నిరాశలో నుంచి పుట్టుకొచ్చిన అవకాశం..! ఆదాయంగా మారి..

by Javid Pasha |   (  Updated:2026-02-28 14:31:28  IST  )

నిరాశలో ఉన్న అతనిలో చిన్న ఆశ మొదలైంది. ప్రతికూల పరిస్థితిని అవకాశంగా మల్చుకోవడంలో సహాయపడింది.

నిరాశలో నుంచి పుట్టుకొచ్చిన అవకాశం..! ఆదాయంగా మారి..
X

దిశ, ఫీచర్స్ : పరిస్థితులన్నీ సక్రమంగా ఉన్నప్పుడు ఎవరైనా ముందుకు వస్తారు. అవి సరిగ్గా లేనప్పుడు ముందుకు వచ్చేవాడే ధైర్యవంతుడు. నిరాశలో ఉన్నప్పుడు ఎవరైనా వెనక్కి తగ్గుతారు. కానీ నిరాశలో కూడా ఆశలవైపు అడుగేస్తూ అవకాశాలకోసం ప్రయత్నించేవాడే నేర్పరి అంటుంటారు పెద్దలు. యువ రైతు హృషికేశ్ జయసింగ్ ధానే (Hrushikesh Jayasing Dhane) సైతం సరిగ్గా అదే చేశాడు. తనకున్న మూడెకరాల పొలాన్ని నమ్ముకున్న అతను ప్రస్తుతం సంవత్సరానికి కోట్లల్లో టర్నోవర్ సాధిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇంతకీ అదెలా సాధ్యమైంది?

మోసం చేసిన కంపెనీ..

అది మహారాష్ట్రలోని సతారా జిల్లాలో గల పదాల గ్రామం. 2007లో ఆ ఊరిలోకి ఓ కంపెనీ తరపు కొందరు వచ్చి.. అలోవెరా పండించాలని, తాము వాటిని కొంటామని, దీంతో రైతులకు ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయని చెప్పారు. ఇది నమ్మిన రైతులు తమ పొలాల్లో కలబంద సాగు చేశారు. కానీ చివరికి అలోవెరా ఫార్మింగ్‌ను ప్రమోట్ చేసిన కంపెనీ వాళ్లెవ్వరూ రాలేదు.. కొనలేదు. దీంతో మోసపోయిన రైతులు చేసేది లేక 4000 వేలకు‌పైగా కలబంద మొక్కలను వదిలేశారు. తమ శ్రమ వృథా అయిందని బాధపడ్డారు. అయితే అదే గ్రామానికి చెందిన హృషికేశ్ జయసింగ్ ధానే కూడా అది చూసి నిరాశ చెందాడు. కానీ ఈ నిరాశలోనే అతనిలో ఏదో చిన్న ఆశ మొదలైంది. ఇదే ప్రతికూల పరిస్థితిని సైతం అవకాశంగా మల్చుకోవడంలో అది సహాయపడింది. చిన్నప్పటి నుంచే పేదరికాన్ని అనుభవిస్తూ అతి కష్టమ్మీద బీఎస్సీ హార్టికల్చర్ పూర్తి చేసిన హృషికేశ్ తన పరిజ్ఞాన్ని ఇక్కడ అవకాశంగా మల్చుకున్నాడు.

పడేసిన మొక్కలతో ప్రారంభమై..

రైతులు పడేసిన కలబంద మొక్కలను తీసుకెళ్లి.. తన మూడెకరాల బంజరు భూమిలో నాటాడు. హార్టికల్చర్ బ్యాక్‌గ్రౌండ్ ఉండటంతో ఎక్స్‌పెరిమెంట్స్ చేశాడు. తన భూమిలోనే ఒకచోట చిన్న ప్రాసెసింగ్ యూనిట్ సెటప్ చేసి, తనకున్న అగ్రికల్చరింగ్ నాలెడ్జ్‌తో ఆర్గానిక్ మెథడ్స్ అప్లై చేశాడు. కలబంద జెల్, సోప్స్, షాంపూ, నేచురల్ పెస్టిసైడ్స్ (ఫిష్ ఆయిల్ + కరంజా మిక్స్) వంటి ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ తయారు చేయడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత వాటిని మొక్కలను అమ్మడమే కాకుండా వాల్యూ అడిషన్ చేశాడు. దీంతో క్రమంగా అతని ఆదాయం పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం సంవత్సరానికి సుమారు 8,000 లీటర్ల ప్రొడక్ట్స్ తయారవుతున్నాయి.

సొంత ఆలోచనతో సక్సెస్ వైపు..

హృశికేశ్ కలబందను రూ. 25కిలో చొప్పున పూణే, ముంబై, థానేలోని ఫార్మా & కాస్మెటిక్ కంపెనీలకు డైరెక్ట్‌గా సప్లై చేస్తున్నాడు. మధ్యవర్తులు లేకపోవడంతో ప్రాఫిట్ మొత్తం తనకే వస్తున్నది. ఇప్పుడు 44 ఏళ్ల వయసులో హృషికేశ్ సంవత్సరానికి రూ. 3.5 కోట్ల టర్నోవర్ సాధిస్తున్నాడు. పెద్ద ఫ్యాక్టరీ లేదు. పెద్ద టీమ్ లేదు. ఉన్నదంతా మూడెకరాల పొలం, చిన్న ప్రాసెసింగ్ యూనిట్ మాత్రమే. ఒకప్పుడు మట్టి ఇంటిలో నివసించే హృశికేశ్ ఇప్పుడు ఇల్లు+ఫార్చ్యూనర్(Fortuner) కారు కలిగి ఉన్నాడు. తన సొంత శ్రమతో, సొంత ఆలోచనతో ఎదిగిన అతని సక్సెస్ జర్నీ కేవలం పదాల గ్రామ ప్రజలకే కాదు. ఎంతోమంది రైతులకు, యువతకు ప్రేరణ అంటున్నారు నిపుణులు.

Next Story