- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Teenage : పిల్లలు మాట వినడం లేదా..? పేరెంట్స్ చేయాల్సింది ఇదే!
Teenage : పిల్లలు మాట వినడం లేదా..? పేరెంట్స్ చేయాల్సింది ఇదే!

దిశ, ఫీచర్స్ : ‘‘పిల్లలు కాదు వాళ్లు పిడుగులు’’ అంటుంటారు పెద్దలు చమత్కారంగా. రియాలిటీలోనూ ఇది నిజమే అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదంటున్నారు నేటి పేరెంట్స్. తమ పిల్లలు ఓ పట్టాన చెప్పింది వినరని, సతాయిస్తుంటారని చెబుతుంటారు. నిపుణులై సైతం ఈ రోజుల్లో పిల్లల్ని పెంచడం పేరెంట్స్‌కు సవాలుగా మారుతోందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా టీనేజర్ల విషయంలో కేర్ తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఎదుగుతున్న కొద్దీ టీనేజర్ల శరీరంలోని హార్మోన్లలో మార్పులు సంభవిస్తుంటాయి. అవి కోపం, చిరాకు, ఆవేశం వంటి భావాలకు కారణం అవుతుంటాయి. దీంతో పిల్లలు తమకు చాలా విషయాలు తెలుసనే భ్రమలో ఉండిపోతారు. తల్లిదండ్రులు, పెద్దలు చెప్పింది వినడానికి ఆసక్తి చూపరు. పైగా ప్రతీ విషయానికి ప్రశ్నించడం మొదలు పెడతారు. అయితే ఇలాంటప్పుడు పిల్లలను కొట్టడం, తిట్టడం, తీవ్రంగా హెచ్చరించడం వంటిది ప్రవర్తనతో వారిలో మార్పు తీసుకురావడం కష్టం. కాబట్టి పేరెంట్స్ కాస్త జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని సూచిస్తున్నారు.
ఓపికగా వినండి
టీనేజ్ అన్నీ తెలుసు అనుకునే తెలిసీ తెలియని వయసు ఇది. ఈ ఏజ్‌లో పిల్లలు పేరెంట్స్ కంటే స్నేహితులవద్ద క్లోజ్‌గా ఉంటూ అన్ని విషయాలు షేర్ చేసుకుంటుంటారు. వయసు రీత్యా వచ్చే సందేహాలు, అనుమానాలు పేరెంట్స్ వద్ద చర్చించడానికి సందేహిస్తుంటారు. అందుకే వారిని అర్థం చేసుకోవాలంటారు నిపుణులు. పేరెంట్స్ తమ టీనేజీ పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండాలని సూచిస్తున్నారు. ‘‘ఏ విషయమైన మాకు చెప్పాలి, చెప్పకుండా చేయోద్దు’’ అంటూ కోపంగా కాకుండా.. ఫ్రెండ్లీగా చెప్పాలి. అట్లనే పిల్లలు చెప్పింది కూడా కాస్త ఓపికగా వినాలి. సమస్య ఏదైనా సరే దాన్ని పరిష్కరిస్తామని భరోసా పేరెంట్స్ భరోసా ఇవ్వగలగాలి. అలా అని పెద్ద పొరపాటులకు తావివ్వకూడదు. పిల్లలకు కోపం వల్ల కలిగే నష్టం గురించి తెలియజేయాలి. దాన్ని ఎలా అధిగమించి, సామరస్యంగా ఎలా మెలగాలో నేర్పించాలి. సమాజం పోకడల గురించి వివరిస్తూ ఎలా మసలుకోవాలో తెలియజేయాలంటున్నారు నిపుణులు.
భావోద్వేగాలను అర్థం చేసుకోండి
టీనేజ్‌లో పిల్లలకు కోపం, భావోద్వేగం ఎక్కువగా ఉంటుంది. ప్రతీ చిన్ని విషయానికి హర్ట్ అవడమో, ఆవేశ పడటమో చేస్తుంటారు. ఎక్కువగా కోప్పడుతుంటారు. అయితే ఈ కోపమే శృతి మించితే అనర్థాలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే పిల్లల కోపానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం పేరెంట్స్ చేయాలి. కొన్ని విషయాల్లో పిల్లలతో కఠినంగా మాట్లాడటం, వాదనకు దిగడం వంటివి కూడా కొందరు చేస్తుంటారు. ఇది మరీ ఎక్కువైతే వాళ్ల మనసును నొప్పిస్తుంది. గొడవకు కారణం అవుతుంది. ఇలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, మనసు తెలుసుకొని, వయసును దృష్టిలో పెట్టుకొని డీల్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
అర్థమయ్యేలా చెప్పండి
టీనేజర్లు తమకు ఎదురైన సమస్యల గురించి చెబుతున్నప్పుడు పేరెంట్స్ తప్పక వినాలి. అంతేగానీ మీరంతే అన్నట్లు పట్టించుకోకుండా ఉండకూడదు. తల్లిదండ్రులు వాళ్ల సమస్యను అర్థం చేసుకోకపోతే, తమ పరిధిలో ఉన్న సమస్యను పరిష్కరించకపోతే పిల్లల్లో అసహనం పెరిగడం, పేరెంట్స్ అంటే గౌరవం తగ్గడం వంటివి కూడా జరుగుతాయి. పేరెంట్స్ తమను ఎప్పుడూ అర్థం చేసుకోరనే భావన ఏర్పడవచ్చు. ఇలా జరగకుండా ఉండాలంటే పిల్లలతో అవసరమైన విషయాల్లో చర్చించాలి. ఆర్థిక, కుటుంబ సమస్యల గురించి వారికి అర్థమయ్యేలా వివరించాలి.
