సంప్రదాయాలను పిల్లలకు నేర్పిస్తూ నెలకు రూ.12 లక్షలు సంపాదిస్తోంది.

by Daayi Srishailam |

ఏరోస్పేస్‌‌‌‌‌ను వదిలేసి.. పిల్లలు ఏం తినాలో నేర్పిస్తోంది.!

సంప్రదాయాలను పిల్లలకు నేర్పిస్తూ నెలకు రూ.12 లక్షలు సంపాదిస్తోంది.
X

ఫీచర్స్: మన పిల్లలకు ఏం నేర్పాలి.? ఏం నేర్పుతున్నాం.? అనేవి చెక్ చేసుకుందామా.? ఐతే ఒకసారి 27 ఏళ్ల నిష్ఠా చౌహాన్ లైఫ్ జర్నీ తెలుసుకుందాం. గుజరాత్‌‌‌‌లోని ఒక చిన్న కేఫ్ ద్వారా ఆరోగ్యవంతమైన ఆహారం, పర్యావరణ పరిరక్షణ, సంప్రదాయాలను పిల్లలకు నేర్పిస్తూనే ఇంకోవైపు నెలకు రూ.12 లక్షలు సంపాదిస్తోంది.

తాతే స్ఫూర్తి..

నిష్ఠా చౌహాన్ కేఫ్ పేరు "కేఫ్ ఆరంభ్". అంతకుముందు ఆమె ఒక ఇంజనీర్. ఏరోస్పేస్ రంగంలో ఉజ్వలమైన కెరీర్‌ను వదిలేసి నేలను దున్నడం, చిరుధాన్యాలను రుబ్బడం, కిచెన్ వ్యర్థాలను కంపోస్ట్ చేయడం వంటి పనులను ఎంచుకుంది. నిష్ఠా వాళ్ల తాత చిరుధాన్యాల ప్రాక్టీషనర్. రాగి, జొన్న, సజ్జ, లిటిల్ మిల్లెట్ వంటి పురాతన ధాన్యాల గొప్పతనాన్ని గట్టిగా నమ్మేవాడు. ఇంట్లో భోజనం సరళంగా, ఆరోగ్యకరంగా ఉండేది. కిచెన్‌లోని తడి వ్యర్థాలన్నీ జాగ్రత్తగా కంపోస్ట్ చేయబడేవి. వాటన్నింటినీ చూస్తూ పెరిగిన నిష్ఠా పెద్దయ్యాక వాటిని తన అలవాట్లుగా మార్చుకుంది.

కేఫ్ ఆరంభ్..

ఇంజనీరింగ్ పూర్తిచేసిన తర్వాత అజిస్టా ఏరోస్పేస్‌లో చేరి ఇస్రోతో కలిసి శాటిలైట్ పేలోడ్‌లపై పనిచేసింది. అది మేధోపరమైన ఉన్నతమైన పనే అయినా ఆమెకు ఏదో వెలితిగా అనిపించేది. తాతయ్య ప్రభావం చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టీ ఆహార రంగంలో సొంతంగా ఏదైనా ప్రారంభించాలని ఉండేది. అదే సమయంలో కోవిడ్-19 విజృంభించింది. జాబ్‌ను వదిలేసింది. పోషకాహారం, వ్యవసాయ పర్యావరణం, భారతదేశ ఆహార సంప్రదాయాల గురించి పరిశోధన చేసింది. డిసెంబర్ 2021లో అహ్మదాబాద్‌లోని థల్తేజ్‌లోని సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ ప్రాంగణంలో ‘కేఫ్ ఆరంభ్’ను ప్రారంభించింది.

జీరో వేస్ట్ కేఫ్..

కేఫ్‌లో సీజనల్ మెనూ ఉంటుంది. 15 నుంచి 20 చిరుధాన్య ఆధారిత వంటకాలు ఉంటాయి. రాగి దోసె, సజ్జ భేల్, మిల్లెట్ మోమోస్, రాగి బన్స్‌తో వడా పావ్ వంటివి ఆ మెనూలో ఉంటాయి. ఈ వంటకాలు గాజు సామానుల్లో వడ్డిస్తారు. ప్లాస్టిక్, డిస్పోజబుల్ వస్తువులను అస్సలు వాడరు. టేక్‌అవే.. ఈవెంట్‌లలో బయోడిగ్రేడబుల్ ఆకు ప్లేట్లు, బాగాస్ గిన్నెలను ఉపయోగిస్తారు. కూరగాయల తొక్కలు, తడి వ్యర్థాలు కంపోస్ట్‌గా మార్చి కేఫ్‌లోని కిచెన్ గార్డెన్‌కు ఎరువుగా ఉపయోగిస్తోంది. డిస్పోజబుల్ టిష్యూలకు బదులు, హ్యాండ్‌వాష్ స్టేషన్, పునర్వినియోగ గుడ్డ తువ్వాళ్లను అందిస్తోంది.

నెలకు రూ.12 లక్షలు..

జెమ్స్ జెనెసిస్ ఇంటర్నేషనల్ స్కూల్, ఆదానీ ఇంటర్నేషనల్, ఆనంద్ నికేతన్ వంటి స్కూళ్లతో భాగస్వామ్యం చేసి 5-11 సంవత్సరాల పిల్లల కోసం ఎకో-వర్క్‌షాప్‌లను ప్రారంభించింది. గత రెండేళ్లలో 2000 మందికి పైగా పిల్లలు ఈ వర్క్‌షాప్‌లలో పాల్గొన్నారు. ఈ వర్క్‌షాప్‌లలో పిల్లలు మట్టిని తాకి, తులసి, బ్రాహ్మి వంటి స్థానిక మొక్కలను గుర్తిస్తారు. క్యారెట్, బచ్చలికూర, తినదగిన పుష్పాలను కోస్తారు. కేఫ్ ఆరంభ్ మొత్తంగా 47.3 టన్నుల ప్లాస్టిక్, కార్బన్ వ్యర్థాలను తగ్గించింది. ఇది 2300 చెట్లు నాటిన దానితో సమానం. కేఫ్ ఆరంభ్ ద్వారా నెలకు రూ. 12 లక్షల ఆదాయాన్ని సంపాదిస్తోంది.

Next Story