- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భవిష్యత్తు భద్రత కోసం బీమా.. నేడు జాతీయ ఇన్సూరెన్స్ అవెర్నెస్ డే
ప్రతి ఒక్కరికి భవిష్యత్తుపై ఎన్నో కలలు ఉంటాయి. అవి నెరవేర్చుకోవాలని ఎంతో కష్టపడుతుంటారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రతి ఒక్కరికి భవిష్యత్తుపై ఎన్నో కలలు ఉంటాయి. మంచి ఉద్యోగం, స్వంత ఇల్లు, సుఖసంతోషాలతో నిండిన కుటుంబ జీవితం కోసం ఆరాటపడుతుంటారు. ఆ కలల్ని సాకారం చేసుకోవాలని ప్రతి రోజు కష్టపడుతుంటారు. కానీ, జీవితం అనేది ఎన్నో ఊహించని మలుపులతో నడిచే ప్రయాణం. మనం ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నా, కొన్ని విషయాలు మన నియంత్రణలో ఉండవు. ప్రమాదాలు, అనారోగ్యం, ఆకస్మిక మరణం, ఆస్తి నష్టం వంటి అనేక అనుకోని సంఘటనలు ఒక్కసారిగా మన జీవితాన్ని తలకిందులుగా చేస్తాయి. ఇలాంటి సందర్భాల్లో మనం ముందుగానే సిద్దంగా ఉండాలంటే ఇన్సూరెన్స్ (బీమా) ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. అయితే, నేటికి చాలా మంది బీమా అంటే ఏమిటో తెలియని వారు కూడా ఉన్నారు. అందుకే ప్రతి సంవత్సరం జూన్ 28న 'జాతీయ ఇన్సూరెన్స్ అవెర్నెస్ డే (National Insurance Awareness Day)' జరుపుకుంటూ ప్రజలలో బీమా పట్ల అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తారు. ఈ ప్రత్యేక దినోత్సవం సందర్భంగా అసలు బీమా ప్రయోజనాలేంటో తెలుసుకుందా.
బీమా అంటే ఏంటి?
బీమా అనేది ఒక రకమైన ఆర్థిక రక్షణ ఒప్పందం. జీవితంలో రోగాలు, ప్రమాదాలు, ప్రాకృతిక వైపరీత్యాలు, మరణం వంటి అనుకోని సంఘటనల వల్ల కలిగే నష్టాలను భరిస్తే అది పెద్ద భారం అవుతుంది. అలాంటి సమయంలో బీమా ఉన్నవారికి ఆర్థికంగా సహాయం అందుతుంది. ముందుగా ఒక వ్యక్తి లేదా సంస్థ, అనుకోని నష్టాల నుంచి తాము రక్షించుకునేందుకు బీమా సంస్థకు నిర్దిష్టంగా ఒక మొత్తం (ప్రీమియం) చెల్లిస్తారు. ఎప్పుడైనా నష్టం జరిగితే, ఆ ఒప్పందం ప్రకారం బీమా సంస్థ ఆ నష్టాన్ని పరిహరించడానికి లేదా భర్తీ చేయడానికి అంగీకరిస్తుంది. ఇలా బీమా మనకు భవిష్యత్తులో జరిగే ఆర్థిక నష్టాలకు ముందస్తుగా రక్షణ కల్పిస్తుంది.
బీమా చరిత్ర
బీమా అనే మాట ఇప్పుడు వినాలంటే బ్యాంకులు, ఆసుపత్రులు, పాలసీలు గుర్తుకొస్తాయి. కానీ ఈ ఆర్థిక రక్షణ ఆలోచన ఏనాడో పుట్టింది. ఇన్సూరెన్స్ పద్ధతులు పురాతన చైనాలో ప్రారంభమయ్యాయని చరిత్ర చెబుతుంది. ఐదు వందల ఏళ్ల క్రితమే వ్యాపారంలో నష్టాలను పంచుకునే విధంగా బీమా సూత్రాలు కనిపించాయి. అప్పట్లో వర్తకులు నావికా మార్గాల ద్వారా సరుకులు తరలించేవారు. ప్రయాణంలో ఓడ మునిగితే ఆ సరుకు మొత్తం నష్టపోతారు. దీన్ని నివారించేందుకు ఒకరికొకరు నష్టాన్ని పంచుకునే విధంగా వ్యవస్థలు అభివృద్ధి చేసుకున్నారు. ఇదే బీమా ఆలోచనకు మూలం అయింది. కాలక్రమేణా ఈ ఆలోచన వ్యాపించి, వ్యాపార రంగంలో నిలకడను కలిగించే సాధనంగా మారింది.