సలహాలు, సూచనలతోపాటు..
టీనేజర్లు అంత ఈజీగా ఇతరుల మాట వినడానికి ఇష్టపడరు. వాళ్లు చేసిందే కరెక్ట్ అని కూడా భ్రమపడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో వారిని తిట్టడం లేదా కొట్టడం వంటివి చేయకకూడదంటున్నారు నిపుణులు. దీని వల్ల పేరెంట్స్‌కు వ్యతిరేకంగా ప్రవర్తించే అవకాశాలే ఎక్కువ. అందుకే పిల్లలు ఆవేశంలో ఉన్నప్పుడో, భావోద్వేగానికి లోనైనప్పుడు అర్థం చేసుకోండి. వాళ్లకి కొంత సమాయన్ని కేటాయించి, మంచి సలహాలు ఇవ్వాలి. అంతేకానీ పేరెంట్స్ తీసుకున్న ప్రతీ నిర్ణయాన్ని పిల్లలపై బలవంతంగా రుద్దాలనుకోవడం కూడా కరెక్ట్ కాదంటున్నారు నిపుణులు.
మంచీ చెడూ వివరించండి
టీనేజర్లు సాధారణంగా యాక్టివ్‌గా ఉంటారు. వాళ్లని ఎప్పుడూ ప్రోత్సహించండి. పిల్లలకు ఏది మంచి, ఏది చెడు అనే విషయాల గురించి చిన్నప్పటి నుండే పేరెంట్స్ అవగాహన కల్పించాలి. బయటకు వెళ్లినప్పుడు ఎలా ఉండాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయాలి. సమాజంలో జరిగే సంఘటనలపై, మోసాలపై పిల్లలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలి. పెద్ద వాళ్లను, సన్నిహితులను గౌరవించడం నేర్పించాలి.
కారణాలు తెలుసుకోండి
కొన్నిసార్లు పిల్లలు దురుసుగా ప్రవర్తిస్తుంటారు. వయసు లేదా పరిస్థితుల ప్రభావంవల్ల కూడా అలా చేయవచ్చు. కాబట్టి పేరెంట్స్ వెంటనే కోపంతో పిల్లలను హర్ట్ చేసేలా చిరాగ్గా మాట్లాడకూడదు. అలా చేయడం వల్ల వాళ్లలో కోపం ఇంకా ఎక్కువ కావచ్చు. మానసిక ఒత్తిడిని లోను కావచ్చు. అందుకే పిల్లలో జాగ్రత్తగా మాట్లాడాలి. వారి చిరాకు, కోపానికి గల కారణాలను ఆరాతీయండి. ప్రశాంతంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత సమస్యకు పరిష్కారం వెతకండి.
గమనిస్తూ ఉండండి
ఇటీవల కాలంలో టీనేజర్లు ఎదుర్కొంటున్న మానసిక సమస్యల్లో డిప్రెషన్ ప్రముఖంగా ఉంటోందని నివేదికలు పేర్కొంటున్నాయి. యుక్త వయస్సులో అనేక కారణాల వల్ల వారు డిప్రెషన్‌కు లోనవుతున్నారు. చదువు, కుటుంబం, పేదరికం, ఆర్థిక ఇబ్బందులు, ఇతరులతో ఎక్కువగా పోల్చుకోవడం వంటి ఏ విషయంలోనైనా మానసిక ఒత్తిడికి గురి అయ్యే అవకాశం లేకపోలేదు. అంతేకాకుండా బయట వేధింపులు, ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొంటున్నా పేరెంట్స్‌కు చెప్పలేక ఇబ్బంది ఆందోళన చెందుతుండవచ్చు. అందుకే పిల్లలను ఎప్పటికప్పుడూ ఓ కంట కనిపెడుతూ.. ఉండాలి. వాళ్లతో కలిసి కూర్చొని ఒక ఫ్రెండ్‌లా.. వారికి సంబంధించిన ప్రతీ విషయాన్ని తెలుసుకురు ప్రయత్నం చేయాలి. అలాగే వాళ్లకి కష్టంగా అనిపించిన వాటిపై శ్రద్ధ తీసుకొని పరిష్కరించాలి. దీంతో తమకు ఏదైనా సమస్య వస్తే పేరెంట్స్‌తో చర్చించవచ్చు అనే ఆలోచన వస్తుంది. తమ పేరెంట్స్ ఉన్నారనే భరోసా కూడా లభిస్తుంది. దీంతో వారు ఇతర వ్యసనాలు, బలహీనతలకు లోనుకాకుండా ఉంటారని నిపుణులు పేర్కొంటున్నారు.
*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించగలరు.






