- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దివ్య మిట్టల్ చెప్పే.. పెంపకానికి 12 సూత్రాలు.!
బాధ్యత తల్లులదే అని అంటోంది ఐఏఎస్ ఆఫీసర్ దివ్య మిట్టల్

దిశ, ఫీచర్స్: ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలకు బెటర్ లైఫ్ ఇవ్వాలని చూస్తారు. సమతుల్యమైన వ్యక్తులుగా పెంచాలని కోరుకుంటారు. కానీ.. ఈ రోజుల్లో ఒకరు ఒక సలహా ఇస్తే.. ఇంకొకరు ఇంకో సలహా ఇస్తుంటారు. ఇద్దరు చెప్పేది కరెక్టే అనిపిస్తుంది. కానీ వాటిలో బెటర్ ఏది అని నిర్ణయించుకునే బాధ్యత తల్లులదే అని అంటోంది ఐఏఎస్ ఆఫీసర్ దివ్య మిట్టల్.
ఆత్మవిశ్వాసాన్ని బలోపేతం..
దివ్య తన తల్లి నుంచి నేర్చుకున్న 12 సూత్రాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. తన ఇద్దరు కూతుర్లను పెంచిన అనుభవాల ఆధారంగా ఆమె చెప్పిన పేరెంటింగ్ సూత్రాలు పిల్లలను ధైర్యవంతులుగా.. స్వంత్రులుగా.. మంచి వ్యక్తిత్వంగల వారిగా తీర్చిదిద్దడంలో సహాయపడతాయని చెప్తోంది. ఆమె ట్వి్ట్టర్లో పోస్ట్ చేసిన ఈ 12 పేరెంటింగ్ సూత్రాలకు పోస్ట్ చేసిన కొద్ది సేపటికే 20000 లైక్స్ వచ్చి వైరలయ్యాయి. దివ్య మిట్టల్ చెప్పే ఫస్ట్ సూత్రం.. "నువ్వు ఏదైనా చేయగలవు". ఇది పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని బలపరుస్తుంది. ఇక రెండవ సూత్రం.. "తప్పుల నుంచి నేర్చుకో". పిల్లలకు అప్పుడప్పుడు పడిపోవడానికి కూడా అవకాశం ఇవ్వాలంటుందామె. పడితేనే కదా దాని ఆ లోతెంతో తెలిసేది.?
బాధ్యతాయుత పేరెంటింగ్..
12 సూత్రాల్లో మొదటి నాలుగు సూత్రాలను అస్సలు స్కిప్ చేయొద్దంటోంది. మూడవ సూత్రం ప్రకారం "పోటీలో పాల్గొనేలా చేయాలి". ప్రతీ పోటీలో.. ప్రతీసారి గెలవకపోయినా సరే. కానీ ఆరోగ్యకరమైన పోటీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇంకా వైఫల్యాలను అలవాటు చేస్తుంది. వైఫల్యం నుంచి నేర్చుకున్న పాఠం జీవితాన్ని సక్రమ మార్గంలో తీసుకెళ్తుంది. ఇక దివ్య మిట్టల్ చెప్పే నాలుగో సూత్రం "ప్రమాదాలకు అవకాశం కల్పించు". అంటే ప్రమాదాలను కొనితెచ్చుకోమని కాదు. కొన్ని రిస్కులు చేసేటప్పుడు ప్రమాదాలు జరగొచ్చు. దానికి కూడా సిద్ధంగా ఉంటేనే బాధ్యతాయుతంగా వ్యవహరించడం అలవాటైతుందనే ఆమె ఉద్దేశం. ఈ సూత్రం పిల్లల్లో ధైర్యం.. స్వయం నిర్భరతను పెంచుతుంది.
సానుకూల దృక్పథం..
పిల్లల పెంపకంలో ఐదవ సూత్రం.. "మనస్సు పరిపక్వం చెయ్". ప్రతీ తరం మునుపటి తరాల కంటే ఎక్కువ అవకాశాలు.. వనరులను పొందుతోంది. పేరెంట్స్ ఎదురుకున్న కొరత గురించి చెప్పి పిల్లలపై ఆ ఆలోచనలను విధించొద్దు. ఆరవసూత్రం "ఉదాహరణగా ఉండాలి". పేరెంట్స్ హిపోక్రసీ పిల్లల మనసు బాధపెడుతుంది. కాబట్టీ పిల్లలకొకటి చెప్పి.. పేరెంట్సొకటి చేయొద్దు. ఏడవసూత్రం "చెడు ప్రవర్తనకు ఛాన్స్ లేదు". ప్రయోగాలు.. వైఫల్యాలకు అవకాశమిచ్చినా సరిదిద్దుకోవచ్చు. కానీ చెడు ప్రవర్తన అనేది జీవితాన్ని ఆగం చేస్తుందని చెప్పాలి. ఎనిమిదవ సూత్రం ప్రకారం పిల్లలపై నమ్మకం పెట్టుకోవాలి. నిరాశ చెందొద్దు. ఈ సూత్రాలు పిల్లల్లో సానుకూల దృక్పథాన్ని.. విశ్వాసాన్ని పెంపొందిస్తాయి.
షరతుల్లేని ప్రేమ..
చివరి నాలుగు సూత్రాలు పిల్లల భవిష్యత్‌కు బాటలు వేస్తాయని అంటోంది దివ్య మిట్టల్. ఆమె చెప్పే తొమ్మిదవ సూత్రం ప్రకారం.. ప్రపంచాన్ని అన్వేషించే అవకాశం కల్పించాలి. ఇది వాళ్ల మనసును ఓపెన్‌గా ఉంచుతుంది. "వినే అలవాటు కల్పించు" అనేది పదో సూత్రం. చిన్నప్పుడే వినే ఓపిక అలవడితే పెద్దయ్యాక ఎంతటి సమస్యనైనా సావధానంగా వినే అవకాశం ఉంటంది. పదకొండో సూత్రం "పోల్చుకోకు". ఎవరితోనూ పిల్లల్ని పోల్చొద్దు. ముఖ్యంగా తోబుట్టువులతో. ఇది పెద్దయ్యాక సమస్యలు తెచ్చిపెడుతుంది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ పన్నెండో సూత్రం "సురక్షితమైన ఆశ్రయం". పిల్లలు ఎలాంటి షరతుల్లేకుండా ప్రేమను పొందే అవకాశమిస్తే వారి మానసిక ఆరోగ్యం.. అనుబంధాలు బలోపేతం అవుతాయని దివ్య మిట్టల్ చెప్తోంది.






