- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

ఆదివారం వచ్చిందంటే..
ఉదయాన్నే మా అమ్మ..
ఓ చిన్నబ్యాగ్ చేతిలో పెట్టేది.
ఆ బ్యాగులో అరటిపళ్లు, అగరొత్తులు, కొబ్బరికాయ, కర్పూరం, పసుపుకుంకమ, ముగ్గు పొట్లాలు, కుంకుడు కాయలు ఉండేవి.
ఆ లగేజీతో నేను నడుచుకుంటూ..
వీధి చివరన ఉన్న మా అత్తింటికి చేరేవాడిని.
- అడపా దుర్గ
తెలియని అనుభూతి
ఆదివారం రోజున నేను ఎపుడు వస్తానా ? అని ఎదురుచూసే మా సత్తమ్మ బకెట్లో వేడి నీళ్లు పెట్టి రెడీగా ఉండేది. నా సంచిలో కుంకుడుకాయలు తీసి.. దంచి నీటిలో వేసి ఆ రసంతో నాకు తలస్నానం చేయించేది. ఆ రసం కళ్లల్లో కారుతుంటే మంటకి నిద్రమత్తు ఎగిరిపోయేది. నా కండ్లన్నీ అమ్మోరు కళ్లలా ఎర్రగా మారేది. అంతా అయ్యాకా తళతళమెరిసే చెంబులో నీళ్లు, పూజ సామగ్రి చేతికిచ్చి పొలంగట్టు దగ్గరికి పంపించేది. ఆ గట్టు పక్కనే ఆకుపచ్చని చీరలో మెరిసిపోతూ అమ్మవారిలా ఓ పెద్ద ‘వేపచెట్టు’ కనిపించేది . ఆ చెట్టు దగ్గరకి చేరగానే ఒళ్లంతా ఓ తెలియని అనుభూతి
ఓ భయమూ ఉండదు
భక్తి , భయం అన్ని కలగలిసి క్రమశిక్షణతో ఆ ‘సత్తెమ్మచెట్టు’కు మొక్కేవాడిని. వేపచెట్టు మొదలు అమ్మవారి పాదాలుగా భావించి నేల మీద పడిన ఎండిన ఆకులు, పుళ్లలు, వేప గింజలు అన్నీ తీసేసి , శుభ్రం చేసి చెంబులోని నీళ్లతో కడిగి చెట్టు దగ్గర చిన్న ముగ్గు వేసేవాడిని. సత్తెమ్మ చెట్టుకు పసుపు కుంకుమ బొట్టు పెట్టి ఓ పావుగంటలో అలకరించేవాడిని. మా అమ్మలా కనిపించే చెట్టుకి కొబ్బరికాయ కొట్టి, అరటి పళ్లు నైవేద్యం పెట్టి, హరతి ఇచ్చి దండాలు పెట్టేవాడిని. సత్తెమ్మతల్లి మీద భక్తి ఉంటే భయం ఉండదంటూ అమ్మ ఎప్పుడూ చెప్పేది. అలా నేను చూసిన సత్తెమ్మ తల్లి చెట్టు దగ్గరకి ప్రతి ఆదివారం వెళ్లకపోతే మనసు ఏదోలా అయిపోయేది.
చెట్టులో అమ్మతనం
చెట్లలో అమ్మతనాన్ని, దైవాన్ని చూసుకొని ఎదిగిన నా బాల్యం నుంచి ఆ సత్తెమ్మతల్లే నన్ను నడిపిస్తున్న దైవమని బలమైన నమ్మకం. ఇపుడు అక్కడ ఆ వేపచెట్టు ఉందో లేదో తెలియదు. ఎందుకంటే అక్కడ మాకున్న పొలం అమ్మేశారు. మా అత్త మరో ఊరెళ్లిపోయింది. నేను బతుకుతెరువు కోసం పట్టణం వచ్చి ఓ పాతిక సంవత్సరాలు దగ్గరవుతుంది. కానీ..ఆ సత్తెమ్మతల్లి చెట్టు ఆకుపచ్చ చీరతో ఉన్న అమ్మవారిలా నా కళ్లముందే కదలాడుతున్నది.






