బొడ్డెమ్మ బొడ్డెమ్మా కోల్.. బతుకమ్మకు బొడ్డెమ్మకు తేడా ఏంటో తెలుసా.?

by Daayi Srishailam |   (  Updated:2025-09-14 10:43:09  IST  )

పెండ్లిగాని పడుచు పిల్లల సంబరం. మట్టితో బొడ్డెమ్మను చేసి పూలతో అలంకరిస్తారు

బొడ్డెమ్మ బొడ్డెమ్మా కోల్.. బతుకమ్మకు బొడ్డెమ్మకు తేడా ఏంటో తెలుసా.?
X

దిశ, ఫీచర్స్: మట్టిని.. పూలను పూజించే సంస్కృతి మనది. ఆ సంస్కృతిలో భాగమే బతుకమ్మ, బొడ్డెమ్మ, గౌరమ్మ. డీజే పాటలతోనో.. జానపదాల ఊపుతోనే మొత్తానికి బతుకమ్మ శిఖరపు అంచులదాక వెళ్లింది. కానీ బొడ్డెమ్మ విశిష్టత నేటి యువతకు అంతగా తెలవదు. ఇది పెండ్లిగాని పడుచు పిల్లల సంబరం. మట్టితో బొడ్డెమ్మను చేసి పూలతో అలంకరిస్తారు.

బొడ్డెమ్మకు కొనసాగింపే..

శాస్త్రం ప్రకారం చూస్తే.. బొడ్డెమ్మ పండుగ భాద్రపద మాసంలో బహుల పంచమి నుంచి పెత్తరమాస దాక 9 రోజుల పాటు సాగుతుంది. బొడ్డెమ్మకు కొనసాగింపే బతుకమ్మ. పుట్టమన్నుతో గోపురం చేసి.. దానిమీద తంగేడుపూలతో అలంకరిస్తారు. కలశంలో బియ్యం నింపి కొత్త రైకబట్టను కప్పి.. పసుపుతో గౌరమ్మను చేసి పెడతారు. దినాం పొద్దుమూకంగా పిల్లలు, పెండ్లిగాని పడుచు అమ్మాయిలు, మహిళలు బొడ్డెమ్మ చుట్టూ పాటలు పాడుతారు. పప్పు బెల్లాలు నైవేద్యం పెడతారు. ఆఖరినాడు కలశంలోని బియ్యంతో పరమాన్నం వండి వాయినం ఇస్తుంటారు. ఇప్పటి జనరేషన్ చూడని గొప్ప సంబరం బొడ్డెమ్మ.

ఇష్టమొచ్చినప్పుడు చేసేది..

అప్పట్లో ఏ ఊర్లో చూసినా పొద్దుమూకే యాళ్లకు హన్మండ్ల కాడనో, కచ్చీర్ కాడనో జమయ్యేటోళ్లు జనాలు. ఊర్లపొంటి ఎక్కువగా బాగోతాలు ఆడుతుండె. ఒకరకంగా అవే అప్పటి కల్చరల్ ఈవెంట్లు. బాగోతాలున్నా లేకపోయినా పెండ్లిగాని ఆడిపిల్లలంతా "బొడ్డెమ్మాట" ఆడేటోళ్లు. బొడ్డెమ్మ మట్టితో, పూలతో సంబంధం ఉన్న పండుగ. ఇప్పుడంటే బతుకమ్మ పండుగ వచ్చే ముందు బొడ్డెమ్మను చేస్తుండ్రుగానీ.. అప్పుడు అమ్మాయిలు వాళ్లకిష్టమొచ్చినప్పుడల్లా చేసేటోళ్లు. ఫలానా రోజునాడే చెయ్యాలె.. ఫలానా పండగనాడే జరుపుకోవాలె అనేదేం లేకుంటుండె. బొడ్డెమ్మ గొప్పదనమేందంటే సబ్బండ వర్గాలూ వచ్చేటోళ్లు.

