ఆస్తి కొనేముందే అన్నీ తెలుసుకుంటే ఎలాంటి డిస్ప్యూట్స్ ఉండవు

by Daayi Srishailam |

ఏ భూ డాక్యుమెంట్ చూసినా.. ఏదో ఒక వివాదం ఉంటుంది

ఆస్తి కొనేముందే అన్నీ తెలుసుకుంటే ఎలాంటి డిస్ప్యూట్స్ ఉండవు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఏ భూమి చూసినా.. ఏ భూ డాక్యుమెంట్ చూసినా.. ఏదో ఒక వివాదం ఉంటుంది. ఈ మధ్య కొనేటప్పుడు బాగానే ఉంటుంది. కానీ పదేండ్ల తర్వాత కేసులేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో 40 ఏండ్ల తర్వాత ఈ ప్రాపర్టీ తమదంటూ కోర్టుకెక్కిన వాళ్లూ ఉన్నారు. ప్లాట్లు, ఇండ్లు అమ్మకుండా కేసుల్లో చిక్కిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. మధ్య దళారులు, బ్రోకర్లు, ఏజెంట్లు.. కమీషన్లకు కక్కుర్తి పడి ఏదేదో చెప్పేస్తారు. వాళ్ల మాటలు నమ్మి కొనుగోలు చేస్తే అంతే సంగతులు. ప్రాపర్టీ కేసుల్లో చిక్కుకుందంటే ఉండలేరు.. అమ్మలేరు.. ఎక్కడికి వెళ్లలేరు. రూ.లక్షలు పోసి కొనే స్థలం వివాదాల్లో చిక్కకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. డిస్ప్యూట్ ఫ్రీ ల్యాండ్ దొరకడం అంత ఈజీ కాదు. సర్వే నంబర్ల వారీగా చూస్తే ఒక ల్యాండ్ క్లాసిఫికేషన్, ప్రాపర్టీ వారీగా చూస్తే మరో క్లాసిఫికేషన్ ఉంటుంది. అలాగే అపార్టుమెంట్లల్లో కూడా ఏ ఫ్లాట్ కొనుగోలు చేయాలన్నది తేల్చుకోవడం కూడా సమస్యగా మారింది. డెవలపర్ ఎన్ని ఫ్లోర్లకు అనుమతులు తీసుకున్నారు? ఎన్ని అంతస్తులు నిర్మించారు? ఇల్లీగల్‌గా ఉండే ఫ్లోర్‌లో ఫ్లాట్స్‌కి కూడా రిజిస్ట్రేషన్ చేయిస్తారు. బ్యాంకర్లతో కూడా మమేకమై లోన్లు ఇప్పిస్తారు. కానీ ఏదో ఒకనాడు చిక్కుల్లో పడడం ఖాయం. అందుకే జీవితాంతం పొదుపు చేసుకున్న సొమ్ముతో సొంతం చేసుకునే సొంతింటికి వెళ్లినా సంతోషం లేకుండా చేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ వివాదాలు చెలరేగే అంశాల్లో క్లారిటీ తెచ్చుకోవడం ఉత్తమమని రియల్ ఎస్టేట్ నిపుణులు సూచిస్తున్నారు. ఆర్ధికంగా, మానసికంగా ఇబ్బందులు పడకుండా.. ఆచితూచి అడుగేయాలి. రియల్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం ఎన్ని చట్టాలు, నిబంధనలు వచ్చినా సామాన్యులను నిండా ముంచేందుకు అనేక దొడ్డిదారి పద్ధతులను అనుసరిస్తున్నారు. ప్రీలాంచ్ మోసాలతో పాటు అనుమతుల్లేకుండా నిర్మాణాలు చేపట్టి, వాటిని విక్రయించడం వంటివి ఇంకా జరుగుతూనే ఉన్నాయి.

హక్కులు ఎవరివి?

డెవలపర్‌కు కన్వేయన్స్ రూపంలో భూమికి స్పష్టమైన, మార్కెట్ చేయదగిన టైటిల్ ఉండాలి. అంటే భూమి హక్కులు ఉండాలి. స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఆ స్థలం వివరాలను చెక్ చేసుకోవాలి. అలాగే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి సదరు భూమిపై ఎలాంటి వివాదాలు, గొడవలు లేవని తెలుసుకోవాలి. క్లాసిఫికేషన్‌పైనా స్పష్టత రావాలి.

