- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేనెంత ఎదవనో నాకే తెలియదు.. నో పార్కింగ్ ఏరియాలో పార్కింగ్ చేస్తా.!
సందు దొరికిందా.. స్టాండేసి అవతలవడ్డమా అనేదే ముఖ్యం.!!

కుక్కకో బుద్ధి ఉంటది.
ఏందంటే..
అటూ ఇటూ జూశి..
అమాంతం కాలు లేపి గోడకు మూత్రం కొడ్తది.
జనాల "పార్కింగ్ సెన్స్" చూస్తే ఇదే గుర్తుకొస్తది.
ఖాళీజాగ కనిపిస్తే అటు ఇటూ జూశి "పార్కింగ్" చేసేస్తరు.
అసలది పార్కింగ్ ప్లేసేనా.?
ఎవరికైనా ఇబ్బందైతదా.?
ఇవన్నేం యాదికి రావు.
ఒకరకంగా అసలా సోయే ఉండదు.
అప్పటిమటుకు సందు దొరికిందా..
స్టాండేసి అవతలవడ్డమా అనేదే ముఖ్యం.!!
- దాయి శ్రీశైలం
ఇండియన్స్‌కి ఉన్న అతి చెడ్డ అలవాట్లో ఒకటి "నో పార్కింగ్ ఏరియాలో" పార్కింగ్ చేయడం. చెప్పడానికి.. వినడానికి ఇది చాలా చిన్న సమస్యగానే అనిపిస్తుండొచ్చు. కానీ రూల్స్ పరంగా.. బిహేవియర్ పరంగా ఇదొక పెద్ద నేరం. క్షమించరాని తప్పు. వ్యవస్థలో మనుషుల మధ్య సక్రమంగా నడుచుకోవాలంటే మినిమం కామన్‌సెన్స్ ఉండాలి. ఈ లెక్కన "పార్కింగ్ సెన్స్" లేనివాళ్లకు ఈ "కామన్ సెన్స్" లేనట్టే.
ఎవడబ్బ జాగీరు.?
మార్కెట్‌కి వెళ్తాం. మనమొక్కరమే కాదు.. మనలాంటివాళ్లు చాలామంది వస్తారక్కడికి. మనిషి సెన్స్‌ను ముందే పసిగట్టి "నో పార్కింగ్" అని రాసి పెద్ద బోర్డే పెడతారక్కడ. అందరూ దాన్ని చదవతారు. కానీ ఏ ఒక్కడూ దాన్ని పట్టించుకోడు. పైగా.. "మార్కెట్‌కొచ్చినప్పుడు ఇక్కడ పార్కింగ్ చేయకపోతే ఇంకెక్కడ చెయ్యా్ల్నంటా" అనే వెటకారాలు. అందరం మనుషులమే కదా. నువ్వు ఆలోచించినట్టూ ఇంకోడు కూడా ఆలోచిస్తడు. అందరూ "నో పార్కింగ్" లోనే పార్క్ చేస్తరు. అప్పటి గురించే ఆలోచిస్తరు. "బైటికి తీసేటప్పుడు ఎట్లా" సోయి ఉండదు కదా.? ఇగ అప్పుడు ఫైటింగ్ షురూ చేస్తారు. "నా కారుకు గీర్కపోయింది" అని ఒకడు.. "నా బండి అద్దం పలిగిపోయింది" అని ఒకడు. "ఇదేమన్న నీ అయ్య జాగీరా" అని ఇంకొకడు పెంట పెంట చేస్కుంటరు.
ఆత్రం నీ ఒక్కడికేనా.?
అందరూ పిల్లల్ని స్కూల్‌కి పంపించడానికే వెళ్తారు. అందరికీ మనకున్న ఆత్రమే ఉంటది. ఒకరికి డ్యూటీ టైమైతది. ఇంకొకరికి ఆఫీస్ తీసే టైమైతది. కొందరికి కస్టమరొచ్చే టైమతది. ఇట్లా ఎవరికుండే పని వాళ్లకుంటది. మనకు ఇవేవీ పట్టింపుండదు. స్కూల్ కాడ పిల్లల్ని దించి.. లోపలికి పంపించాలనే ఆత్రంలో ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తే అక్కడ పార్కింగ్ చేస్తాం. ఏముందీ.. స్కూల్ టైం అందరికీ అదే కదా. మనలెక్క ఇంకో ఐదారుగురు వెంట వెంటనే వచ్చేసి మనం పార్క్ చేసినట్లే అడ్డదిడ్డంగా పార్కింగ్ చేస్తారు. ముందు తప్పు చేసిందెవరు.? అదేదీ చూసుకోకుండా ఎక్కడలేని కోపంతో వచ్చి వాళ్లపై వీళ్లపై కోపమై ఎగిరి దుంకుతారు. ఏవేవో రూల్స్ మాట్లాడతారు. ఈ రూల్సేవో ముందు మనం బండి పార్క్ చేసినప్పుడు గుర్తుంచుకుంటే ఈ లొల్లే ఉండదు కదా.?
