Earache : చలికాలంలోనే చెవినొప్పి ఎక్కువ..! ఎందుకు వస్తుందో తెలుసా?

by Javid Pasha |

గొంతును, చెవిని కలిపే యుస్టాచియన్ ట్యూబ్‌లో చిక్కటి ద్రవం లాంటి పదార్థం పేరుకుపోవడం, లేదా అది ఘనీభవించి ఉండటంవల్ల కూడా చెవి నొప్పి వస్తుంది.

Earache : చలికాలంలోనే చెవినొప్పి ఎక్కువ..! ఎందుకు వస్తుందో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : చలికాలంలో అనేకమందిని చెవి నొప్పి సమస్య వేధిస్తూ ఉంటుంది. చలి తీవ్రత లేదా చల్లటి గాలులవల్ల ఇది సంభవించే అవకాశాలు ఎక్కువ అంటున్నారు చెవి, ముక్కు, గొంతు సంబంధిత వైద్య నిపుణులు. దీంతోపాటు జలుబు, జ్వరం, గొంతు నొప్పి, గొంతులో గర గర వంటి సమస్యలు కూడా వింటర్‌లో తలెత్తుతుంటాయి. అయితే తరచుగా చలిగాలుల మధ్య పనిచేయాల్సి రావడం, టూ వీలర్‌పై గానీ, ఇతర వాహానాల్లో గానీ ఉదయం లేదా రాత్రిళ్లు జర్నీ చేయాల్సి రావడం వల్ల చల్లటిగాలి చెవిలో చొరబడటం కారణంగా కూడా చెవి నొప్పి, చెవిపోటు వంటివి వచ్చే చాన్స్ ఎక్కువ. ముఖ్యంగా ఏయే సమస్యలు తలెత్తుతాయి? ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

తరచూ వచ్చే చెవి సమస్యలు-జాగ్రత్తలు

*ఇన్ఫెక్షన్ : చలికాలంలో చెవి ఇన్ ఫెక్షన్ పిల్లల్ని, పెద్దల్ని వేధిస్తుంది. చాలాసార్లు జలుబు ఉన్నవారిలో ఇవి తలెత్తుతుంటాయి. చెవిని గొంతుతో కలిపే యుస్టాచియన్ ట్యూబ్ ద్వారా బ్యాక్టీరియా చెవికి వెళ్లడం కారణంగా ఈ సమస్య వస్తుంది. వింటర్‌లో చెవి నొప్పి ఇన్ఫెక్షన్‌కు ఇది ప్రధాన కారణం. ఈ ఇన్ ఫెక్షన్ వల్ల చెవినుంచి ద్రవంలాంటిది కారుతూ దుర్వాసన వెదజల్లుంది.

*ముక్కులో ఇబ్బంది, లేదా మూసుకు పోయిన ఫీలింగ్ : గొంతును, చెవిని కలిపే యుస్టాచియన్ ట్యూబ్‌లో చిక్కటి ద్రవం లాంటి పదార్థం పేరుకుపోవడం, లేదా అది ఘనీభవించి ఉండటంవల్ల కూడా చెవి నొప్పి వస్తుంది. చలికాలంలోనే ఈ సమస్య తరచూ ఎదురవుతూ ఉంటుంది. అంతేగాక జలుబు, దగ్గు, తుమ్ముల కారణంగా చెవి లోపలి భాగంలో, సిరల్లో ఒత్తిడి కలిగి చెవిపోటు లేదా నొప్పి కలుగుతుంది. అందుకే దగ్గు, జలుబు వంటివి కూడా ఐదారు రోజులకు మించి తగ్గకుంటే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించడం బెటర్.

*సైనస్: చలికాలంలో చాలామందిని బాధించే సమస్య ఇది. అలర్జీల వల్ల తుమ్ములు ఎక్కువగా వస్తుంటాయి. ఫలితంగా చెవిలో నొప్పి ప్రారంభం కావచ్చు.

*నరాలపై ప్రభావం : చలిగాలులు చెవిని తాకి, లేదా చెవి రంద్రంలోకి ప్రవేశించి సున్నితమైన నరాలు ప్రభావితం చేస్తాయి. అందుకే తుఫానులు, చల్లటి గాలులు వీస్తున్నప్పుడు చాలామంది చెవి సమస్యను ఎదుర్కోవడం కనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి వాతావరణంలో బయటకు వెళ్లేవారు చెవులను మూసి ఉంచే చర్యలు తీసుకోవాలి. అంటే.. వెచ్చటి రుమాలు కట్టుకోవడమో, క్యాప్ పెట్టుకోవడమో చేయాలి. పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా మసలు కోవాలి అంటున్నారు ఈఎన్‌టి నిపుణులు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story