బంతిపూలతో.. కోట్లు పూయిస్తున్నాడు.!

by Daayi Srishailam |

పూలకు సరికొత్త మార్కెటింగ్ హంగులను తీసుకొచ్చి ఇంటింటా పూలబుట్టను అందిస్తున్నాడు

బంతిపూలతో.. కోట్లు పూయిస్తున్నాడు.!
X

దిశ, ఫీచర్స్: పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని కోలాఘాట్లో బంతిపూల లేత పసుపు రంగులు, సున్నితమైన గులాబీలతో కళకళలాడుతుంది. ఈ రంగుల సందడిలో అరుప్ కుమార్ ఘోష్ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. పూలకు సరికొత్త మార్కెటింగ్ హంగులను తీసుకొచ్చి ఇంటింటా పూలబుట్టను అందిస్తున్నాడు.

చదువు మానేసి..

2010లో అరుప్ డిగ్రీ ఫస్టియర్‌లోనే చదువు మానేసి హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ పూల మార్కెట్‌లోని ఒక దుకాణంలో పనికి కుదిరాడు. అప్పుడు అతని సంపాదన నెలకు రూ. 3,500. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు డ్యూటీ. పూలు కోలాఘాట్ నుంచి హైదరాబాద్ మార్కెట్‌కు వచ్చేవి. కొంతకాలం తర్వాత అరుప్ చిన్నగా పూల వ్యాపారాన్ని ప్రారంభించాడు. కోలాఘాట్ పూల మార్కెట్ నుంచి రూ. 120కి బంతిపూల దండలను కొని, వాటిని స్థానిక మార్కెట్లలో రూ. 140-150కి విక్రయించేవాడు. ప్రతి 100 దండలకు రూ. 2,000 నుంచి 3,000 లాభం సంపాదించాడు.

బ్యాంకాక్‌లో శిక్షణ

అరుప్ ఆత్మవిశ్వాసం పెరిగిన కొద్దీ పెద్ద కలలు కన్నాడు. పూల వ్యాపారం చేయడం కాకుండా వాటిని స్వయంగా సాగు చేయాలని నిర్ణయించాడు. 2011లో బంతిపూల సాగును ప్రయోగాత్మకంగా ప్రారంభించడానికి రెండు బిఘాల భూమిని లీజుకు తీసుకున్నాడు. రూ. 12,000 పెట్టుబడి పెట్టాడు. మొదట్లో నష్టాలు చవిచూశాడు. కానీ ఇది వదిలేసి వేరే పనికి వెళ్లే సాహసం చేయలేక పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనుకున్నాడు. నాణ్యమైన బంతిపూల రకాల గురించి తెలుసుకోవడానికి అతను థాయిలాండ్‌కు వెళ్లాడు. బ్యాంకాక్ బ్లాసమ్ మార్కెట్‌లో ఆర్నె్ళ్లపాటు శిక్షణ తీసుకున్నాడు.

మంచి మార్కెట్

శిక్షణలో అరుప్ టెన్నిస్ బాల్ గండపూల రకం గురించి తెలుసుకున్నాడు. ఇది ప్రకాశవంతమైన గుండ్రని పూలతో ఉంటుంది. 25 గ్రాముల పసుపు, నారింజ రంగు టెన్నిస్ బాల్ బంతిపూల విత్తనాలను తీసుకొచ్చి రెండు బిఘా భూమిలో సాగు చేశాడు. శిక్షణలో నేర్చుకున్న జ్ఞానాన్ని ఉపయోగించి సొంతంగా విత్తనాలు, మొక్కలను ఉత్పత్తి చేశాడు. పూల నాణ్యత మెరుగైంది. గుజరాత్, హైదరాబాద్, లక్నో, కాన్పూర్, ఢిల్లీ, అయోధ్య, అలహాబాద్, రాజస్థాన్ వంటి నగరాలకు రవాణా చేయడం ప్రారంభించాడు. మంచి మార్కెట్ లభించింది.

రూ. 7 కోట్ల ఆదాయం

అరుప్ వ్యవసాయ క్షేత్రం ఇప్పుడు 73 బిఘాలకు విస్తరించింది. అంటే సుమారు 29.2 ఎకరాలు. దీంట్లో నారింజ, పసుపు, ఎరుపు రంగు బంతిపూల రకాలను సాగు చేస్తున్నాడు. పూలను, విత్తనాలను గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి వచ్చే రైతలకు విక్రయిస్తున్నాడు. పంట సీజన్‌లో తన పొలంలో రోజూ 800 నుంచి 1,000 కిలోల పూలను ఉత్పత్తి అవుతుంది. హైదరాబాద్, కోలాఘాట్, హౌరా టోకు మార్కెట్లలో విక్రయిస్తారు. ఇప్పుడు అరుప్ బంతిపూలతో సంవత్సరానికి రూ. 6.35 కోట్ల నుంచి రూ. 7.35 కోట్లు సంపాదిస్తున్నాడు.

Next Story