ఓ యువజంట ఆవిష్కరణ.. శ్వాసతోనే వ్యాధులు గుర్తించే అద్భుతం.. వోల్ట్రాక్ !

by Javid Pasha |

‘అక్యుబిట్స్ ఇన్వెంట్’ అనే స్టార్టప్ డెవలప్ చేసిన వోల్ట్రాక్ డివైజ్ కేవలం 90 సెకన్లలో టీబీ, క్యాన్సర్, మెటబాలిక్ డిజార్డర్స్ వంటి వ్యాధులను శ్వాస ద్వారా గుర్తిస్తుంది.

ఓ యువజంట ఆవిష్కరణ.. శ్వాసతోనే వ్యాధులు గుర్తించే అద్భుతం.. వోల్ట్రాక్ !
X

దిశ, ఫీచర్స్ : శరీరంలో ఏదైనా వ్యాధిని గుర్తించాలంటే ముందుగా సంబధిత మెడికల్ టెస్టులను సజెష్ చేస్తుంటారు వైద్య నిపుణులు. ఆ తర్వాతే నిర్ధారిస్తారు. చాలా వరకు బ్లడ్ టెస్టులు, సిటిస్కాన్, ఎంఆర్ఐ వంటివి అవసరం అవుతుంటాయి. అయితే ఇవేవీ అవసరం లేకుండానే జస్ట్ శ్వాస ద్వారా శరీరంలో ఉన్న వ్యాధులు తెలిసిపోతాయంటే మీరు నమ్ముతారా? కానీ ఇది సాధ్యమేనని నిరూపించారు కేరళకు చెందిన యువ ఫౌండర్లు నిధిన్ శ్రీకుమార్ (కెమికల్ ఇంజినీర్), అతని భార్య డాక్టర్ అశ్వతి ఉదయన్ (మైక్రోబయాలజిస్ట్). బాడీ బ్రేక్ డౌన్ అవడానికి ముందు శ్వాస హెచ్చరికలు ఇవ్వగలదా? అనే డౌట్‌తో ప్రారంభించి అక్యుబిట్స్ ఇన్వెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే స్టార్టప్‌ను స్థాపించారు. ఇది వోల్ట్రాక్ (VolTrac) అనే డివైజ్‌ను అభివృద్ధి చేసింది.

సూదులు, నొప్పి లేకుండానే..

‘అక్యుబిట్స్ ఇన్వెంట్’ అనే స్టార్టప్ డెవలప్ చేసిన వోల్ట్రాక్ (VolTrac) డివైజ్ కేవలం 90 సెకన్లలో టీబీ, క్యాన్సర్, మెటబాలిక్ డిజార్డర్స్ వంటి వ్యాధులను శ్వాస ద్వారా గుర్తిస్తుంది. అంటే ఎటువంటి సూదులు, నొప్పి లేకుండా కేవలం నోటితో శ్వాసన ఊదడం ద్వారా పనిచేసే ఈ పరికరం, మానవ శ్వాస, చెమటలలోని వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ (VOCs)ను గ్రహించి విశ్లేషిస్తుంది. నిజానికి ఈ టెక్నాలజీ ప్లాంట్స్ మధ్య కమ్యూనికేషన్‌పై రీసెర్చ్ నుంచి ప్రారంభమై, మానవ బయోకెమిస్ట్రీకి అనువర్తించబడింది. 2020లో రిజిస్టర్ అయిన ఈ స్టార్టప్, తిరువనంతపురంలోని బయో360 లైఫ్ సైన్సెస్ పార్క్‌లో ఆపరేట్ అవుతోంది.

బ్రీత్‌ ఎనలైజర్‌లా పని చేస్తుంది?

వోల్ట్రాక్ డివైజ్ బ్రీత్ ఎనలైజర్‌లా పనిచేస్తుంది. అంటే.. యూజర్ ఇందులోకి నోటితో గాలిని ఊదితే.. 1.5 నిమిషాల్లో వ్యాధులను స్క్రీన్ చేస్తుంది. ప్రతి వ్యాధి ఒక యూనిక్ VOC ప్యాటర్న్‌ను ఉత్పత్తి చేస్తుంది కాబట్టి.. ఈ సెన్సార్ టెక్నాలజీ ఆ ప్యాటర్న్‌లను గుర్తిస్తుంది. ల్యాబ్ టెస్టుల్లో 98.5% కచ్చితత్వం సాధించిన ఈ పరికరం, బయోటెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెటీరియల్ సైన్స్‌లను ఇంటిగ్రేట్ చేసి రూపొందించబడింది. అయితే ఇప్పటికైతే వందశాతం పర్ఫెక్ట్ కాదు.. కానీ ట్రెడీషనల్ ల్యాబ్ టెస్టులకు బదులుగా నాన్-ఇన్వాసివ్ ఆల్టర్నేటివ్‌గా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. 2025లో పేటెంట్ పొందిన ఈ టెక్నాలజీ నాన్-ఇన్వాసివ్ మెడికల్ డయాగ్నస్టిక్స్‌లో ముందుంచుతోంది. దీని ప్రధాన ఉద్దేశ్యం వ్యాధులను ముందుగా గుర్తించడం, స్క్రీనింగ్‌ను అందుబాటులోకి తీసుకురావడం, రోగులకు ఆలస్యం కాకుండా చికిత్స తీసుకునే అవకాశం కల్పించడమే అంటున్నారు స్టార్టప్ నిర్వాహకులు. మార్కెట్‌లోకి తీసుకురావడానికి సిద్ధం అవుతున్నారు.

Next Story