అంతరిక్షం నుంచి నేరుగా మొబైల్‌కు ఇంటర్నెట్..! కేబుల్స్, టవర్లు అవసరం లేకుండానే..

by Javid Pasha |   (  Updated:2025-12-23 10:22:32  IST  )

కేబుల్స్, సెల్ టవర్స్ నుంచి కాకుండా ఉపగ్రహాల నుంచి నేరుగా అందే సిగ్నల్స్ ద్వారా ఇంటర్నెట్‌ను ఉపయోగించుకునే ప్రయత్నాల్లో భాగంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2025, డిసెంబర్ 24న BlueBird-6 అనే భారీ ఉపగ్రహాన్ని(satellite) అంతరిక్షంలోకి పంపనున్నది

అంతరిక్షం నుంచి నేరుగా మొబైల్‌కు ఇంటర్నెట్..! కేబుల్స్, టవర్లు అవసరం లేకుండానే..
X

దిశ, ఫీచర్స్ : మనం ప్రతి రోజూ ఉపయోగించే ఇంటర్నెట్ ఎలా వస్తుందో తెలుసా? వరల్డ్ ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో 99% కంటే ఎక్కువ భూమి మీద ఉన్న ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ (సముద్రం అడుగున ఉన్న అండర్‌సీ కేబుల్స్ అండ్ ల్యాండ్ కేబుల్స్) అండ్ సెల్ టవర్స్ ద్వారా వస్తుంది. మనం వాడే ఫోన్ రేడియో వేవ్స్ కారణంగా సమీపంలోని సెల్ టవర్ ఆ సిగ్నల్‌ను పట్టుకుని, ఫైబర్ కేబుల్స్ ద్వారా ఇంటర్నెట్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేస్తుంది. అందుకే సిటీలలో స్పీడ్ బాగుంటుంది. సెల్ టవర్లు లేని రిమోట్ ఏరియాలలో సిగ్నల్ వీక్ అవుతుంది. లేదా అసలుకే రాదు. కానీ భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు లేకపోవచ్చు. ప్రస్తుతం మనం భూమిపై ఎక్కడున్నా వాతావరణంలోని గాలి ఎలాగైతే అందుతుందో.. ఇంటర్నెట్ కూడా అంతరిక్షంలోని ఉపగ్రహాల ద్వారా ఆ విధంగా నేరుగా అందే అవకాశం ఉందంటున్నారు సాంకేతిక నిపుణులు. ఎందుకంటే అందుకు సంబంధించిన ప్రయోగాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

నేడు అంతరిక్షంలోకి..

కేబుల్స్, సెల్ టవర్స్ నుంచి కాకుండా ఉపగ్రహాల నుంచి నేరుగా అందే సిగ్నల్స్ ద్వారా ఇంటర్నెట్‌ను ఉపయోగించుకునే ప్రయత్నాల్లో భాగంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) డిసెంబర్ 24, 2025న అమెరికాకు చెందిన AST SpaceMobile అనే కంపెనీకి చెందిన BlueBird-6 అనే భారీ ఉపగ్రహాన్ని(satellite), ఆంధ్రప్రదేశ్‌లోగల శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి అంతరిక్షంలోకి పంపబోతోంది. ఇది సుమారు 6,500 కిలోల బరువు ఉంటుంది. భారత కాలమానం ప్రకారం 8:54 గంటలకు దీనిని పంపిస్తారు. భూమి నుంచి సుమారు 550 కిలోమీటర్ల ఎత్తులోని ఆర్బిట్‌లో దీనిని పెడతారు. ఇది LVM3 రాకెట్‌కు మూడో కమర్షియల్ మిషన్. ఇప్పటివరకు ఈ రాకెట్ 8 సార్లు ప్రయోగించబడింది. ముందు రెండు కమర్షియల్ లాంచ్‌లు యూరోపియన్ కంపెనీ OneWeb కోసం జరిగాయి. ఇప్పుడు మొదటి సారి అమెరికా కస్టమర్ యూజెస్ కోసం ప్రయోగిస్తోంది.

