- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంగళ ఆజీ.. ఆటో అమ్మమ్మ.!
65 ఏళ్ల వయసులోనూ అద్భుతంగా ఆటో నడుపుతోంది మహారాష్ట్రకు చెందిన మంగళ ఆవలే

దిశ, ఫీచర్స్: ఆడవాళ్లు ఈ మధ్య కార్లు.. బైకులు నడుపుతున్నారుగానీ.. ఒకప్పుడు ఆ అవకాశమెక్కడిది.? ఎన్నో ఆంక్షలు.. అడ్డంకులు ఉండేవి డ్రైవింగ్ చేయడానికి. అలాంటి పరిస్థితులను ఏనాడో అడ్డుకొని డ్రైవింగ్ లో అడుగుపెట్టి ఇప్పుడు 65 ఏళ్ల వయసులోనూ అద్భుతంగా ఆటో నడుపుతోంది మహారాష్ట్రకు చెందిన మంగళ ఆవలే.
ఆంక్షలు లేకుండా..
మంగళ ఆవలే కష్టాలను ఈదుకొని బయటకొచ్చిన ధైర్యవంతురాలు. అందరూ తనను మంగళ ఆజీ అంటారు. భర్త చనిపోయి.. నలుగురు పిల్లల బాధ్యత మోసిన ఆమె.. వాళ్లందర్నీ జీవితంలో సెట్ చేసింది. వాళ్లకు మంచి చదువులు చెప్పించింది. పెండ్లిళ్లు చేసి ఇండ్లు కూడా కట్టించింది. ఇవన్నీ మంగళ ఆజీ కూలినాలి పనిచేస్తూ చక్కదిద్దింది. ఇప్పటికీ తన అవసరాలకూ.. పిల్లల కుటుంబాలకు ఆసరగా నిలిచేందుకు రోడ్డుపై ధైర్యంగా ఆటో నడుపుతోంది. డ్రైవింగ్ చేయడానికి వయసు.. ఆడవాళ్లు అనే ఆంక్షలు ఆమెకు అడ్డురావని నిరూపిస్తోంది.
ఎవరి మీదా ఆధారపడొద్దని..
మంగళ ఆజీతో పాటుగా పెండ్లిళ్లు అయినవాళ్లు.. తన వయసు గలవారు చాలామంది వృద్ధాప్య.. వితంతు పింఛన్ మీద ఆధారపడి బతుకుతున్నారు. వాళ్లంతా గడపదాటి బయటకు రాకుండా ఇంటికే పరిమితమై ఉంటారు. కానీ మంగళ ఆజీ మాత్రం ధైర్యం రోడ్డు మీదకు ఆటో తీసుకొని వస్తుంది. నిజంగా తనది తల్లిగా ఒంటరి తల్లిగా పోరాటం. పిల్లల్ని.. కుటుంబాన్ని నిలబెట్టిన యోధురాలు అని చెప్పొచ్చు. ఇప్పుడామె కొడుకు కూడా ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మంగళ ఆజీకి షుగర్ వంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పటికీ తాను ఎవరి మీదా ఆధారపడి బతకొద్దు అనుకొని ఆటో నడుపుతోంది.
15 రోజుల్లోనే నేర్చుకుంది..
ఆటో నడపడం తనకు మొదట్నుంచీ అలవాటు లేదు. అయితే బాధ్యతలన్నీ తీరాక రోజు ఇంట్లో కూర్చొని అమ్మలక్కలతో ముచ్చట్లు పెట్టడం తనకు ఇష్టం లేదు. ఇంకోరకంగా అదొక బోరింగ్ లైఫ్ అనుకుంది. అందుకే కొడుకు సాయంతో కేవలం 15 రోజుల్లోనే ఆటో నడపడం నేర్చుకుంది. ప్రతీరోజు ఇప్పుడు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కరడ్.. ఉండాలే మధ్య ప్యాసింజర్ ఆటో నడిపిస్తోంది. రోజుకి ఎంతలేదన్నా 500 నుంచి 700 రూపాయలు సంపాదిస్తోంది. మంగళ ఆజీని చూసినవాళ్లు ఆశ్చర్యపోతారు. అంతకంటే ముఖ్యంగా గౌరవంగా చూస్తారు.
అదే సంతోషం.. సంతృప్తి..
65 ఏళ్ల వయసులో ఆటో నడుపుతూ ఇతర డ్రైవర్లకు.. యువతకు ఆదర్శంగా నిలుస్తోంది ఆజీ. ఈ వయసులో నీకెందుకవ్వా ఇదంతా అని ఎవరైనా అడిగితే.. "డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం నాకు. ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఏమొస్తుంద. ఆటో నడిపితే పిల్లల కుటుంబాలకు ఆసరా అవ్వొచ్చు.. ఇంకా నా సూదిమందుల ఖర్చులకు పైసలు ఉంటాయి. ఇదే నాకు సంతోషం.. సంతృప్తి" అని అంటోంది. వయసు పెరిగిందని.. ఆడవాళ్లమని ఇంటికే పరిమితమవ్వొద్దు. ధైర్యంగా బయటకు అడుగేస్తే జీవితం మరింత అందంగా మారుతుందని మంగళ ఆజీ నిరూపిస్తోంది.