17వ శతాబ్దంలో ఇంగ్లాండ్‌లో, ప్రధానంగా లండన్‌లో, వ్యాపార నష్టాలను భర్తీ చేసేందుకు బీమా కంపెనీలు ఏర్పడ్డాయి. లాయిడ్‌స్ ఆఫ్ లండన్ వంటి సంస్థలు సముద్రయానాల్లో ప్రమాదాల కోసం బీమా అందించేవి. ఇవే ఆధునిక బీమా వ్యవస్థకు పునాదులు. ఇక భారతదేశంలో బీమా రంగం 1818లో 'ఆరిఎంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ' స్థాపనతో మొదలైంది. అయితే ఆ కాలంలో ఇది ప్రధానంగా బ్రిటిష్ వారికి మాత్రమే అందుబాటులో ఉండేది. తరువాత భారతీయుల అవసరాల కోసం సంస్థలు ఏర్పడుతూ, బీమా నెమ్మదిగా ప్రజలలోకి ప్రవేశించింది. ఆ తరువాత LIC (Life Insurance Corporation of India) 1956లో ఏర్పడింది. ఇది భారతీయులలో బీమా పట్ల నమ్మకాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని అనేక సంస్థలు జీవిత, ఆరోగ్య, వాహన, ప్రయాణ, వ్యవసాయ తదితర రంగాల్లో బీమాలు అందిస్తున్నాయి.
ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం?
ఒక కుటుంబ పెద్ద అనారోగ్యానికి గురైనపుడు లేదా మరణించినపుడు ఆ కుటుంబం ఒక్కసారిగా ఆర్థిక సంక్షోభంలో పడుతుంది. అయితే జీవన బీమా ఉంటే ఆ కుటుంబానికి కొంత ఆర్థిక భద్రత లభిస్తుంది. ఇదే విధంగా ఆరోగ్య బీమా వల్ల ఆసుపత్రిలో ఖర్చయ్యే లక్షల రూపాయలు నుంచి విముక్తి పొందొచ్చు. ఇంటిని, వాహనాన్ని, వ్యాపారాన్ని కాపాడుకోవాలంటే కూడా బీమా చాలా ముఖ్యం. వరదలు, అగ్ని ప్రమాదం, చోరీల వంటివి ఎప్పుడు వస్తాయో చెప్పలేం. కానీ బీమా ఉంటే అటువంటి నష్టాలను భర్తీ చేసుకోవచ్చు. బీమా ఉన్నప్పుడు మనం భయాలుగా కాకుండా ధైర్యంగా జీవించగలుగుతాం. ఏదైనా సంఘటన జరిగితే 'నా వెనక బలం ఉంది' అనే నమ్మకం మనకు మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది. కొన్ని బీమా పథకాలు కేవలం రక్షణ మాత్రమే కాకుండా పొదుపు, పెట్టుబడి లాభాలనూ కలిగిస్తాయి. జీవిత బీమాలో మూడో దశలో పెద్ద మొత్తం తిరిగి లభించే అవకాశం ఉంటుంది.
ఇక ప్రజలలో బీమా పట్ల అవగాహన పెంపొందించడం కోసం ప్రతి ఏటా జూన్ 28న జాతీయ ఇన్సూరెన్స్ అవెర్నెస్ డే జరుపుకుంటారు. చాలామంది బీమా అవసరాన్ని గుర్తించకుండానే జీవితం కొనసాగిస్తారు. అనేక మంది సరైన బీమా ఎంపిక చేయలేకపోతున్నారు. అందుకే ఈ రోజు ప్రజలకు బీమా ప్రాముఖ్యతను తెలియజేయడం, తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు పొందే మార్గాలను వివరించడం, తప్పుడు బీమా పథకాల నుంచి జాగ్రత్త పడేలా చైతన్యం కల్పించడం వంటివి లక్ష్యంగా వివిధ కార్యాచరణలు, సమావేశాలు, ప్రచారాలు నిర్వహిస్తారు.






