హైదరాబాద్‌లో ఇంద్ర భవనాలు..

by Sujitha Rachapalli |   (  Updated:2026-03-28 08:32:56  IST  )

లగ్జరీ ఫ్లాట్లకు హైదరాబాద్ కేరాఫ్.. దేశంలోనే తొలిసారిగా సిక్స్ బీహెచ్‌కే నిర్మాణాలు.. ఐదు వేల నుంచి 16వేల చదరపు అడుగుల్లో ప్లాట్లు.. ఇంటర్నేషనల్ లెవల్ సౌకర్యాలు, కట్టుదిట్టమైన సెక్యూరిటీ

హైదరాబాద్‌లో ఇంద్ర భవనాలు..
X

దిశ, మేడ్చల్ బ్యూరో : రియల్ ఎస్టేట్ రంగం నయా ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. అందులోనూ హైదరాబాద్ అంతర్జాతీయ హంగులతో అత్యాధునిక నిర్మాణాలకు కేరాఫ్‌గా నిలుస్తోంది. మొన్నటి వరకు 3500 చదరపు అడుగుల్లో నిర్మించే డబుల్, ట్రిపుల్ బెడ్ రూం ఫ్లాట్లనే విశాలమైనవిగా భావించేవారు. కానీ ఇప్పుడు 5వేల నుంచి 16వేల చదరపు అడుగులతో ఐదు, ఆరు బీహెచ్‌కే లగ్జరీ ఫ్లాట్‌లు నిర్మిస్తుండటం విశేషం. దేశంలోనే తొలిసారిగా ఇలాంటి ఫ్లాట్ల నిర్మాణానికి మన భాగ్యనగరం వేదికవుతుందని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. నానక్ రాంగూడ, ఖాజాగూడ, రాయదుర్గం, మాదాపూర్, కోకాపేట, పుప్పాల గూడ, జూబ్లీహిల్స్, కొంపల్లి ప్రాంతాల్లో ఆకాశాన్ని తాకే భవనాల్లో ఆ తరహా ఫ్లాట్‌లు వస్తున్నట్లు తెలియజేస్తున్నారు.

ఆహ్లాదకరంగా పడక గదులు..

ఈ ఫ్లాట్‌‌లలో 1500 నుంచి 2500 ఎస్ఎఫ్‌టీ వరకు మాస్టర్ బెడ్ రూమ్స్‌‌ను నిర్మిస్తున్నారు. వాటిలో ఆధునిక బెడ్స్‌తో పాటు సౌకర్యవంతమైన ఫర్నీచర్, లాంజ్, గదికి అలంకారాన్నిచ్చే షాండ్లియర్స్, స్కోన్లు, పరదాలు ఉంటున్నాయి. మనసుకు ప్రశాంతత, సుఖమైన నిద్ర వచ్చేలా అత్యాధునిక పరుపులు, మూడ్‌కు తగినట్లు మారే లైట్లు, ఇంటిగ్రేటెడ్ బెడ్ సైడ్ లైట్లు, సహజ వెలుతురు వచ్చేలా కిటికీలు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. అందులోనే టీవీ, ఇన్ బిల్డ్ సౌండ్ సిస్టమ్స్ ఉంటున్నాయి. మాస్టర్ బెడ్ రూంలో 600 చదరపు అడుగులకుపైగా విశాలమైన స్నానాల గదులకు చోటు కల్పిస్తున్నారు. అందులో అడుగు పెట్టగానే డబ్ల్యూఐసీ (వాక్ ఇన్ క్లోసెట్) స్వాగతం పలుకుతుంది. దానిలోంచి స్నానాల గదిలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. అందులో బాత్ టబ్, షవర్ విభాగం(అద్దాల గది)లో వివిధ రకాలుగా నీటి చినుకులు పడే సౌకర్యం కల్పిస్తున్నారు.

అత్యాధునిక వసతులు..