మీ బాధ్యత కాదా.?
ఒక్క స్కూల్ దగ్గరనే కాదు. రోడ్డు మలుపుల దగ్గర.. కూడళ్ల దగ్గర.. జంక్షన్ల దగ్గర.. హాస్పిటల్స్.. పోలీస్ స్టేసన్స్ దగ్గర.. సైడ్ వాక్‌ల దగ్గర.. బస్టాపులు.. రైల్వే స్టాపులు.. మెట్రో స్టేషన్ల దగ్గర.. గవర్నమెంట్ ఆఫీసుల దగ్గర అడుగడుగునా "నో పార్కింగ్" బోర్డులు పెడతారు. కావాలనీ మనొళ్లు ఎక్కడైతే "నో పార్కింగ్" ఉంటుందో అక్కడే పార్క్ చేసేస్తారు. యూ టర్న్ తీసుకునేవాళ్లెట్ల తీసుకోవాలి.? హాస్పిటల్స్‌కి అత్యవసర సేవల కోసం వచ్చేవాళ్లు ఎట్లా రావాలి.? పోలీస్ స్టేషన్లకు వచ్చేవాళ్ల పరిస్థితేంది.? ఆంబులెన్సులు ఎట్ల రావాలి.? ఫైర్ ఇంజన్లు ఎట్ల రావాలి.? పాదచారులు రోడ్డెట్లా దాటాలి.? వాళ్లు సేఫ్‌గా ఇంటికెట్లా వెళ్లాలి.? ప్రయాణికులు బస్సులు.. రైళ్లెట్లా ఎక్కాలి.? పబ్లిక్ సర్వెంట్లు టైమ్‌కి ఆఫీసుకెట్లా చేరుకోవాలి.? వీటన్నింటికీ బాధ్యతెవరిది.?
అన్నింటికీ కారేనా.?
"పార్కింగ్ సిస్టమ్"నంతా పాడుచేస్తున్నవాటిలో ఎక్కువ కార్లే. మనొళ్లకు "తాకత్" చూపించుకునే సోకొకటి ఉంది కదా.? "కొత్తిమీర కట్ట" కావాలన్నా.. "అల్లమెల్లిగడ్డ" తీస్కరావాలన్నా.. ఆఖర్కి టైంపాస్ కోసం ఛాయ్ తాగడానికైనా.. టిఫిన్ కోసం అయినా.. టాబ్లెట్ కొనేందుకు అయినా కారేస్కొనే వస్తారు. అందులో ఒక్కడే వస్తాడు. ఒక్కడే కాబట్టీ ఏ బైకో ఏస్కొనొస్తే ఐపోతది. కానీ అట్ల రారు మనొళ్లు. ముందే రద్దీ ప్రదేశాలు. ఇరుకిరుకు గల్లీలు. మొత్తం "నో పార్కింగ్ బోర్డ్‌లే". ఇప్పుడా కారు పెట్టడానికి ఏ సందో బొందో చూసుకోవాలి. సరే.. వెంటనే రిటర్న్ ఐతడా అంటే.. అదీ ఉండదు. ఇట్లా వచ్చినొళ్ల కార్లన్నీ ఒక్కతాన జామ్ అయి వచ్చెటొళ్లకు పొయ్యెటొళ్లకు తలకాయనొప్పి అవుతాయి. అట్లుంటది మనొళ్లతోని ముచ్చట.!
మారాల్సింది ఎవరు.?
