- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇట్లుండెరా పల్లెలిట్లుండెరా.. డిజిటల్ డిటాక్స్ హలగా.!
ప్రతిరోజు సాయంత్రం రెండు గంటల పాటు అన్ని స్క్రీన్లను ఆఫ్ చేస్తారు.

దిశ, ఫీచర్స్: ఇప్పుడంతా డిజిటల్ యుగం. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరి జీవితంలో మొబైల్ ఫోన్లు.. టీవీలు.. స్క్రీన్లు భాగమైపోయాయి. మరీ ముఖ్యంగా పిల్లలకు ఇదొక సమస్యగా మారింది. ఇవేవీ లేని రోజుల్లో మనం ఎలా ఉండేవాళ్లం.? మనుషుల మధ్య ఎలాంటి అనుబంధాలు ఉండేవి.? వంటివన్నీ మళ్లీ పొందేందుకు డిజిటల్ స్క్రీన్లు లేని రోజులను గుర్తుచేస్తోంది కర్ణాటకలోని హలగా గ్రామం.
సాయంత్రం సైరన్..
బెలగావి జిల్లాలోని హలగా గ్రామంలో ప్రతిరోజు సాయంత్రం రెండు గంటల పాటు అన్ని స్క్రీన్లను ఆఫ్ చేసి పిల్లల చదువు.. కుటుంబ బంధాలు పెంచుకోవడానికి ''డిజిటల్ డిటాక్స్'' అమలు చేస్తున్నారు. సాయంత్రం 7 గంటలకు సైరన్ మోగుతుంది. సైరన్ మోగగానే టీవీలు.. మొబైల్ ఫోన్లు.. ల్యాప్‌టాప్‌లు.. ట్యాబ్‌లెట్‌లు అన్నీ ఆఫ్ చేయాలి. 9 గంటలకు మరో సైరన్ మోగుతుంది. రెండో సైరన్ మోగినంకనే స్క్రీన్లు ఆన్ చేయాలి. ఈ ప్రయోగం డిసెంబర్ 17, 2025 నుంచి ప్రారంభమైంది. మొదట్లో కొంత కష్టంగా అనిపించినా ఇప్పుడిది హలగా రోజువారీ జీవితంలో భాగమైపోయింది.
స్క్రీన్ అడిక్షన్ వైరస్..
కోవిడ్ సమయంలో ఆన్‌లైన్ క్లాసుల కోసం మొబైల్ ఫోన్లు ఎక్కువగా ఉపయోగించడం వల్ల పిల్లల్లో స్క్రీన్ అడిక్షన్ పెరిగింది. దీంతో చదువు.. ప్రవర్తన.. కుటుంబ సంబంధాలు దెబ్బతిన్నాయి. అప్పటి సర్పంచ్ సదానంద బసవంత్ బిల్గోజి ఆధ్వర్యంలో ఈ సమస్యను పరిష్కరించడానికి డిజిటల్ డిటాక్స్‌ను స్టార్ట్ చేశారు. గ్రామంలో సుమారు 8,500 నుంచి 12,000 మంది జనాభా ఉంటుంది. వారిలో 2,000 మంది పిల్లలు ఉంటారు. 2021లో కోవిడ్ వైరస్‌ను ఓడించాం కానీ స్క్రీన్ అడిక్షన్ అనే కొత్త వైరస్ వచ్చేసింది. దీన్ని సమిష్టిగా పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ ప్రయోగం చేశారు.
రికార్డుగా నిలిచి..
డిజిటల్ డిటాక్స్ ఆలోచన మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలోని ధులేగావ్ గ్రామం నుంచి స్ఫూర్తిగా తీసుకున్నారు. అక్కడ కూడా సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు మొబైల్.. టీవీ బ్యాన్ చేశారు. హలగా గ్రామ పంచాయతి సభ్యులు దాన్ని చూసి రిజల్యూషన్ పాస్ చేశారు. కర్ణాటక చరిత్రలో గ్రామ పంచాయతి ద్వారా డిజిటల్ డిటాక్స్ అమలు చేయడం ఒక రికార్డుగా నిలిచిపోయింది. ఈ ప్రయోగం తర్వాత గ్రామంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పిల్లలు ఎక్కువ సమయం చదువుకు కేటాయిస్తున్నారు. హోంవర్క్ సకాలంలో పూర్తి చేస్తున్నారు. జనాలు పొరుగువారితో మాట్లాడుకుంటున్నారు. ఇళ్లలో ప్రశాంతత పెరిగింది.
పాత కాలాన్ని గుర్తుచేస్తూ..
హలగా గ్రామం పాటిస్తున్న డిజిటల్ డిటాక్స్ గురించి సోషల్ మీడియాలో వైరల్ అయింది. చాలామంది హలగా గ్రామాన్ని ప్రశంసిస్తున్నారు. టీవీ.. రేడియో లేని కాలంలో పెరిగిన వాళ్లకు మనుషుల సంబంధాల విలువ తెలుసు అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మనమంతా మధ్యరాత్రి వరకు స్క్రోల్ చేస్తుంటే ఒక గ్రామం డిసిప్లిన్‌ను ఎంచుకుంది. యాప్‌లు లేకుండా.. కోపం లేకుండా.. ప్రజలు ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు. పిల్లలు నిమ్మళంగా చదువుతున్నారు అని స్పందిస్తున్నారు. టెక్నాలజీని పూర్తిగా నిషేధించడం కాదు.. సమతుల్యంగా ఉపయోగిస్తూ మానసిక ప్రశాంతతను పొందుతున్నారు.
- Tags
- digital detox






