ఆలుగడ్డ పొట్టుతో షాపింగ్ బ్యాగులు.. జపనీస్ నిపుణుల అద్భుత ఆవిష్కరణ!

by Javid Pasha |

జపాన్‌కు చెందిన నిపుణులు బంగాళ దుంపల పొట్టుతో ఎకో ఫ్రెండ్లీ షాపింగ్ బ్యాగ్‌లను తయారు చేశారు.

ఆలుగడ్డ పొట్టుతో షాపింగ్ బ్యాగులు.. జపనీస్ నిపుణుల అద్భుత ఆవిష్కరణ!
X

దిశ, ఫీచర్స్ : పర్యావరణ స్పృహ ఇటీవల కొత్త ఆవిష్కరణలకు దారితీస్తోంది. ఎటువంటి హాని లేని ఉత్పత్తులపై నిపుణులు, పరిశోధకులు దృష్టి పెడుతున్నారు. తాజాగా జపాన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ అండ్ కెమికల్ రీసెర్చ్& యూనివర్సిటీ ఆఫ్ టోక్యో పరిశోధకులు కలిసి బంగాళ దుంపల నుంచి తీసిన పిండి(Potato starch), పొట్టుతో షాపింగ్ బ్యాగ్‌లను తయారు చేశారు. ఇవి ఎటువంటి టాక్సిక్ అవశేషాలు లేకుండా సహజంగానే నీటిలో, నేలలో కరిగిపోతాయి.

నీటి వనరుల్లో కరిగిపోతాయి

జపనీస్ నిపుణులు ఆలు గడ్డ పొట్టు లేదా వాటిలోని పిండితో తయారు చేసిన బ్యాగులు సాంప్రదాయ పెట్రోలియం ఆధారిత ప్లాస్టిక్ బ్యాగ్‌లకు భిన్నమైనవి. అంతేకాకుండా ఈ బయోడిగ్రేడబుల్ సంచులు మొక్కల ఆధారితమైనవి. చెరువులు, నదులు, సముద్రాలు వంటి నీటి వనరుల్లో కలిసిపోయినా కాలుష్యం ఉండదు. ఈ బ్యాగులు హాట్ వాటర్‌లో కూడా గంటల వ్యవధిలోనే కరిగిపోతాయి. ఎటువంటి మైక్రో ప్లాస్టిక్స్ లేదా హానికరమైన అవశేషాలను విడుదల చేయవు.

సముద్ర కాలుష్యం తగ్గుతుంది

బంగాళ దుంప పొట్టు లేదా పిండితో తయారు చేయడం వల్ల ఈ బ్యాగులు పునరుత్పాదక వనరులపై ఆధారపడతాయి. సాధారణ ప్లాస్టిక్ బ్యాగ్‌ల మాదిరిగానే బలంగా ఉంటాయి. కానీ తేమ లేదా నీటికి బలహీనమవుతాయి. ఇవి సముద్రాల్లో దీర్ఘకాలిక కాలుష్యాన్ని తగ్గించగలవని పరిశోధకులు చెబుతున్నారు. సాధారణ ప్లాస్టి్క్ బ్యాగులు మాత్రం ఇందుకు భిన్నంగా శతాబ్దాల పాటు నీటిలో నిర్వీర్యం అవకుండా ఉండటంవల్ల సముద్ర జీవులకు హాని కలిగిస్తాయి. కాబట్టి ఈ ప్లాంట్-బేస్డ్ బయోప్లాస్టిక్స్ సరైన మేనేజ్‌మెంట్‌తో ఉపయోగిస్తే, సముద్ర జీవవ్యవస్థలకు ముప్పు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు, చేపలు లేదా తాబేళ్లు వాటిని తిన్నా సహజంగా జీర్ణమవుతాయి. అలాగే రోజువారీ షాపింగ్‌కు కూడా ఉపయోగపడతాయి. అయితే ఇవి ఇంకా విస్తృతంగా ఉపయోగంలోకి రాలేదు.

Next Story