"నో పార్కింగ్" పంచాయతీల్లో షాపుల వాళ్ల పాత్రకూడా ఉంది. కోట్ల రూపాయలు ఖర్చుచేసి "మాల్స్".. "సూపర్ మార్కెట్".. "క్లాత్ షోరూమ్"లు పెడతారు. కానీ.. పట్టుమని పది వెహికిల్స్ పార్కింగ్ చేసే జాగా ఉండదు. ఇప్పుడు షాపింగ్‌కు వచ్చినవాళ్ల బైక్స్.. కార్స్ ఎక్కడ పెట్టాలి.? సెల్లార్‌లోనో.. షాప్ ముందో పెట్టుకుందామా అంటే.. "స్టాఫ్ ఓన్లీ".. "ఓనర్ వెహికిల్ ఓన్లీ" అని బోర్డు రాసి పెడతారు. స్టాఫ్ కోసమే.. ఓనర్ కోసమే పార్కింగ్ ఏరియా ఇస్తే.. ఇక ఆ సరుకులు కూడా మీరో కొనుక్కోండి మరి. కస్టమర్లెందుకు.. వాళ్లిచ్చే కలెక్షన్ ఎందుకు.? కొత్త కొత్త ఐటమ్స్ ఎరేసి.. యాడ్స్ ఇచ్చి కస్టమర్లను ఆకర్షించాలి అనుకున్నప్పుడు వారి వాహనాలకు పార్కింగ్ ఫెసిలిటీ కల్పించే బాధ్యత కూడా నువ్వే తీసుకోవాలి కదా బాస్.?
ఫైనేసినా ఫలితం శూన్యం
ఒకసారి హైదరాబాద్ సిటీలో రోడ్లపై గమనించండి. "ఇప్పుడే వస్తాం" కదా అనీ.. రోడ్డు పక్కనే కార్లు.. బైక్‌లు పార్కింగ్ చేసి వెళతారు. వాళ్లొచ్చే లోపు కారుండదు.. బైకుండదు. ట్రాఫిక్ పోలీసులు సిటీలో అడుగడుగునా "టోయింగ్" వెహికిల్‌తో గస్తీ చేస్తుంటారు. ఎక్కడ నో పార్కింగ్ ఏరియాలో వెహికిల్ కనిపిస్తే దాన్ని టోయింగ్ చేసి.. సీజ్ కూడా చేస్తుంటారు. మెట్రో స్టేషన్ లాంటి ఏరియాలో "అనాథరైజ్డ్ పార్కింగ్ ఏరియా"లో నిలిపి ఉన్న వెహికిల్స్‌ని ఫొటో తీసి.. ఫైన్ వేస్తుంటారు. అదేందోగానీ "టోయింగ్" చేసి సీజ్ చేసినా.. "ఫైన్" వేసినా మళ్లీ అట్లనే పార్కింగ్ చేస్తుంటారు. "వేలకు వేలు జరిమానా అయినా చెల్లిస్తాం కానీ.. మేమైతే మారం" అనే ధోరణి జనాల్లో కనిపిస్తోంది.
మమ్మల్నెవ్వడు ఆపేది.?
బాధ్యతగా ఉండాల్సినోడు "రూల్స్ బ్రేక్" చేసినా నడుస్తది అనుకున్నప్పుడు.. "హోదా" ఉన్నోడికి ఏ రూల్స్ ఉండవనే గర్వం ఉన్నప్పుడు ఈ "పార్కింగ్".. "నో పార్కింగ్" విషయాలల్లో మార్పు రాదు. ఒకాయన పెద్ద పోలీసాఫీసరై ఉంటాడు. ఆయనే కామన్ పబ్లిక్‌కు "పార్కింగ్ సెన్స్" గురించి చెప్పా్ల్సి ఉంటుంది. కానీ.. మనొళ్లు అది చేయరు. "నేను పోలీస్"ను కదా నాకేం రూల్సుండవు అనే హోదా గర్వంతో ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేస్తే చూసేవాడు ఊకుంటడా.? వాడూ అదే ధోరణి అవలంబిస్తడు కదా.? అట్లనే జర్నలిస్ట్ అయినా.. లాయర్ అయినా.. ముఖ్యంగా లీడర్ అయినా.. "మమ్మెల్నెవ్వడ్రా ఆపేది" అనుకొని రూల్స్ బ్రేక్ చేస్తే దానిని ఫాలో అవడానికి పదిమంది రెడీగా ఉంటారనేది గ్రహిస్తే మంచిది.
ఏమవుతుంది.?
😳 నో పార్కింగ్ జోన్‌లో వాహనాలను ఆపితే ట్రాఫిక్ జామ్ అయి ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది.
😳 అనుమతి లేని ప్రదేశంలో వాహనాలను ఆపడం వల్ల ప్రమాదాల అవకాశం పెరుగుతుంది.
😳 పాదచారులకు సురక్షితంగా నడవడం కష్టం అవుతుంది.
😳 అంబులెన్స్ వంటి అత్యవసర సేవల వాహనాలకు ఆలస్యం అవుతుంది.
