రైతు బిడ్డ.. మోడలింగ్ ఐకాన్.!

by Daayi Srishailam |

సృజనాత్మకతగా మలచుకొని మోడలింగ్ ప్రపంచంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది

రైతు బిడ్డ.. మోడలింగ్ ఐకాన్.!
X

దిశ, ఫీచర్స్: కలలు కనడం మానొద్దు. పేదింట్లో పుట్టినా.. డబ్బున్న వాళ్లింట్లో పుట్టినా కలలు కనాలి. వాటిని సాకారం చేసుకోవాలి. మహారాష్ట్రలోని ఖుత్ సవారి గ్రామానికి చెందిన అపెక్సా రాజ్‌పుత్ ఒక రైతు బిడ్డ. తన గ్రామీణ నేపథ్యాన్ని ధైర్యం.. సృజనాత్మకతగా మలచుకొని మోడలింగ్ ప్రపంచంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.

పొలాల్లో మోడలింగ్ వీడియోలు..

అపెక్సా వాళ్లది సాధారణ రైతు కుటుంబం. ఉన్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు వాళ్ల నాన్న. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న ఒక్క ఇల్లు అమ్ముకోవలసి వచ్చింది. ఇలాంటి కష్టాల మధ్య పెరిగినప్పటికీ.. ఆ పరిస్థితులకు అపెక్సా అదరలేదు.. బెదరలేదు. తన క్రియేటివిటీ ద్వారానే సమస్యలన్నింటినీ జయించాలనుకుంది. వేరే ఎక్కడో స్టూడియోలకు.. ఔట్‌డోర్ షూట్లకు కాకుండా వాళ్ల పొలాల్లోనే చిన్న చిన్న మోడలింగ్ వీడియోలు తీసుకుంటూ ఉండేది. మొదట్లో తనకు మోడలింగ్ కేవలం ఒక హాబీ మాత్రమే. కానీ తర్వాత అదే తనకు కొత్త జీవితాన్నిచ్చింది.

వైరల్ వీడియోతో..

అపెక్సా మోడలింగ్ కోసం యూట్యూబ్‌ను గురువుగా ఎంచుకుంది. పోజింగ్ నుంచి లైటింగ్.. కెమెరా యాంగిల్స్ వరకు అన్నీ తనకు తానే నేర్చుకుంది. పల్లెటూరితనం.. ఒరిజినాలిటీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలా ఫస్ట్ ఒక రీల్ వైరల్ అయ్యింది. దేశవ్యాప్తంగా లక్షల మంది ఆమె ధైర్యాన్ని.. ప్రత్యేక శైలిని మెచ్చుకున్నారు. అదే తనకు పెద్ద మలుపుగా మారింది. మొదటి సంపాదనతోనే ఐఫోన్ కొని.. తన ప్రయాణంలో ఒక మైలురాయికి గుర్తుగా పెట్టుకుంది. ఆ తర్వాత తనకు బ్రాండ్ ఆఫర్లు.. మోడలింగ్ అవకాశాలు క్యూ కట్టాయి. యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్‌తో ఇక వెనకడుగు వేయలేదు.

విలేజ్ టు స్పాట్‌లైట్..

అపెక్సా ఇప్పుడు పుణేలో కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ చదువుతూనే మరోవైపు మోడలింగ్ అసైన్‌మెంట్లు చేస్తోంది. ఎలాంటి తడబాటు.. భయం లేకుండా ఈ రెండింటినీ సమతుల్యం చేస్తోంది. ఎప్పటికైనా దేశం మెచ్చే స్థాయిలో ర్యాంప్ మీద నడుస్తుంటే తన పేరు మార్మోగిపోవాలనే కలతో నిత్యం ప్రాక్టీస్ చేస్తోంది. పొలాల మధ్యలో గట్లపై తడబాటు లేకుండా ఎలాగైతే నడిచిందో.. ర్యాంప్ మీదకూడా అలాగే నడుస్తూ పల్లెటూరి తనాన్ని ఫ్యాషన్ ప్రపంచానికి పరిచయం చేస్తోంది. ఒక చిన్న గ్రామం నుంచి స్పాట్‌లైట్ వరకు వెళ్లిన అపెక్సా పట్టుదల యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.

Next Story