ఒకే చెట్టుపై 350 రకాల కాయలు పండించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కాడు.!

by Daayi Srishailam |

ఆయన సృష్టించిన అద్భుతం "మామిడి మనిషి" అనే బిరుదు, పద్మశ్రీ పురస్కారం, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానాన్ని తెచ్చిపెట్టింది.

ఒకే చెట్టుపై 350 రకాల కాయలు పండించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కాడు.!
X

దిశ, ఫీచర్స్: ఒక సాధారణ రైతు ఒకే మామిడి చెట్టుపై 350 రకాల కాయలను పండించాడంటే నమ్మశక్యంగా లేదు కదా.? కానీ ఇది నిజం. ఉత్తరప్రదేశ్‌లోని మాలిహాబాద్‌కు చెందిన 84 ఏళ్ల కలీముల్లా ఖాన్ దీనిని సాధ్యం చేశాడు. ఆయన సృష్టించిన అద్భుతం "మామిడి మనిషి" అనే బిరుదు, పద్మశ్రీ పురస్కారం, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానాన్ని తెచ్చిపెట్టింది.

వారసత్వంగా..

కలీముల్లా ఖాన్ చిన్నతనంలో చదువుకు దూరమయ్యాడు. మామిడి తోటలో అతడి జీవితం కొత్త మలుపు తిరిగింది. వాళ్ల తాత మరణం తర్వాత మామిడి తోట బాధ్యతలను తీసుకున్నాడు. 1957లో ఒక సరికొత్త ఆలోచన ఆయన మనసులో మొలకెత్తింది. ఒకే చెట్టుపై ఏడు రకాల మామిడి కాయలను పండించాలనుకున్నాడు. ప్లాన్ బాగనే అమలయ్యిందిగానీ వరదల వల్ల ఆ చెట్టు పూత, కాతకు నోచుకోలేదు. ఆ ఒక్క సంఘటన నీటి నిర్వహణ గురించి చాలా నేర్పింది. ఈ వైఫల్యం ఆయన్ని ఆపలేదు. కొమ్మలను అంటుకట్టడం గురించి అధ్యయనం చేయడం మొదలుపెట్టాడు.

అంటుకట్టడం ద్వారా..

గ్రాఫ్టింగ్ టెక్నిక్ పద్ధతిలో ఒక చెట్టు కొమ్మను మరో చెట్టు మొదటితో అంటుకట్టి రెండూ ఒకటిగా పెరిగేలా చేయడం ప్రారంభించాడు. ఈ ప్రక్రియ సరళంగా అనిపించినా దీనికి ఓపిక చాలా అవసరం. కలీముల్లా 1987లో 125 ఏళ్ల పాత చెట్టుపై ఈ గ్రాఫ్టింగ్ ప్రయోగాలను మొదలుపెట్టాడు. అదే ఇప్పుడు 350 రకాల మామిడి కాయలను ఫలిస్తోంది. ప్రతి రకం తనదైన రుచి, రంగు, సుగంధంతో విభిన్నంగా ఉంటుంది. గ్రాఫ్టింగ్ ఒక కళ. ఇది ఒక పజిల్ లాంటిది. సరైన రకాలను ఎంచుకోవాలి, జాగ్రత్తగా అంటుకట్టాలి, సంవత్సరాల తరబడి సంరక్షించాలి. కళీముల్లా దీనిని పక్కాగా పాటించాడు.

మామిడి కథలు.. పేర్లు

కలీముల్లా చెట్టు కేవలం మామిడి కాయలను మాత్రమే కాదు.. కొన్ని కథలను కూడా చెప్తోంది. అతడు మామిడి రకాలకు ప్రముఖ వ్యక్తుల పేర్లను పెట్టాడు. ఐశ్వర్య రాయ్, నరేంద్ర మోదీ, అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్ వంటి పేర్లతో రకాలు ఉన్నాయి. ఇందులో అల్ఫాన్సో, లంగ్రా, కేసర్, దశేరి, చౌన్సా వంటి ప్రసిద్ధ రకాలతో పాటు కలీముల్లా సృష్టించిన "దుశేహ్రీ కలీమ్" వంటి హైబ్రిడ్ రకాలు కూడా ఉన్నాయి. ఈ "దుశేహ్రీ కలీమ్" రకం సృష్టించడానికి 12 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే రెండు రకాలను సమన్వయంగా కలపడం సులభమైన పని కాదు.

జీవన ప్రయోగశాల

తన దగ్గరి నుంచి ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, పూణే, భోపాల్ వంటి నగరాల నుంచి విత్తనాలను సేకరిస్తారు. కలీముల్లా చెట్టు కేవలం భారతదేశంలోనే కాక విదేశాల్లో కూడా గుర్తింపు పొందింది. ఇరాన్, దుబాయ్ నుంచి రైతులు, పరిశోధకులు ఈ చెట్టును చూడటానికి, గ్రాఫ్టింగ్ పద్ధతులను తెలుసుకోవడానికి వస్తారట. ఆయన తోట ఒక జీవన ప్రయోగశాలగా మారింది. అతనికెన్నో పురస్కారాలు తెచ్చిపెట్టింది. ఇక్కడ ఆవిష్కరణ, కష్టపడే తత్వం, మామిడి పట్ల ప్రేమ కలిసి ఉన్నాయి. నిజంగా ఒకే చెట్టుకు 350 రకాల మామిడి కాయలను చూడటం అద్భుతం కదా.?

Next Story