Millets Festival బండెనక బండి కట్టి.. 16 బండ్లు కట్టీ..!

by Daayi Srishailam |

A festival to preserve the best varieties..

Millets Festival బండెనక బండి కట్టి.. 16 బండ్లు కట్టీ..!
X

జాతరంటే..

ఇది సమ్మక్క సారక్క జాతర కాదు.

నాగజాతి నాగోబా జాతర కూడా కాదు.

ఇది విత్తనాల జాతర.

అలనాటి పాత పంటలను అక్కున చేర్చుకునే వేడుక.

మేలైన వంగడాల మేలిమి విత్తనాలను కాపాడుకునే కన్నుల పండుగ.

ఊరూవాడ ఒక్కటయ్యి..

ఎడ్లబండ్లు కట్టుకొని గళ్లుగళ్లు గజ్జెల సప్పుడుతో కదలివచ్చే అక్కాచెల్లెండ్ల సిరిధాన్యాల జాతర.!

తిండి తింటే కండ కలదోయ్.. కండ కలవాడేను మనిషోయ్. కానీ.. ఏ తిండీ.? ఇప్పటి విషపు కూడు తింటే కండ కాదు.. బండలా తయారవుతాం. అలా కావద్దంటే మన పూర్వీకులు తిన్న తిండి తినాలి. సాధ్యమవుతుందా.? సాగుబడిని మార్చుకుంటే సాధ్యమవుతుంది. అదెలాగో తెలుసుకోవాలంటే.. ఛలో.. సిరిధాన్యాల అక్కాచెల్లెండ్ల పాత పంటల జాతరకు పోయొద్దాం.!

పాత పంటల జాతర

పొట్ట.. బట్టకు మిగిలినా చాలనుకునేవాళ్లు ఒకప్పుడు. ఇప్పటి దిగుబడి కూడా అదే అనుకోండీ. కాకపోతే ఇప్పుడు పొట్ట అంటే స్థూలకాయం. బట్ట అంటే బట్టతల. నవ్వకండి బాస్. నడుస్తున్నది ఇదే కదా.? మన ముందు తరాలవాళ్లు ఎలా ఉండేవాళ్లు.? వాళ్లు తిన్న తిండి అలాంటిది. మన దరిద్రం.. మనమేమో చెత్త తింటున్నాం. రైతులేమో దిగుబడి ఎంత.? గిట్టుబాటు ఎంత అనే ఆలోచిస్తున్నారు కానీ.. పండిస్తున్న పంట వల్ల జనరేషన్ జీవనశైలి ఎలా మారిపోతోందని ఆలోచించడం లేదు. అడ్డమైన చెత్త తినొద్దనే మనకోసం 25 ఏండ్లుగా డెక్కన్ డెవలప్‌‌‌మెంట్ సొసైటీ పాత పంటల జాతరను సాగిస్తోంది. అందరికీ పౌష్టికాహారం అందించాలనేది జాతర లక్ష్యం. చిరుధాన్యాలు, సేంద్రియసాగు, ఆకుకూరలపై ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారు. అందంగా అలంకరించిన ఎడ్లబండ్లపై ఊరేగింపుగా డప్పు చప్పుళ్లు, కోలాటాల ప్రదర్శనతో ఊరూరికీ తిరుగుతుంటారు. మట్టి కుండల్లో చిరుధాన్యాలు పెట్టి ప్రజల ముందు ప్రదర్శిస్తారు.

జాతర ఎక్కడ.?

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పస్తాపూర్‌‌‌లోని డెక్కన్ డెవలప్‌‌‌మెంట్ సొసైటీ (డీడీఎస్) మహిళా రైతుల జాతర ఇది. జాతర ప్రారంభమై 25 ఏళ్లయిన సందర్భంగా ఈసారి మరింత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. చిన్న కమతాల ద్వారా సాగు చేయాలని, జీవ వైవిధ్యాన్ని కాపాడాలని, చిరుధాన్యాల సాగును మెరుగుపరిచి భావి తరాలకు మంచి ఆయురారోగ్యాలను ఇవ్వాలని, భూసారాన్ని కాపాడాలని జాతర ద్వారా ప్రచారం చేస్తున్నారు. జనవరి 14న, న్యాలకల్ మండలం వడ్డి గ్రామంలో జాతర ప్రారంభమైంది. ప్రతీ రోజు ఒక గ్రామంలో జాతర సాగుతుంది. ఫిబ్రవరి 11న ఝరాసంఘం మండలం మాచునూరు డీడీఎస్ పచ్చశాలలో ఈ జాతర ముగుస్తుంది. దాదాపు నెల రోజులపాటు సాగే సాగు సంబరమిది.

ఎందుకు.?

ప్రతీ పంట రసాయనాలు చల్లి సాగు చేస్తున్నారు నేటి రైతులు. వీటివల్ల ఏమవుతుంది.? వ్యవసాయ పరంగా ముందు నేలలో సారం తగ్గిపోతుంది. మనవాళ్లు ఏకరీతి పంటలే వేస్తారు కాబట్టీ దిగుబడి తగ్గుతుంది. ఇక ప్రజల పరంగా మనం ఆ రసాయనిక ప్రేరేపిత ఆహారాన్ని తీసుకోవడం వల్ల చిన్న అనారోగ్యాలు దాపురిస్తున్నాయి. చూస్తున్నాం కదా.? ఆరో తరగతి చదివే పిల్లలకు కూడా హార్ట్ ఎటాక్‌లు వస్తున్నాయి. పదేళ్ల పిల్లల్లో కూడా షుగర్ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇదిలాగే కొనసాగితే రాబోయేదంతా బలహీన తరమే. శారీరకంగానే కాదూ.. మానసికంగానూ వీక్‌‌‌గా ఉండే ప్రమాదముంది. అందుకే పంటల సాగు విధానం మారితే ఆటోమేటిగ్గా ఆహారపు అలవాట్లు మారి, జీవనశైలి మారుతుందని మహిళా రైతులు ఈ విత్తనాల జాతరను ప్రచారం చేస్తున్నారు.

