- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, ఫీచర్స్: మనదంతా ఎద్దులతో సాగిన బతుకు. ఇప్పడంటే అంతా మారిపోయిందిగానీ.. ఒకప్పుడు ఎద్దుతోనే గౌరవం ఉండేది. వ్యవసాయానికి ఎద్దులే జీవనాడి. ఎక్కవాయెనో ఆ ఎద్దుల గంట శబ్దం, పేర్లు పెట్టి పిలిచే రైతు స్వరం, పొలాల్లో లయబద్దంగా నడుస్తుంటే వినిపించే అడుగుల చప్పుడు. ఇవన్నీ ప్రకృతితో మమేకమైన జీవన శైలిని ప్రతిబింబించేవి. ఎద్దు కేవలం వ్యవసాయ సహాయకారిగానే కాదు.. అది గ్రామ జీవనం గుండె చప్పుడు.
ఎద్దు మురిపెం
ఊకెనీ అనేదా.. "ఎద్దుకొద్ది సేద్యం.. సద్ది కొద్దీ పయనం" అనీ. ఆ రైతుకున్న ఎద్దులు ఎంత బలమైనవి, ఎంత కష్టం చేస్తాయనేది చూసేవాళ్లు. రైతుగూడ వాటిని సొంత పిల్లల్లా చూసుకునేవాడు. కష్టం చేయకపోతే కాస్త కోపగించుకునేవాడుగానీ, తర్వాత చాలా బాధపడేవాడు. కొందరైతే దినాం స్నానం చేపిస్తుండె. కొమ్ములకు రంగులేసేవాళ్లు. గంటలు కట్టేవాళ్లు. పచ్చటి గడ్డి, గోధుమ పొట్టు, శుభ్రమైన నీరు ఇచ్చి వాటి సంరక్షణలో రైతు ఎక్కువ శ్రద్ధ తీసుకునేవాళ్లు. "హే రాజా" అని పిలిస్తే ఎద్దెంతో మురిసిపోయేది. ఈ బంధం గ్రామీణ సంస్కృతిలో సహజీవనం, పరస్పర గౌరవాన్ని చాటేది.
రైతును బాధపెట్టకుండా..
"ఎద్దున్నోడి ఎవుసం సూడు.. మంది ఉన్నోడి మార్బలం సూడు" అని అనేది పెద్దొళ్లు. అంటే.. ఎద్దు రైతుకెంత హిమ్మత్ ఇచ్చేదో అర్థం చేసుకోవచ్చు. పొలాల్లో నాగలి కట్టి దున్నడం ఒక కళాత్మక దృశ్యం. రైతు నాగలిని గట్టిగా పట్టుకొని, ఎద్దులను నడిపిస్తూ వెళ్తున్న దృశ్యం ఒక గుర్తుగా మిగిలిపోయాయి. పొలంలో ఎద్దులు దున్ని దున్ని అలసిపోయినప్పటికీ యజమానిని బాధపెట్టొద్దని అరకలో నడిచేవి. నాగలితో మట్టిని చీలుస్తూ దున్నుతుంటే రైతు "ఎయ్ హడీ" అనే చప్పుడుకు, ఎద్దుల గంటల చప్పుడు, సయ్‌మని నాగలి చప్పుడుకు పక్షుల చప్పుడు తోడై అదొక అందమైన సంగీత రాగంలా అనిపించేది.
ఎద్దుల పోటీలు
ఎద్దులు కేవలం వ్యవసాయ సాధనాలుగా మాత్రమే కాదు. గ్రామీణ సంస్కృతిలో ఒక గౌరవ స్థానాన్ని ఆకర్షించాయి. పండుగల సమయంలో ఎద్దుల బండ్లను పూలమాలలతో, రంగు రంగు గుడ్డలతో అలంకరించి ఊరేగింపుల్లో పాల్గొనేవారు రైతులు. ఈ పోటీలు యువకుల్లో ఉత్సాహాన్ని నింపేవి. ఎద్దుల బలం, వేగం, రైతు నైపుణ్యం ప్రదర్శించబడేవి. గ్రామస్తులంతా ఒకచోట చే నవ్వులు, ఆనందం, ఆటపాటలతో సంబరాలు జరిపేవారు. వయసు పైబడి పనికి వెనకడుగు వేసిన ఎద్దును అంగట్లో అమ్మేటప్పుడు చూడాలె. రైతు కండ్ల నుంచి నీళ్లు దుంకేవి. అలా ఎద్దులను ఇంటి మనుషుల్లా చూసుకునేది రైతు.
ఎడ్లెక్కడవాయె.?
కాలం మారింది. టెక్నాలజీ రాకతో వ్యవసాయంలో యంత్రాలు, ట్రాక్టర్లు వచ్చాయి. సమయం ఆదా, ఖర్చు తగ్గడం, సౌలభ్యం వంటి కారణాలతో ఎద్దులతో వ్యవసాయం క్రమంగా తగ్గిపోయింది. ట్రాక్టర్ ఇంజిన్ శబ్దం ఎద్దుల గంటల శబ్దాన్ని ఆక్రమించింది. రైతు మనసు యంత్రాల వైపు మళ్లింది, ఎద్దుల మీద ప్రేమ క్రమంగా క్షీణించింది. ఒకప్పుడు గ్రామంలోని ప్రతి పొలంలో కనిపించిన ఎద్దులు, ఇప్పుడు చాలా చోట్ల కనుమరుగయ్యాయి. "ఎద్దును ముద్దుపెట్టబోతే.. ఎడమకాలితో తన్నినట్ల"యింది పరిస్థితి. ఆ రోజులను గుర్తుచేసుకుంటే మనసు ఆనందంతో, కొంత ఆవేదనతో నిండిపోతుంది.