BlueBird-6 శాటిలైట్ ప్రత్యేకత

AST SpaceMobile అనే టెక్సాస్ (అమెరికా) కంపెనీ దీన్ని తయారు చేసింది. ఈ కంపెనీ సాంకేతిక శాస్త్రవేత్తల లక్ష్యం సాధారణ మొబైల్ ఫోన్‌లకు నేరుగా ఇంటర్నెట్ అందించే ఉపగ్రహాల నెట్‌వర్క్ నిర్మించడం. మనం వాడే ఆండ్రాయిడ్ లేదా యాపిల్ ఫోన్‌లకు ఎలాంటి ఎక్స్‌ట్రా హార్డ్‌వేర్ అవసరం లేకుండా, నేరుగా ఉపగ్రహాలతో కనెక్ట్ అయ్యేలా చేయడం. శాటిలైట్ ఫోన్‌లు (ఇరిడియం, థురయా లాంటివి) పెద్దవి, యాంటెన్నా కనిపించాలి, మాట్లాడటం లేదా స్లో టెక్స్ట్ మాత్రమే సాధ్యం అవుతుంది. కానీ ఇక్కడ సాధారణ ఫోన్‌తోనే హై-స్పీడ్ ఇంటర్నెట్ వస్తుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ప్రపంచంలో ఎక్కడైనా ‘నెట్‌వర్క్ లేదు’ పరిస్థితి ఉండదు. అంటే BlueBird-6 ఉపగ్రహం సక్సెస్ అయితే డైరెక్ట్-టు-డివైస్ (D2D) లేదా డైరెక్ట్-టు-సెల్ (D2C) పద్ధతిలో అంతరిక్షంలోని ఉపగ్రహాల ద్వారా నేరుగా మొబైల్ ఫోన్లకు ఇంటర్నెట్ అందుతుంది. కాబట్టి సాధారణ మొబైల్ ఫోన్‌లకు (స్మార్ట్‌ఫోన్‌లకు) భూమిపై సెల్ టవర్లు అవసరం ఉండదు. అంతరిక్షంలోని ఉపగ్రహాల నుంచే 4G/5G సిగ్నల్ (వాయిస్ కాల్స్, టెక్స్ట్, ఇంటర్నెట్) అందుతాయి.

ఎలా పనిచేస్తుంది?

అంతరిక్షంలోని కక్ష్యలో ఉండే BlueBird-6 ఉపగ్రహం కారణంగా భూమిపై ఫోన్ సిగ్నల్ లేనప్పుడు ఆటోమేటిక్‌గా ఉపగ్రహానికి స్విచ్ అవుతుంది. ఉపగ్రహం సిగ్నల్‌ను భూమిపై గ్రౌండ్ స్టేషన్‌కు పంపి, అక్కడ నుండి మొబైల్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేస్తుంది. దీంతో ప్రపంచవ్యాప్త కనెక్టివిటీ, డిజిటల్ డివైడ్ తగ్గుతుంది. భూమిపై ఉండే సెల్ టవర్లకంటే కొంచె స్పీడ్ తక్కువగా ఉంటుంది కానీ.. నో సిగ్నల్ అనే మాటే ఉండదు. ఒక విధంగా చెప్పాలంటే మన భూమిపై గాలి ఏ విధంగానైతే ప్రతీచోట వ్యాపించి ఉందో అప్పుడు ఇంటర్నెట్‌కు సంబంధించి సిగ్నల్ ప్రతీచోట ఉంటాయి. ఇక్కడ ఉపగ్రహాలే సెల్ టవర్ల లాగా పనిచేస్తాయి. 2025లో AST ఇప్పటికే BlueBird ఉపగ్రహాలను లాంచ్ చేసి, AT&Tతో వీడియో కాల్ టెస్ట్ చేసింది. 45-60 ఉపగ్రహాలు లాంచ్ చేసి, 2026 చివరి నాటికి పూర్తి నెట్‌వర్క్ సిద్ధం చేయాలని ప్లాన్‌ అమలు కోసం డిసెంబర్ 24న అంతరిక్షంలోకి శాటిలైట్‌ను పంపనుంది.

Next Story