అనుమతులు ఉన్నాయా ?

లే అవుట్, బిల్డింగ్ నిర్మాణానికి పక్కాగా మున్సిపల్ అధికారుల అనుమతి ఉందా ? లేదా ? ఇవి లేకుంటే అది అక్రమ నిర్మాణం కిందే లెక్క. ఈ నేపథ్యంలో ఇళ్ల కొనుగోలుదారులు సదరు ప్రాజెక్టుకు అన్ని రకాల అనుమతులూ ఉన్నాయో లేదో క్రాస్ చెక్ చేసుకోవాలి. అలాగే ఎన్ని ఫ్లోర్లకు అనుమతులు ఉన్నాయి? ఎన్ని నిర్మించారు ? మీరు ఎన్నో ఫ్లోర్ లో తీసుకుంటున్నారు ? ఈ విషయాలను తెలుసుకోవాలి.

ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఉందా ?

ప్రాజెక్టు ప్రారంభానికి సంబంధించి కమెన్స్ మెంట్ సర్టిఫికెట్.. అది పూర్తయ్యాక కంప్లీషన్ సర్టిఫికెట్ చాలా ముఖ్యం. ప్రాజెక్టు నిబంధనల ప్రకారమే నిర్మించిందని చెప్పడానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ మంజూరు చేస్తారు. ఇది పొందారా ? లేదా ? పొందలేదంటే అనుకున్న ప్రకారం ప్రాజెక్టును పూర్తి చేయలేదన్నట్లే.

రెరా నంబర్ ఉందా ?

రియల్ ఎస్టేట్ (రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ సంస్థ)లో ప్రతి ప్రాజెక్టు రిజిస్టర్ కావాలి. చేపట్టిన ప్రాజెక్టు పూర్తి వివరాలు ఇస్తే వారికి నంబర్ ఇస్తారు. రెరాల్లో తప్పనిసరిగా నమోదు చేయాలి. రెరా ఆమోదం పొందకుండా ఆయా ప్రాజెక్టుల నిర్మాణం, అమ్మకం చేయొద్దు. ఒకవేళ రెరా నంబర్ లేని ప్రాజెక్టులో మీరు కొనుగోలు చేస్తే ఆ తర్వాత తలెత్తే వివాదాల పరిష్కారం కష్టమవుతుంది. అదే రెరాలో రిజిస్టర్డ్ ప్రాజెక్టులో కొనుగోలు చేస్తే బిల్డర్ మోసం చేసినప్పుడు ఆ సంస్థలో ఫిర్యాదు చేయొచ్చు. నష్టపరిహారం పొందొచ్చు.

ఎన్వోసీలు ఉన్నాయా ?

ఏ ప్రాజెక్టుకైనా ఫైర్ సేఫ్టీ అవసరం. అగ్నిమాపక నియంత్రణ చర్యలు చేపడితే ఫైర్ డిపార్టుమెంట్ ఎన్వోసీ ఇస్తుంది. అలాగే నీటి సరఫరా, ఎలక్ట్రిసిటీ వంటి వాటి నుంచి ఎన్వోసీలు ఉన్నాయా ? లేవా ? తెలుసుకోవాలి.

మీ వాటా ఎంత ?

అపార్టుమెంట్లల్లో ఇంటిని కొనుగోలు చేసినప్పుడు అతి ప్రధానమైనది. ఫ్లాట్ ఎన్ని చదరపు అడుగులు ఉంటుందో సేల్ డీడ్ లో ఉంటుంది. అలాగే అన్‌డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ (యూడీఎస్) .. అంటే మీకూ కొంత స్థలం వస్తుంది. అది ఎన్ని గజాలు అనేది తప్పనిసరిగా సేల్ డీడ్ లో ఉండాలి. అది లేదంటే ఆ ప్రాజెక్టులో ఏదో తిరకాసు ఉన్నట్టే. ప్రతి ఫ్లాట్ యజమానికి సమానమైన ల్యాండ్ ని రిజిస్టర్ చేయాల్సిన బాధ్యత బిల్డర్ దే. అది ఇవ్వనప్పుడు ఆ ఫ్లాట్ అదనంగా నిర్మించి ఉండొచ్చు. అందుకే సేల్ డీడ్ కి వెళ్లే ముందు యూడీఎస్ ఎంత అనేది చూసుకోవాలి.

Next Story