- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వేదాస్ అన్‌స్కూలింగ్.. డిగ్రీలు కాదు జ్ఞానం ముఖ్యం
ఏం తింటున్నాం? ఏం కొంటున్నాం? కొడుక్కి ఏం నేర్పుతున్నాం

దిశ, ఫీచర్స్: గరిమ, ఆదిత్య భార్యాభర్తలు. వాళ్లది సింగపూర్. ఆరేళ్ల కొడుకున్నాడు. పేరు వేదాస్. ఉన్నట్టుండి సింగపూర్ నుంచి తట్టాబుట్టా సర్దుకొని ఉత్తరాఖండ్ కొండల్లోకి షిఫ్ట్ అయ్యారు. ఎందుకూ అని అడిగితే పిల్లోడి అన్‌స్కూలింగ్ కోసం అని అంటున్నారు. అసలీ అన్‌స్కూలింగ్ అంటే ఏంటీ.?
డబ్బు ముఖ్యం కాదు
సింగపూర్‌లో వాళ్లది సక్సెస్‌ఫుల్ లైఫ్. ఆదిత్య "నైక్" వంటి ప్రముఖ బ్రాండ్‌లతో పనిచేసిన ఫ్యాషన్ మేనేజర్. గరిమ డిజైనర్. మంచి కెరీర్. డబ్బుకూడా బాగా సంపాదించారు. కానీ నిజమైన ఆనందం లేదనే ఫీలింగ్. "ఏం తింటున్నాం? ఏం కొంటున్నాం? కొడుక్కి ఏం నేర్పుతున్నాం" అనే ఆలోచన. ఎందుకో సింగపూర్ జీవితాన్ని ఒక పంజరంలో ఉన్న పక్షిలా ఫీలయ్యారు. ఇక ఇక్కడ ఉండొద్దని భావించి రాత్రికి రాత్రే సూట్‌కేసులు సర్దుకొని ఉత్తరాఖండ్ వచ్చారు. అక్కడి కొండల్లో స్థిర నివాసం ఏర్పాటుచేసుకొని ఉంటున్నారు.
అన్‌స్కూలింగ్ అంటే.?
వేదాస్ ఆరేళ్ల బాలుడు. ఇప్పటివరకు స్కూల్ మెట్లు ఎక్కలేదు. యూనిఫామ్, సిలబస్, రిపోర్ట్ కార్డుల లొల్లే లేదు.సూర్యోదయాన్నే లేస్తాడు. పక్షుల కిలకిల రావాలు, వర్షం వాసన పులకరించిపోతాడు. ప్రకృతితో పరుగులు, రాళ్లతో ఆటలు, చీమల పరిశీలన, మట్టితో చిత్రాలు.. ఇలా సాగుతోంది వేదాస్ లైఫ్. అన్ స్కూలింగ్ సారాంశం ఇదే అంటారు ఆదిత్య, గరమి. సమస్యను అవసరం నుంచి పరిష్కరించుకోవాలి అనేది ఇంటి దగ్గరే నేర్చుకుంటున్నాడు. అతడిని నడిపించడం కంటే స్వేచ్ఛనిచ్చి సమస్యలను స్వయంగా పరిష్కరించే అవకాశం కల్పిస్తున్నారు. ఇది సృజనాత్మకత, ఆలోచన వృద్ధిని పెంపొందిస్తోంది.
ఐతే.. స్కూలొద్దా.?
అన్‌స్కూలింగ్ అంటే స్కూల్ అవసరం లేదని కాదు. సాంప్రదాయ స్కూలింగ్ విధానం అవసరం లేదని నిరూపిస్తున్నారు ఆదిత్య, గరిమ. స్కూల్స్ కేవలం సబ్జెక్టుల గురించి మాత్రమే చెప్తాయి. కానీ అన్‌స్కూలింగ్ మెథడ్.. సహకారం, అనుకూలత, భావోద్వేగ బుద్ధిని నేర్పుతోంది. పిల్లలు ఖాళీ పాత్రలు కాదు. వారికి సొంత ఆసక్తులు, ఉత్సుకతలు ఉంటాయి. నమ్మకం, ఓపిక, స్వేచ్ఛ అనేవి స్కూల్లో దొరకవు అంటున్నారు. డిగ్రీల కోసం పరుగెత్తడం కాదు, జ్ఞానాన్ని సంపాదించడానికి అన్‌స్కూలింగ్ ప్రయారిటీ ఇస్తోంది. వేదాస్ ఎప్పడూ పరీక్ష రాయలేదు. కానీ పేరెంట్స్ ఏదడిగినా వివరంగా చెప్తాడు.
సాధారణ జీవితం
కెరీర్‌ను పణంగా పెట్టారు కాబట్టీ.. భవిష్యత్‌లో ఆర్థిక ఒడిదొడుకులు రాకుండా ముందే ప్లాన్ చేసుకున్నారు. సింగపూర్‌లో సంపాదించిన డబ్బును ఆదా చేస్తూ ఖర్చులను తగ్గించారు. అద్దె, సిబ్బంది, షాపింగ్, వినోదం లేని జీవనాన్ని కొనసాగిస్తున్నారు. కంటెంట్ క్రియేటింగ్, వర్క్‌షాప్‌ల ద్వారా స్వల్ప ఆదాయం పొందుతున్నారు. "సమయం, కుటుంబ బంధం, శాంతే మా ధనం" అని అంటున్నారు. వాళ్లు పుస్తకాలు, పరీక్షలకు వ్యతిరేకం కాదు. కానీ వాటిని చిన్న వయసులోనే బలవంతంగా రుద్దడానికి వ్యతిరేకం. అందుకే అన్ స్కూలింగ్ దేశమంతా అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందంటున్నారు.






