కాలు విరిగిపడ్డా పర్యాటకులకు ఆశ్రయమిచ్చిన కశ్మీరీ రాబిట్ గర్ల్ రుబీనా.!

by Daayi Srishailam |

"రాబిట్ గర్ల్" చూపించిన తెగువ అంతా ఇంతా కాదు.!

కాలు విరిగిపడ్డా పర్యాటకులకు ఆశ్రయమిచ్చిన కశ్మీరీ రాబిట్ గర్ల్ రుబీనా.!
X

తుపాకీ శబ్దాలు..

హాహాకారాలు..

ఆందోళనలు..

భయంతో పరుగులు..

పర్యాటకులు వణికిపోయారు.

పహల్గామ్ రక్తసిక్తమైంది.

ఎవరికి తోచిన సాయం వాళ్లు చేస్తు్న్నారు.

కాశ్మీర్‌ను కాపాడుకోవాలని తపిస్తున్నారు.

వారిలో "రాబిట్ గర్ల్" చూపించిన తెగువ అంతా ఇంతా కాదు.!

- దిశ, ఫీచర్స్

బైసర్ ఈకో పార్కులో 16 ఏళ్ల రుబీనా గైడ్‌గా.. సహాయకురాలిగా పనిచేస్తోంది. రుబీనా మాత్రమే కాదు. స్థానికంగా ఉండే యువత దాదాపు గైడ్‌గా.. సహాయకులుగా పనిచేస్తారు. ఒకరకంగా వారి జీవనాధారం అదే. పర్యాటకం బాగుంటేనే.. నిత్యం పర్యాటకులు వచ్చిపోతెనే వాళ్ల బతుకులు బాగుంటాయి.

రాబిట్ గర్ల్

రుబీనా ఎప్పుడూ తనతో తన పెంపుడు కుందేలును తీసుకెళ్తుంది. ఆ కుందేలుతో పర్యాటకులు ఫొటోలు తీసుకుంటారు. దానికి కొంత ఫీజు చెల్లిస్తారు. ఇలా కుందేలుతో పర్యాటకులను ఆకట్టుకోవడం వల్ల రాబిట్ గర్ల్‌గా ఫేమస్ అయింది రుబీనా. వాళ్ల నాన్నకు ఆరోగ్యం బాగుండదు. కుటుంబ భారమంతా రుబీనాపైనే. అందుకోసమే చదువు కూడా మానేసింది. తోడుగా తన సోదరి ముంతాజాను తీసుకెళ్తుంది. పార్కులో గైడ్‌గా పనిచేయడం వల్ల రోజుకు రూ. 400-500 సంపాదిస్తుంది. పర్యాటకులు ఆగిపోతే వాళ్ల బతుకు భారం అవుతుంది.

ఇంటిని ఆశ్రయం

పచ్చని పహల్గామ్ హిల్ టౌన్‌లో తుపాకీ శబ్దాలు సందర్శకుల్లో భయాందోళనలు రేకెత్తించాయి. ఎక్కడివాళ్లక్కడ పరుగులు తీస్తున్నారు. ఒకర్నొకరు చూసుకోవడానికి కూడా అవకాశం లేదు. ఆ భయం నడుమ రుబీనా ధైర్యంగా రంగంలోకి దిగింది. ధీర యువతిగా పర్యాటకుల భయాన్ని పారదోలింది. ఒకొకర్ని తీసుకెళ్లి తన ఇంట్లో ఆశ్రయమిచ్చింది. వారి ప్రాణాలకు హాని జరగకుండా.. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సాహసం చేసింది. ఎక్కడ కాశ్మీర్ పర్యాటకం ఆగమవుతుందో.. తమ భవిష్యత్ ఏంటో అని తలుచుకొని బాధతో భయానికి అడ్డువెళ్లింది.

పరుగులు పెట్టి..

తూటాల దాడి ప్రారంభమయ్యే కొద్ది క్షణాల ముందు రుబీనా.. చెన్నయ్ నుంచి వచ్చిన పర్యాటకులను తీసుకొని పార్కుకు వెళ్లింది. తన కుందేలును పర్యాటకులకు చూపించి.. మ్యాగీ నూడుల్స్ కావాలంటే ఏర్పాటుచేసింది. నూడుల్స్ తిని ఫొటోలు తీసుకుంటుండగా తుపాకీ శబ్దాలు వినిపించాయి. ఎవరైనా పటాకులు పేలుస్తున్నారేమో అనుకున్నారట. కానీ తర్వాత ప్రజలు పరుగెత్తడం.. కేకలు వేయడం.. గుర్రపు బండ్లవాళ్లు "పారిపోండి" అని అరవడంతో రుబీనా పరుగెత్తడం ప్రారంభించింది. ఆ భయం తన గురించి కాదు.. కాశ్మీర్ అందాలను చూడటానికి వచ్చిన పర్యాటకుల గురించి.

గాయాలైనా..

కొండల నుంచి అలసిపోయి.. కన్నీళ్లతో వస్తున్న సందర్శకులను చేరదీసింది రుబీనా. చాలామంది చెప్పుల్లేకుండా వణుకుతూ పరుగులు తీస్తున్నారు. సోదరి ముంతాజాకు చెప్పి వాళ్లను ఇంటికి పంపించింది. పార్క్ నుంచి వాళ్ల ఇల్లు కిలోమీటర్ దూరంలో ఉంటుంది. నీళ్లు.. స్నాక్స్ ఇచ్చి ఓదార్చింది. ముంతాజా కాలు విరిగింది.. రుబీనాకు గాయాలయ్యాయి. తన కుందేలూ పోయింది. వచ్చినవాళ్లేమో బిడ్డ తప్పిపోయిందనీ.. సామాన్లు పోయాయని ఏడుస్తున్నారు. ఆ గాయాల మధ్యలో కూడా రెండుసార్లు కొండపైకి వెళ్లి బిడ్డను.. సామానును తీసుకొచ్చింది రుబీనా.

Next Story