మెట్రో రెండో దశ పనుల్లో సర్కార్ కీలక నిర్ణయం

by Sujitha Rachapalli |

హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టుపై సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్‌లను పంపించింది.

మెట్రో రెండో దశ పనుల్లో సర్కార్ కీలక నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టుపై సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్‌లను పంపించిన రాష్ట్ర ప్రభుత్వం.. ప్రతిపాదిత మార్గాల్లో భూసేకరణపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.2,787 కోట్లు కేటాయిస్తున్నట్టు రాష్ట్ర కేబినెట్ నిర్ణయించిన విషయం తెలిసిందే.

రూ.24,269 కోట్లతో డీపీఆర్

హైదరాబాద్ మెట్రోరైలు రెండో దశ (ఏ, బీ)కు సంబంధించిన డీపీఆర్‌లను కేంద్రానికి పంపించారు. రూ.24,269 కోట్లతో రెండో దశ(ఏ) ప్రాజెక్టును చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని విస్తరణకు సంబంధించి నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు(36.8 కి.మీ.), రాయ‌దుర్గం - కోకాపేట నియోపొలిస్(11.6 కి.మీ.), ఎంజీబీఎస్‌-చాంద్రాయ‌ణ‌గుట్ట (7.5 కి.మీ.), మియాపూర్‌-ప‌టాన్‌చెరు(13.4 కి.మీ.), ఎల్‌బీ న‌గ‌ర్‌-హ‌య‌త్ న‌గ‌ర్ (7.1 కి.మీ.) మొత్తం 76.4 కిలోమీటర్ల విస్తరణకు సంబంధించిన డీపీఆర్‌ను రాష్ట్రం కేంద్రానికి పంపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం నిధులు భరించేలా జాయింట్ వెంచ‌ర్‌గా ఈ ప్రాజెక్టు చేపట్టేలా ప్రతిపాదనలు తయారు చేసిన విషయం తెలిసిందే.

రూ.19,579 కోట్లతో..

హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 (బి) ప్రతిపాదనతో పాటు అవసరమైన అన్ని పత్రాలు, డీపీఆర్‌లను సైతం కేంద్ర ప్రభుత్వానికి పంపించిన విషయం తెలిసిందే. రెండోదశ(బి)ప్రాజెక్టులో 3 కారిడార్లు ఉన్నాయి. ఆర్‌జీఐఏ నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ (39.6 కి.మీ, రూ.7,168 కోట్లు), జేబీఎస్ నుంచి మేడ్చల్(24.5 కి.మీ, రూ. 6,946 కోట్లు), జేబీఎస్ నుంచి శామీర్‌పేట (22 కి.మీ, రూ. 5,465 కోట్లు) మొత్తం 86.1 కి.మీ పొడవును కవర్ చేసే ఈ ఫేజ్ 2 (బి) ప్రాజెక్టుకు మొత్తం రూ.19,579 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ ఫేజ్ 2 (బి) ప్రాజెక్టును కూడా కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాయింట్ వెంచర్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.

కి.మీ.కు రూ. 318 కోట్ల అంచనా వ్యయం..

రెండో దశ మెట్రో విస్తరణలో కిలో మీటరుకు నిర్మాణ అంచనా వ్యయం రూ. 318 కోట్లుగా ఉంది. పరిస్థితుల ప్రకారం ఇందులో కొంత హెచ్చుతగ్గులు ఉంటాయని డీపీఆర్‌లో పేర్కొన్నట్టు అధికారులు చెబుతున్నారు. బెంగళూరులో కి.మీకి రూ.373 కోట్ల నుంచి రూ.569 కోట్ల వరకు.. చెన్నైలో రూ.619 కోట్ల నుంచి రూ.756 కోట్ల వరకు.. ముంబైలో రూ.543 కోట్ల నుంచి రూ.1,492 కోట్లతో పనులు చేపట్టారని సమాచారం. కాగా ఎలివేటెడ్‌ మెట్రో, డిజైన్‌, ఇన్నోవేషన్‌తో హైదరాబాద్‌లో తక్కువ ఖర్చుతో మెట్రో రెండో దశ పనులు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

భూసేకరణ..

హైదరాబాద్ మెట్రో రైలు రెండో ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌లకు భూసేకరణపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. కేంద్రం నుంచి అనుమతులతోపాటు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వచ్చే‌లోపు భూసేకరణ పూర్తి చేయాలని నిర్ణయించింది. అందుకోసమే రూ. 2,787 కోట్లు కేటాయించింది. మార్చి-ఏప్రిల్ మాసాల్లో ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోనున్నట్టు అధికారులు చెబుతున్నారు.

Next Story