😳 ఇతరులకు ఇబ్బంది కలిగించడం వల్ల అనవసర పంచాయతీలు జరగే అవకాశం ఉంది.
ఎవరు చేస్తారు.?
😕 సమాజం పట్ల బాధ్యతారాహిత్యంగా.. నిర్లక్ష్యంగా ఉండేవాళ్లు.
😕 ఇతరులకు ఏమైతే మాకేంటి అనే మనస్తత్వం ఉన్నవాళ్లు.
😕 రూల్స్ మాకు వర్తించవు అని చట్టంపై ప్రతికూల దృష్టి ఉన్నవాళ్లు.
😕 నేనొక్కడినే చేస్తున్ననా అని ఆలోచించేవాళ్లు.
అమెరికాలో అయితే..
👉 $25- $100 వరకు జరిమాన విధిస్తారు.
👉 వాహనాన్ని "టోయింగ్" చేసి సీజ్ చేస్తారు.
👉 "అన్ సీజింగ్" కోసం అదనంగా $100-$300 ఖర్చు అవుతుంది.
👉 రోజువారీ స్టోరేజ్ ఫీజు వేస్తారు.
👉 పదే పదే ఉల్లంఘిస్తే లైసెన్స్ పాయింట్స్ తగ్గించి కోర్టులో కేసు వేస్తారు.
👉 స్థానికులు ఫిర్యాదు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
చైనాలో అయితే..
✋ 50-200 యువాన్ వరకు ఫైన్ ఉంటుంది.
✋ డాలర్లలో ఈ జరిమానా $7-$30కు సమానం.
✋ బీజింగ్.. షాంఘై నగరాల్లో టోయింగ్ చేస్తే 100-500 యువాన్ ఖర్చు అవుతుంది.
✋ డ్రైవింగ్ లైసెన్స్ మీద 1-3 పాయింట్లు తగ్గిస్తారు.
✋ 12 పాయింట్లు పోతే ఇక లైసెన్స్ సస్పెండ్ అవుతుంది.
✋ సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా అడుగడుగునా ఉల్లంఘనలను గుర్తిస్తారు.
సీరియస్ ఎందుకు లేదు.?
👍 మన దగ్గర వాహనాల సంఖ్య ఎక్కువ.. పార్కింగ్ స్థలాలు తక్కువ.
👍 ముఖ్యంగా ముంబై.. ఢిల్లీ.. హైదరాబాద్ వంటి నగరాల్లో.
👍 "చల్తా హై" అనే ధోరణి ఎక్కువ ఉండటం వల్ల.
👍 "అడ్జస్ట్ చేసుకోవచ్చు".. "కొద్దిసేపైతే ఏంకాదు" అనే ధోరణి మనవాళ్లలో ఎక్కువ ఉండటం వల్ల.
👍 "పోలీస్ లేకపోతే".. "ఫైన్ తక్కువైతే ఎస్కేపైపోతాం" అనే ధైర్యం ఎక్కువ.
👍 సామాన్యుల నుంచి "ఫిర్యాదులు" వెళ్తాయనే భయం లేదు.
రోజూ అదే సమస్య: వీరస్వామి, ఆర్టీసీ కండక్టర్
సిటీలో మాకు రోజూ ట్రాఫిక్ సమస్య ఎదురవుతోంది. వీటికి ప్రధాన కారణం రోడ్లపైనే కార్లు.. బైక్‌లు ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేసి పోతారు. తెలిసి చేస్తారో. తెలియక చేస్తారో కానీ.. దానివల్ల విపరీతంగా ట్రాఫిక్ జామ్ అయి పబ్లిక్ ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఒక్కోసారి గంట.. రెండు గంటలు ఆలస్యం అవుతుంది. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి.
చెప్తూనే ఉంటాం: ఎం. శ్రీశైలం, జనరల్ స్టోర్ నిర్వహకుడు
మా షాపు ముందు ప్రతిరోజు "నో పార్కింగ్" బోర్డు పెడతాం. జనాలు దాన్ని చూస్తారో లేదా చూసీ ఏం కాదనుకుంటారోగానీ ఆ బోర్డు పక్కనే పదుల సంఖ్యలో వాహనాలు పార్కింగ్ చేస్తారు. వాటిలో కార్లు కూడా ఉంటాయి. రద్దీ ప్రదేశం కాబట్టీ ఒక్కోసారి ట్రాఫిక్ జామ్ అవుతుంది. కొన్నిసార్లు కఠినంగా చెప్పినా వారిలో మార్పు రాలేదు. దినాం ఇదొక తలకాయనొప్పి మాకు.