బొడ్డెమ్మల పున్నం జోరు..

ఇప్పుడు అత్త బిజీ.. కోడలు బిజీ. ఎవరి టీవీ వాళ్లది.. ఎవరి సీరియల్ వాళ్లది. ఒకప్పుడు అత్తా కోడళ్లు, యారాళ్లు, వదిన మరదళ్లు కలిసి బొడ్డెమ్మ ఆడేది. పడుచు పిల్లలు నాయినమ్మ, అమ్మ దగ్గర తీరొక్క పాటలు నేర్సుకొని మురిసిపోతుండె. బొడ్డెమ్మను, బతుకమ్మను కలిపేసి ఆడకపోయేది. బొడ్డెమ్మ పండుగ వేరే. బతుకమ్మ పండుగ వేరే ఉండేది. బొడ్డెమ్మల పున్నమొచ్చిందంటే ఊర్లపొంటి జాతరలెక్కనే ఉండేది. పున్నమి వెళ్లినంక వారం పది రోజులకు బొడ్డెమ్మ పండుగ చేద్దురు. కన్నె పిల్లల జోష్ మామూలుగా ఉండకపోయేది. కొందరికి బొడ్డెమ్మ ఇంటి ఆచారం ఉండేది. వాళ్లు ఉపాసముండి బొడ్డెమ్మను పేర్చెటోళ్లు.

పెత్తరమాస నుంచి..

మొత్తం డీజేలే మోగుతున్నయి ఈ రోజులల్ల. వినాయక మండపాల కాడ చూసినం కదా.. ఆడొళ్లు, పడుచు పిల్లలంతా డీజే పాటలకు డ్యాన్సులేసి మస్తు ఎంజాయ్ చేసిండ్రు. ఇక దాండియా ముచ్చటైతే చెప్ప వశంగాదు. ఓ పది పాటలుంటే దాంట్లో ఆరేడు దాండియా పాటలే ఉంటాయి. అట్లా బొడ్డెమ్మ లాంటి గ్రామీణ యువతుల పండుగలు కనుమరుగైపోతున్నయి. బతుకమ్మ డీజే పాటలు పెట్టుకొని ఎగిరే ఏ ఒక్కరికీ బొడ్డెమ్మ గురించి తెలవదు. అప్పుడైతే బొడ్డెమ్మ లేవనిదే బతుకమ్మ చేయకపోయేది. బొడ్డెమ్మ కథ మొత్తం ఒడిశినంకనే పెత్తరమాస నుంచి బతుకమ్మ షురవుయ్యేది.

దేవతలొచ్చే యాళ్ల..

బతుకమ్మ పండుగ ఇంకో వారం పది రోజులు ఉందనగా పుట్టమన్ను తీసుకొచ్చి.. పీటెమీద పుదిచ్చి.. తొమ్మిది గుంతలు చేస్తుండె. వాటిలో బియ్యం పోసేది. గౌరమ్మను చేసి కన్నె పిల్లలతో పూజ చేయిస్తుండె. తొమ్మిది రోజుల పాటు బొడ్డెమ్మకు ఎర్రమన్నుతో అలికి ముగ్గులేస్తుండె. రోజుకో నైవేధ్యం పెట్టి పూజలు చేసేటోళ్లు. బొడ్డెమ్మ చుట్టూ బొడ్డెమ్మ బొడ్డెమ్మా కోల్. బిడ్డాలెందారే కోల్ అని పాటలు పాడుకుంటూ ఆడుకునేది. పొద్దుమూకే యాళ్ల ఇట్లా చేస్తే ఇండ్లళ్లకు దేవానుదేవతలు వస్తారనేది ఒక నమ్మకం. పెండ్లిగాని పిల్లలు బొడ్డెమ్మకు మొక్కితే మంచి భర్త దొరుకుతాడని అనేవాళ్లు.

Next Story