు పడుతున్న కష్టానని చూశాడు. అప్పుడే తనకొక ఐడియా వచ్చింది. అదే లీక్ పరికరం. ఈ పరికరం లేనప్పుడు పిల్లలకు నేర్పించాలంటే ఒకొక్కరికి గంట సమయం పట్టేది. పిల్లలు సిగ్గుపడి.. భయపడి మళ్లీ అడగకపోయేది. ఈ పరికరం ఉపయోగించి ఇప్పుడు వాళ్లే సొంతంగా నేర్చుకొని ధైర్యంగా కనిపిస్తున్నారు.
స్కూళ్లకు ఉచితంగా..
"లీక్ లెర్నింగ్ కిట్" పేటెంట్ కోసం దరఖాస్తు చేశారు. రీసెర్చ్ గ్రాంట్స్.. దాతల సహాయంతో ఎక్కువ కిట్‌లు తయారు చేసి అంధ పాఠశాలలకు ఉచితంగా ఇవ్వాలని ప్రొఫెసర్ ఖాజా కల. తర్వాతి వెర్షన్‌లో కంప్యూటర్ విజన్.. స్పీచ్ రికగ్నిషన్ జోడించి ఎవరు పక్కనున్నారో గుర్తించేలా మరింత స్వతంత్రంగా తిరిగేలా చేయాలనే ఆలోచన చేస్తున్నాడు ఖాజా సార్. చూశారా.. ఒక సందర్శన ఎలాంటి ఆవిష్కరణకు అవకాశం కల్పించిందో. చూడటానికి అదొక చిన్న పరికరం మాత్రమే. కానీ లక్షలాది మంది దృష్టి లోపమున్న పిల్లల జీవితాల్లో కొత్త వెలుగులు నింపే సత్తా దానికుంది.
Read More..
చైల్డ్ ఇన్‌ఫ్లూయెన్సర్ల కోసం.. చట్టాన్ని తీసుకొచ్చిన శ్రేయ నల్లమోతు.!