సాగు మీది.. సంతోషం ప్రజలది

రసాయన ఎరువులతో ముప్పుందని అందరికీ తెలుసు. అందుకే సేంద్రీయ పద్ధతిలో రాగులు.. జొన్నలు.. సామలు.. అవిసెలు.. కొర్రలు.. సజ్జలు.. తైదలు.. బొబ్బర్లు.. కందులు.. ఉలవలు వంటి 40-50 రకాల చిరుధాన్యాలను పండిస్తున్నారు డీడీఎస్ మహిళా రైతులు. పంట చేతికి రాగానే అమ్మేసి సొమ్ము చేసుకోవడం కాకుండా.. వాటిలోని మేలైన ధాన్యాన్ని విత్తనం కోసం సేకరించి భద్రపరచుకోవాలంటున్నారు. సేంద్రీయ పద్ధతిలో నాణ్యమైన చిరుధాన్యాలను మీరు సాగుచేయండీ.. ప్రజలు సంతోషంగా ఉంటారని సిరిధాన్యాల జాతర ద్వారా పిలుపునిస్తున్నారు. సాగులో లేని సుమారు 100 రకాల ఆకు కూరలు, 80 రకాల చిరుధాన్యాల గురించి ప్రజలతో పిచ్చాపాటీగా చర్చిస్తారు. మారుతున్న ఆహారపు అలవాట్లతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వివరించి, చిరుధాన్యాల సాగులో శిక్షణ కూడా ఇస్తున్నారు.

50 గ్రామాల రైతులు

సంక్రాంతి పండగ బిజీలో అందరూ ఉంటే జహీరాబాద్ చుట్టుపక్కల 50 గ్రామాల ప్రజలు పాత పంటల జాతర బిజీలో ఉంటారు. పండగకు వాళ్లిండ్లలో వండే ఘుమఘుల గురించి కాకుండా రేపటితరం ఎలాంటి ఆకు కూరలు తినాలో వీడియోలు ప్రదర్శించి సూచన చేస్తున్నారు. తెల్ల గవ్వల కూర, ఉత్తరేణి, తాలేల్ల ఆకుకూర, సన్నపాయల కూర, ఎలక చెవిన కూర, జొన్న చెంచలి, పొనగంటి కూర, బంకొంటి కూర వంటి పోషక విలువలు మెండుగా ఉన్న ఆకు కూరల విత్తనాలను ఎలా సేకరించాలి.? ఎలా భద్రపరచుకోవాలి? సాగు ఎలా వంటి విషయాల్లో పూర్తి సమాచారం ఇస్తూ 25 ఏండ్ల నుంచి ఈ జాతరను కొనసాగిస్తున్నారు. ఈ జాతరకు దేశ విదేశాల నుంచి వ్యవసాయ, ఆహార నిపుణులు, శాస్త్రవేత్తలు, ఔత్సాహిక రైతులు వస్తుంటారు. మహిళలచే నడపబడుతున్న లోకల్ రేడియో ద్వారా వ్యవసాయ సంబంధిత సమాచారం అందిస్తున్నారు.

అవే కాపాడతాయి: ఎ. గిరిధర్ బాబు, డీడీఎస్ జాయింట్ డైరెక్టర్

చిరుధాన్యాలు, ఆకుకూరలే ఇటు రైతును కాపాడతాయి. అటు ప్రజల ఆరోగ్యాలను రక్షిస్తాయి. గత 25 ఏండ్లుగా పాత పంటల జాతర ద్వారా ఇదే చెప్తున్నాం. ఈ 25 ఏండ్లలో రైతుల్లో చాలా మార్పు వచ్చింది. మా సంఘంలో ఉన్నదంతా మహిళా రైతులే. వ్యవసాయం కష్టం అనుకునేవాళ్లు ఒకసారి మా సొసైటీ మహిళల్ని చూస్తే తెలుస్తుంది.. వ్యవసాయం ఎంత లాభసాటో. చిరుధాన్యాలు, ఆకుకూరలే రైతును బతికిస్తాయి.

సాగు సమాచారం: జనరల్ నర్సమ్మ, డీడీఎస్ సభ్యురాలు

గత 30 ఏండ్లుగా నేను సొసైటీలో ఉన్నాను. ఒకవైపు వ్యవసాయం చేస్తూనే ఇంకో వైపు సాగుపట్ల రేడియో ద్వారా అవగాహన కల్పిస్తున్నా. పెద్దగా చదువుకోని ఒక మహిళ రేడియో జాకీ అంటే అందరూ ఆశ్చర్యపోతారు ఎవరైనా. అయితే మేం కూడా అప్‌‌‌డేట్ అవ్వాలి అనుకుంటున్నాం. రేడియోతో పాటు యూట్యూబ్ చానెల్ ద్వారా సాగు సమాచారం అందించేందుకు ప్రిపేరయ్యాం. చిరుధాన్యాలు సిరులు పండిస్తాయనేది వాస్తవం.

Next Story