Air quality : ఇంట్లో గాలి కాలుష్యమా? జర భద్రం!

by Javid Pasha |   (  Updated:2025-02-18 08:13:39  IST  )

Air quality : ఇంట్లో గాలి కాలుష్యమా? జర భద్రం!

Air quality : ఇంట్లో గాలి కాలుష్యమా? జర భద్రం!
X

దిశ, ఫీచర్స్

అలసిపోతే అరుగు మీద సేదతీరనీకె ఇంటి ముందు వేపచెట్టు..

ఎండ కొడితే చల్లగాలికోసం పెరట్లో కానుగ చెట్టు..

ఒకప్పుడు అట్లనే ఉండేది ప్రజల బతుకు..

ఇక పల్లెటూర్లైతే చెప్పనవసరం లేదు..

ఏ చెట్లపోంటో, గట్లపోంటో తిరుగాడుతుంటే

కాలుష్యమనే మాటే ఉండేది కాదు. కానీ ఇప్పుడలా కాదు..

ఏ ప్రాంతంలోని గాలిలో ఏ కాలుష్య కారకాలున్నాయో తెల్వదు

అందుకే జరభద్రం అంటున్నారు నిపుణులు.

ప్రకృతి, పరిసరాలు, వాతావరణం ఇప్పుడంతా స్వచ్ఛంగా ఏమీ ఉండట్లేదు. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో మరీ దారుణం. ఓ వైపు వాయు కాలుష్యం, మరో వైపు కాంతి కాలుష్యం, ఇంకో వైపు శబ్ద కాలుష్యాల నడుమ బతకాల్సిన పరిస్థితి. అయినా తప్పట్లేదు. ఎందుకంటే.. స్వయం సంపూర్ణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలాక అక్కడ బతకడానికి ఉపాధి మార్గాలు తగ్గిపోయాయి. వ్యవసాయం అంత లాభసాటిగా ఉంటలేదు. అందుకే బతుకు దెరువు కోసం ఎక్కువ మంది పట్నం బాట పడుతున్నారు. ఇక్కడేమో రకరకాల సమస్యలు, సవాళ్లు ఎదురవుతున్నాయి. ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. అలాంటి వాటిలో గాలి కాలుష్యం కూడా ఒకటి.

వ్యాధుల ముప్పు

మన దేశంలోనే కాదు, వాయు కాలుష్యం ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యగా మారింది. ఏటా 70 లక్షల మంది మరణాలకు కారణం అవుతోంది. కేవలం గాలి పీల్చుకోవడంవల్ల ప్రతీ పదిమందిలో 9 మంది శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, ఊపిరి తిత్తుల క్యాన్సర్, స్ట్రోక్, ఆస్తమా వంటి వ్యాధుల ముప్పును ఎదుర్కొంటున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. యూఎస్ ఎన్విరాన్ మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ పరిశోధనల ప్రకారం.. అతి సూక్ష్మ కాలుష్య కారకాలు ఈ దేశం, ఆ దేశం అని కాదు, ప్రపంచ వ్యాప్తంగా అంతటా ఉంటున్నాయి. అవి మనకు కీడు చేస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే.. కాలుష్య ప్రభావం తరచుగా బయటికన్నా ఇంటి లోపలే రెండు నుంచి ఐదు రెట్లు అధికంగా ఉంటుందని కూడా నిపుణులు పేర్కొంటున్నారు.

కాలుష్య కారకాలు

ఇంట్లో వంట చేయడం మొదలు కొని క్లీన్ చేసే ప్రొడక్ట్స్ వరకు వాటి నుంచి వెలువడే వాయువులు, రసాయనాలు వంటివి కూడా గాలి నాణ్యతను దెబ్బతీస్తుంటాయి. ఇంటిలో గాలి కాలుష్యానికి కారణం అవుతుంటాయి. అయితే ఇవి మన ఆరోగ్యాలపై ప్రభావం చూపకుండా, ఇంటిలో గాలి నాణ్యతను మెరుగు పర్చుకోవడానికి పలు మార్గాలు కూడా ఉన్నాయి. విధానపరమైన మార్పులకోసం ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రజలుగా మనం కూడా పచ్చని ప్రకృతిని కాపాడుకోవడం, ఇంటి ముందు చెట్లు పెంచుకోవడం వంటివి చేయవచ్చు. పర్యావరణంపట్ల బాధ్యతగా ఉన్నప్పుడు, ఆరోగ్యం గురించి ఆలోచించినప్పుడు గాలి కాలుష్యాన్ని తగ్గించుకునేందుకు అనేక అవకాశాలు కనిపిస్తాయి.

వెంటిలేషన్ పెంచండి

ఇంటి లోపలికి గాలి రాకపోకలు (వెంటిలేషన్) సరిగ్గా లేకపోయినా కాలుష్య కారగాలు గాలిలోనే ఉండిపోతాయి. అయితే వెంటిలేషన్ వల్ల ఎప్పటికప్పుడు తాజా గాలి లోపలికి రావడానికి వీలుంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే మీ ఇంటికి వెంటిలేషన్ సక్రమంగా ఉండేలా చూసుకోవాలంటున్నారు. అందుకోసం డైలీ రెండు మూడుసార్లు ఇంటి తలుపులు, కిటికీలు పూర్తిగా తెరిచి ఉంచడం మంచిది. దీనివల్ల స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. అట్లనేమ మీకు అలర్జీలు, బయట విపరీతమైన ఉష్ణోగ్రతలు ఉంటే గనుక ఫిల్టర్డ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ ద్వారా ఇంట్లో వెంటిలేషన్ సరిగ్గా ఉండేలా చూసుకోవచ్చు.