లగ్జరీ ఫ్లాట్‌లలో భారీ డైనింగ్, లివింగ్, బెడ్ రూమ్‌లతోపాటు పార్టీ ఏరియా, హోం థియేటర్లు, సిటింగ్ రూమ్స్, మీటింగ్ రూం, పెద్ద పెద్ద బాల్కనీలు ఏర్పాటు చేస్తున్నారు. ఐదు, ఆరు పడక గదులు, విశాలమైన లివింగ్ రూమ్, 10 నుంచి 20 మంది వరకు భోజనాలు చేసేలా టేబుల్స్, కుర్చీలతో డైనింగ్ హాల్, భారీ ఓపెన్ కిచెన్, పూజ గది, జిమ్, హోం ఆఫీస్, ఇంటికి వచ్చే బంధువులు, స్నేహితులకు గదులు ఇలా అన్ని హంగులతో తీర్చిదిద్దుతున్నారు. ప్లాట్‌లోనే ఒక మూల ఏర్పాటు చేసే హోం థియేటర్లు, ఆధునిక ప్రొజెక్టర్లు, కంటికి సౌకర్యవంతమైన తెరలు, 10 నుంచి 20 మంది వీక్షించేలా సిట్టింగ్, సౌండ్ సిస్టం ఏర్పాటు చేస్తున్నారు. ఇళ్లలో పనిచేసుకునేందుకు వీలుగా హోం ఆఫీసులకు చోటు కల్పిస్తున్నారు. పార్టీ ఏరియాలో చిన్న పార్టీలతో సమావేశాలు, శుభకార్యాలు చేసుకునేలా ఏర్పాట్లుచేస్తున్నారు. అదే విధంగా పని మనుషులకు సైతం ఇందులోనే ప్రత్యేక గదులను ఏర్పాటు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు నేరుగా ప్లాట్ లోపలి వైపునకు చేరుకునేలా లిప్ట్‌తోపాటు పనివారు, సందర్శకులకు వేర్వేరు లిప్ట్‌లు ఏర్పాటు చేస్తున్నారు. పాదరక్షలు భద్రపరిచే ఏర్పాట్లు, బయటి వారు వచ్చినప్పుడు సంప్రదించే రిసెప్షన్ గది అందుబాటులో ఉన్నాయి. ఓపెన్ కిచెన్లు, పొగ విస్తరించకుండా చేసే కొత్త రకం చిమ్మీలను ఏర్పాటు చేస్తున్నారు. పెంపుడు జంతువులకూ ప్రత్యేక గదులు నిర్మిస్తున్నారు. అపార్ట్‌మెంట్ వాసులంతా వినియోగించుకునేలా క్లబ్ హౌస్, ఇండోర్ స్టేడియం, క్రీడా వసతులు, స్విమ్మింగ్ పూల్స్, చిన్నారులకు వాటర్ గేమ్స్‌కు అవసరమైన హంగులు సమకూరుస్తున్నారు. ఐటీ సంస్థల్లో ఉన్నతోదోగ్యులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు వీటిని సొంతం చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారని స్థిరాస్తి సంస్థల ప్రతినిధులు తెలియజేస్తున్నారు.

భద్రత పరంగా..

లగ్జరీ ఫ్లాట్లలో భద్రత పరంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరు వస్తున్నారు..? ఎవరు వెళ్లుతున్నారు..? అనే కచ్చితమైన సమాచారం ఉండేలా గేట్ల వద్ద 24/7 భద్రత సిబ్బంది, సీసీటీవీ కెమెరాలతో గట్టి నిఘా ఉంటుంది. విశాలమైన గుమ్మాలు, కట్టుదిట్టమైన సాంకేతికతతో కూడిన సెక్యూరిటీతో భారీ ప్రధాన ద్వారాలను ఏర్పాటు చేస్తున్నారు. టవర్ల చుట్టూ నిరంతరం పహారా కాసేలా సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. నివాసితులు అనుమతిస్తే తప్ప బయటివారు లోపలికి వచ్చేందుకు వీలుండదు. దీంతో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులైనా, వ్యాపారవేత్తలు అయినా పిల్లలు, పెద్దలను ఇంట్లో వదిలి వెళ్లేందుకు ఎలాంటి భయం అక్కర్లేదు.

నలువైపులా..

నానక్ రాంగూడ, మదీనా గూడ, తెల్లాపూర్, నల్లగండ్ల, మియాపూర్, బాచుపల్లి, గుండ్ల పోచంపల్లి, కొంపల్లి ప్రాంతాల్లో 5 వేలు, 10 వేలు, 16 వేల చదరపు అడుగుల్లో ప్లాట్లు సిద్దమవుతున్నాయి. విస్తీర్ణాన్ని బట్టి అంతస్తుకు రెండు, మూడు వరకు ఇలాంటి లగ్జరీ ప్లాట్లను నిర్మిస్తున్నారు. 13 వేల నుంచి 16 వేల చదరపు అడుగుల ఫ్లాట్లను అంతస్తుకు ఒకటి చొప్పున కొందరు బిల్డర్లు నిర్మిస్తున్నారు. ఇటీవల ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో నిర్మిస్తున్న రెండు (ది ట్విన్స్) టవర్లు స్థిరాస్తి రంగ కిరీటంలో కలికితురాయిగా నిలుస్తున్నాయి. మూడున్నర ఎకరాల్లో 44 అంతస్థుల రెండు టవర్లను నిర్మిస్తూ.. ఒక్కో అంతస్తులో 16వేల చదరపు అడుగుల విలాసవంతమైన ప్లాట్‌ను నిర్మించిడం హైలెట్ గా నిలిచింది. అంతస్తుకు ఒకటి చొప్పున 44 అంతస్తుల్లో నిర్మాణం చేపడుతోంది. ఆలా రెండు టవర్లలో 85 ఫ్లాట్లకు చోటు కల్పించింది. మిగితా మూడు అంతస్తుల్లో ఫైవ్ స్టార్ క్లబ్ హౌస్, ఇతర సౌకర్యాలను కల్పిస్తోంది.

Next Story