ఇండోర్ ప్లాంట్లతో మేలు

కొందరు ఇంటిలో స్వచ్ఛమైన గాలికోసం, కాలుష్య నివారణ కోసం ఖరీదైన ఎయిర్ ఫిల్టర్లు కొనేస్తుంటారు. కానీ అందరికీ, అన్ని సందర్భాల్లో అది సాధ్యం కాదు. దానికంటే బెటర్ ఇంటిలో, ఇంటి ఆవరణలో మొక్కలు పెంచడం మంచిది. ఇండోర్ ప్లాంట్లతో ఇంటిలోని ఖాళీ ప్రదేశాలను నింపేస్తే చాలు. స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. ఎందుకంటే కొన్ని రకాల ఇండోర్ ప్లాంట్లలో ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి గాలిలోని విష పదార్థాలను తొలగిస్తాయి.

అరికా పామ్, డెవిల్స్ ఐవీ

ఇంట్లో పెంచుకునే మొక్కల విషయానికి వస్తే అరికా పామ్ ఒకటి. గాలిని ప్రక్షాళన చేయగల గుణాలు ఇందులో ఎక్కువగా ఉన్నాయని నాసా నిర్వహించిన ‘క్లీర్ ఎయిర్’ అధ్యయనంలో వెల్లడైంది. ఇది కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చుకుంటుంది. మనకు స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను అందిస్తుంది. ఇక గాలి కాలుష్యాన్ని తగ్గించి నాణ్యతను పెంచే మరో మొక్క డెవిల్స్ ఐవీ లేదా మనీ ప్లాంట్. ఈ తీగను ఇంట్లో పెంచుకుంటే చేతినిండా డబ్బు ఉంటుందని పెద్దలు చెప్పడం వెనుక అసలు ఉద్దేశం ఇదే. ఈ తీగ మొక్క గాలిని ఫిల్టర్ చేసి కాలుష్యాన్ని తొలగించడంలో సహాపడుతుంది. ముఖ్యంగా సింథటిక్ పెయింట్లు, కార్పెట్ల నుంచి రిలీజ్ అయ్యే వొలాటైల్ ఆర్గానిక్ కాంపౌండ్లు (వీఓసీలు)ను తొలగిస్తుంది.

డ్రాగన్ ట్రీ, స్నేక్ ప్లాంట్

డ్రాగన్ ట్రీ మొక్క పుట్టినిల్లు తూర్పు ఆఫ్రికా. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉంటున్నది. దీనిని ఇంట్లో, ఆఫీసుల్లో అలంకరణగా పెంచుతుంటారు. ఇది గాలి నాణ్యతను పెంచుతుంది. బెంజీన్, ఫార్మాల్డా హైడ్, టొల్యూన్, క్జైలీన్ వంటి గాలిలోని విష పదార్థాలను తగ్గించడంలో సహాయపడుతుంది. దీంతోపాటు స్నేక్ ప్లాంట్ కూడా గాలి నాణ్యతను పెంచుతుంది. ఇది రాత్రి సమయంలో కార్బన్ డై ఆక్సైడ్ ను పీల్చుకుంటుంది. ఫార్మాల్డి హైడ్, నైట్రోజన్ ఆక్సైడ్‌లను తొలగిస్తుంది.

వేప, కానుగ, కలబంద

వేప చెట్టు, కానుగ చెట్టు గురించి భారతీయులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇవి ఔషధ గుణాలున్న చెట్లు. అందుకే ప్రతీ ఇంటి ముందు ఒక వేపచెట్టును పెంచేవారు మన పెద్దలు. అలాగే కానుగ చెట్టును కూడా ఇంటి పెరట్లో పెంచుతారు. కానుగ చెట్టు నీడలో చాలా చల్లగా ఉంటుంది. అంతేకాకుండా ఇది కూడా ఔషధ గుణాలున్న చెట్టు. కలబందలో కూడా గాలి నాణ్యతను పెంచే గుణాలున్నాయి. అందుకే ఈ చెట్లను ఇంటి ముందు పెరట్లో, వీధుల్లో పెంచడం గాలి కాలుష్యాన్ని తగ్గిస్తుంది.

ఇది గుర్తుంచుకోండి

ఇండోర్ ప్లాంట్లను పెంచడమే కాకుండా అవి ఆరోగ్యంగా ఉండేలా కూడా చూసుకోవాలి. ఎందుకంటే కొన్ని రకాల మొక్కలు వాడిపోతేనో, కుళ్లిపోతేనే గాలిలోకి బయోలాజికల్ కాలుష్యాలను విడుదల చేస్తాయి. అంటే అవి సజీవంగా, ఆరోగ్యంగా ఉన్నప్పుడు గాలి కాలుష్యాన్ని తగ్గిస్తాయి. లేకుంటే పెంచుతాయి. దీంతోపాటు ధూమపానం తగ్గించడం, వ్యర్థాలను కాల్చడం వంటివి కూడా ఇండ్లల్లో, ఇంటి పరిసరాల్లో, వీధుల్లో చేయకూడదు.

Next Story